
అన్నా, చెల్లెళ్ల సవాల్!
తెలంగాణ చెల్లెమ్మ ఎట్టకేలకు మౌనం వీడారు. సోదరుడిపై పరోక్షంగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. తనను రాజకీయంగా అణగదొక్కేందుకు యత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. అడుగడుగునా ఆంక్షలు విధిస్తూ అభివృద్ధికి అడ్డుపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఒంటరిని చేసి వెన్నుపోటు పొడవాలనుకున్నారని వాపోయారు. అక్కన్నపేట-మెదక్ రైల్వేలైను శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మాజీ నేత, మెదక్ ఎంపీ విజయశాంతి ఈ వ్యాఖ్యలు చేశారు.
టీఆర్ఎస్ నేతలు తన చావు కోరుకున్నారంటూ విజయశాంతి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న రాములమ్మ తొలిసారి బహిరంగంగా టీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. తనను మెదక్ నియోజకవర్గానికి దూరం చేయాలని గులాబీ నాయకులు శతవిధాలా పయ్నతించారని వెల్లడించారు. అయితే విజయశాంతి వ్యూహాత్మకంగా ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. అన్నపై పోటీ చేసేందుకు ఆమె సిద్ధమవుతున్నట్టు సమాచారం.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్పై విజయశాంతి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. మహబూబ్నగర్ నుంచి మెదక్ నియోజకవర్గానికి మారాలని కేసీఆర్ యోచిస్తున్నారు. గత ఎన్నికల్లో మహబూబ్నగర్లో చావుతప్పి లొట్టబోయిన చందంగా బయటపడిన గులాబీ అధినేత ఈసారి మెదక్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. దీంతో అన్నా, చెల్లెలు మధ్య పేచీ మొదలయిందని చెబుతున్నారు. విజయశాంతిని శాసనసభకు పోటీ చేయాలని అడిగితే ఆమె తిరస్కరించారని, దీంతో వ్యూహాత్మకంగా ఆమెను పార్టీ నుంచి బయటకు పంపారన్న వాదన ఉంది. దీంతో ఆమె కాంగ్రెస్ నుంచి స్వంత నియోజకవర్గంలో విజయశాంతి పోటీకి సిద్ధమతున్నారు.
మెదక్ నుంచి కేసీఆర్ పోటీకి దిగితే కాంగ్రెస్ పార్టీ తరపున విజయశాంతి బరిలోకి దిగుతారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. స్వంత నియోజకవర్గం నుంచి తిరిగి ఎన్నిక కావాలని ఆమె కోరుకుంటున్నారని, ఈ విషయంలో విజయశాంతి వెనకడుగు వేయబోరని పేర్కొన్నాయి. అయితే మెదక్ నుంచి పోటీ చేసే విషయంపై కేసీఆర్ ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ కేసీఆర్ ఇక్కడ నుంచి బరిలోకి దిగితే పోటీ రసవత్తరంగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అన్నా, చెల్లెల సమరం చూడాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.