సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లి వారం దాటిపోయినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె కారణంగా సీఎం కేసీఆర్‌కు చెడ్డపేరు వస్తోందని అన్నారు. ఆదివారం గాంధీభవన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆర్టీíసీ కార్మికుల పట్ల కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదన్నారు.
కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దు: చాడ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు ఆందోళనతో ఆత్మహత్యలు చేసుకోవద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యను కార్మికులు పడుతున్న మానసిక వేదనకు ప్రతీకగా అభివర్ణించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రీనివాసరెడ్డి కుటుంబానికి సానుభూతి తెలిపారు.
పోరాడి సాధించాలి: విజయశాంతి
సాక్షి,హైదరాబాద్: ప్రాణత్యాగం చేసి సీఎం కేసీఆర్ మనసు మార్చే ప్రయత్నం కంటే పోరాడి సాధించాలనే ఆలోచనతో ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యమించాలని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి అన్నారు. పోరాటాల ద్వారానే కేసీఆర్ దొర నియంతృత్వ ధోరణికి చరమగీతం పాడాలన్నారు. ప్రాణత్యాగాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం కేసీఆర్‌కు బాగా తెలిసిన విద్యని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఆత్మహత్యలు వద్దు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదని, భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని ఆదివారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వారిని చర్చలకు ఆహ్వానించాలని సూచించారు.
శ్రీనివాస్‌రెడ్డిది ప్రభుత్వ హత్యే: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో ఆరోపించారు. శ్రీనివాస్‌రెడ్డి మృతి వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రీనివాస్‌రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వమే అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెంది ఆత్మహత్యలు చేసుకోవద్దని, కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.
శ్రీనివాస్‌రెడ్డి మరణం బాధాకరం: కొప్పుల
సాక్షి, జగిత్యాల: ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాస్‌రెడ్డి మరణం బాధాకరమని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదివారం విచారం వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని చెప్పారు. ఇందులో భాగంగానే ఉద్యోగులకు 44 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. కొత్త బస్సుల కొనుగోలు కోసం ప్రభుత్వం రూ.450 కోట్లు కేటాయించిందని తెలిపారు. కొందరు యూనియన్ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం కార్మికులు బలవుతున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment