అనిల్‌కుమార్ భాషబోయిన, ఉమ్మడి పాలమూరులో ఓ యువనేత
తన నియోజకవర్గంలోని పలు మండలాల యువతతో నిత్యం టచ్‌లో ఉంటాడు. ఇటీవల వారికి ఓ వాహనం ఇచ్చి గోవాకు వెళ్లి రమ్మని చేతి ఖర్చులకు డబ్బులు కూడా ఇచ్చాడు. ఉమ్మడి మెదక్‌లో ఓ వివాదాస్పద నేత తన అనుచరులకు ఇదే పని అప్పగించారు. ఇప్పటికే పలువురు యువతకు వాహనాలిచ్చి గోవా ట్రిప్పులకు బండిపెట్టాడు.
కరీంనగర్‌లో మరో నేత
యువతను హైదరాబాద్‌కు పంపుతున్నాడు. సరదాగా పబ్‌కి వెళ్లి రావాలని ఎంట్రీ పాసులు కూడా ఇస్తున్నాడు. కొన్ని జిల్లాల్లో నేతలు మద్యం దుకాణాలు, బార్లతో ముందస్తు ఒప్పందం చేసుకుని. యువతకు మద్యం చీటీలు జారీ చేస్తున్నారు. ఈ చీటీ ఇస్తే తాగినంత మద్యం అందిస్తున్నారు.
‘శతకోటి దరిద్రానికి అనంతకోటి ఉపాయాలు’ అంటారు పెద్దలు. అవినీతి కూడా ఎపుడూ ఒకేలా ఉండదు. నిత్యం తన రూపు మార్చుకుంటూ పోతుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఓటుకు వంద నోటు, క్వార్టర్ మద్యం ఇచ్చే రోజులకు కాలం చెల్లింది. ఓటర్ల రుచులు, అభిరుచులు మారుతున్నాయి. అందుకు తగినట్లుగానే రాజకీయ నాయకులు కూడా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు రంగంలోకి దిగుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం.. దేశంలో 40 శాతం యువత ఉంది. తెలంగాణలో దాదాపుగా 119 నియోజకవర్గాల్లో యువ ఓటర్లు కోటికిపైగానే ఉంటారు. ఈ ఎన్నికలకు మరో 7 లక్షలకుపైగా కొత్త ఓటర్లు వచ్చి చేరారు. ఈ లెక్కలే ప్రామాణికంగా రాజకీయ నేతలు సరికొత్త ప్రలోభాలకు దిగుతున్నారు.
యువతే లక్ష్యంగా..
ప్రతీ నియోజకవర్గంలోనూ యువతే కీలకం. వీరి ఎటువైపు మొగ్గితే వారిదే విజయం. అందుకే, తమ పార్టీ ఓటు బ్యాంకుకు వీరు తోడైతే.. ఇక విజయం నల్లేరు మీద నడకే అని భావిస్తున్నారు. ఈ రోజుల్లో యువత చాలామంది డబ్బులు తీసుకునేందుకు సుముఖంగా లేరు. వారిని నేరుగా కొనలేమని గ్రహించిన రాజకీయ నాయకులు మరోరకంగా వారిని వశం చేసుకుంటున్నారు. అందుకే, యువతను ఆకర్షించడానికి గోవా టూర్లు, హైదరాబాద్ ట్రిప్పులు పెడుతున్నారు. ఎంపిక చేసిన గ్రామాల్లోని మిగిలిన ప్రజల్ని ప్రభావితం చేయగల సామర్థ్యమున్న యువతను ఈ యాత్రలకు పంపుతున్నారు. గెలిస్తే.. మిమ్మల్ని ఇంకా బాగా చూసుకుంటామన్న సంకేతాలు ఇస్తున్నారు. ఈ ప్రచారం ఇప్పటికే బాగానే వర్కవుటవుతోంది. యాత్రలకువెళ్లి వచ్చినవారు వీరికి అనుకూలంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. వీరిని చూపించి వీరి మిత్రులు కూడా ప్రలోభాలకు గురిచేసి తమ వైపు తిప్పకుంటున్నారు రాజకీయ నేతలు.
40 దాటిన వారికి స్కీములు..
యువత విషయంలో ఎలాంటి జాగ్రత్తలైతే పాటిస్తున్నారో.. సరిగ్గా అదేసమయంలో 40 ఏళ్లు దాటినవారి విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటున్నారు. ఎందుకంటే ఓటు హక్కు వినియోగించుకునేవారిలో 40 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళలు అధికం. అందుకే, వీరిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. కొందరు మహిళలకు ఉచితంగా రూ.1000పైన కిరాణా సామాగ్రి ఇప్పిస్తున్నారు. ఆరునెలల పాటు కేబుల్ బిల్లు ఉచితంగా చెల్లిస్తున్నారు.పురుషులకు ఎంపిక చేసిన బార్ షాపుల ద్వారా ఉచితంగా మద్యం సరఫరా చేయిస్తున్నారు. నేరుగా కాకుండా అనుచరుల ద్వారా ముందుగానే ‘మద్యం చీటీలు’ పంపిణీ చేస్తున్నారు
బహుమతుల వల
ట్రిప్పులతో పాటు కాలేజీ కుర్రాళ్లకు క్రికెట్, ఇతర స్పోర్ట్స్ కిట్లు, స్మార్ట్‌ఫోన్లకు రీచార్జ్‌లు, ఫోన్‌పే, పేటీఎంలో రూ.500 నుంచి రూ.1000 వరకు ఖర్చుల కింద ఇస్తున్నారు. కోటి విద్యలూ ఓటు కోసమే అన్నట్లుగా.. యువతకు చేరువ అయ్యేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment