సాక్షి, వరంగల్ రూరల్: త్వరలో జరిగే శాసనసభ ఎన్నికలను పురస్కరించుకుని వరంగల్ రూరల్ జిల్లాలో ఓటర్ల లెక్కను తేల్చారు. తాజాగా అధికార యంత్రాంగం వయస్సుల వారిగా ఓటర్ల వివరాలను విభజించారు. 18–19 సంవత్సరాల వారికి తొలిసారి ఓటు వేసే అవకాశం దక్కనుంది. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్, ఓటర్ల తుదిజాబితా విడుదల కావడంతో కీలక ఘట్టం ముగిసింది. డిసెంబర్ 7న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు, ఓటములను నిర్దేశించే స్థాయిలో జిల్లాలో యువ ఓటర్లు నమోదు కావడంతో ప్రధాన పార్టీలన్ని వారిని ప్రసన్నం చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నాయి.
వరంగల్ రూరల్ జిల్లాలోని నర్సంపేట, పరకాల నియోజకవర్గాల్లో యువ ఓటర్లు అభ్యర్థుల గెలుపు ఓటముల్లో కీలకం కానున్నారని అంచనా వేస్తున్న అన్ని రాజకీయ పక్షాలు ఈ మేరకు కార్యాచరణను రూపొందించుకుంటున్నాయి. ఇందుకోసం టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలో ప్రత్యేక విభాగాలు పనిచేస్తున్నట్లు సమాచారం. ఎన్నికలకు ఇంకా 41 రోజుల సమయం ఉన్నా క్షేత్ర స్థాయిలో యువ ఓటర్లకు కావాల్సినవి అన్ని సర్దుబాటు చేసేందుకు ఇప్పటి నుంచే గ్రామాల్లో ఆయా పార్టీల నాయకులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి వారికి ప్రసన్నం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్ యువతతో బైక్ ర్యాలీలు నిర్వహిస్తూ యువ ఓటర్లకు గాలం వేస్తున్నారు.
నూతన ఓటర్లు...
జిల్లాలో 3,99,433 మొత్తం ఓటర్లలో సుమారు 30 శాతం వరకు యువ ఓటర్లు ఉన్నారు. తాజాగా విడుదల చేసిన జాబితాలో 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లలోపువారు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు అర్థమవుతుంది. నర్సంపేట నియోజకవర్గంలో కొత్త ఓటర్లు 5,776 మంది నమోదు చేసుకున్నారు. అలాగే పరకాల నియోజకవర్గ పరిధిలో 4,503 మందితో కలిపి మొత్తం 10,279 కొత్త ఓట్లు నమోదు చేసుకున్నారు ఇందులో ఎక్కువ శాతం తొలిసారిగా ఓటు హక్కును నమోదు చేసుకున్నావారే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కొత్తగా ఓటు హక్కును పొందినవారు తమ తొలి ఓటు ఎవరికి వేస్తారోననే ఉత్కంఠ అన్ని పార్టీల్లోనూ నెలకొంది. నవంబర్ 9 వరకు ఓటు నమోదు, సవరణలు, ఓటు బదిలీ చేసుకునే అవకాశం ఉండడంతో మరికొన్ని ఓట్లు పెరిగే అవకాశం ఉంది.
కీలకంగా మారనున్న యువత
ప్రస్తుతం ప్రకటించిన ఓటరు ముసాయిదా ప్రకా రం 18–19 సంవత్సరంలోపు వారు 10,279 మం ది ఓటర్లు ఉన్నారు. అలాగే 20–29 సంవత్సరంలోపు 93,829 మంది ఓటర్లు ఉన్నారు. 30 సంవత్సరాలలోపు వారు 1,04,108 ఓటర్లు ఉన్నారు. దీంతో దాదాపు మొత్తం ఓట్లలో సుమారు 30 శా తం యువతే ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ సారి వీరు ఎటువైపు మొగ్గుచూపుతారో అని పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. పెరిగిన ఓట్లు తమ ను ముంచుతాయో... తేల్చుతాయోనని పార్టీలు భయపడుతున్నాయి. ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్ యువత ఎప్పుడూ కేసీఆర్ పక్షమే అని చెబుతుం టే కాంగ్రెస్ మాత్రం ప్రభుత్వంపై యువతకు తీవ్ర వ్యతిరేతతో ఉందని అందుచేత కొత్త ఓటర్లు తప్పకుండా తమకే ఓటేస్తారనే ధీమాలో ఉన్నారు.
నిరుద్యోగ భృతితో గాలం..
కొత్త ఓటర్లను తమ ఓటు బ్యాంకుగా మలుచుకునేందుకు యువత ప్రాధాన్యాంశాలను పార్టీలు మేనిఫేస్టోలో చేర్చేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే పార్టీలు ప్రకటిస్తున్న మేనిఫేస్టోలు యువ ఓటర్లను ఏ మాత్రం ఆకర్షిస్తాయో చూడాలి. ప్రధాన పార్టీలు అన్నీ రెండూ నిరుద్యోగులకు భృతి కల్పిస్తామని చెబుతున్నాయి. అధికారంలోకి రాగానే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెబుతున్నాయి. రెండు పార్టీలు ఒకే విధంగా చెబుతున్నప్పటికీ యువత మాత్రం ఎటువైపు ఉంటుందో అనే విషయంపై ఇప్పటికీ ఓ స్పష్టత రాలేదు. సాంకేతిక యుగంలో అందరికి టెక్నాలాజీ అందుబాటులోకి రావడంతో వారు తమ అభిమాన పార్టీ నాయకుల పేర్లతో వాట్సప్, ఫేస్‌బుక్ గ్రూపులు క్రియేట్ చేసి ప్రస్తుత రాజకీయ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment