అసంతృప్తులకు గాలం | Grand Alliance Candidates Are Disappointed | Sakshi
Sakshi News home page

అసంతృప్తులకు గాలం

Published Fri, Nov 16 2018 11:50 AM | Last Updated on Fri, Nov 16 2018 11:51 AM

Grand Alliance Candidates Are  Disappointed - Sakshi

మెదక్‌ అసెంబ్లీ స్థానం నుంచి టీజేఎస్‌ పోటీ చేస్తుందని ప్రకటించడంతో కాంగ్రెస్‌ ఆశావహుల్లో ఆందోళన మొదలైంది. ఇన్నాళ్లు కన్న కలలపై నీళ్లు చల్లినట్లయింది.  టీజేఎస్‌ పోటీ చేస్తుందని తెలియడంతో టీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపైంది. కాంగ్రెస్‌ అధిష్టానం ఈ స్థానాన్ని టీజేఎస్‌కు ఇవ్వడంపై ఆశావహులు గుర్రుగా ఉన్నారు. బీజేపీ నుంచి కూడా స్థానికేతరుడికి టికెట్‌ ఇవ్వనున్నారనే ప్రచారంతో స్థానిక నాయకుల్లో కూడా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ గందరగోళ పరిస్థితిలో టీఆర్‌ఎస్‌ అసంతృప్తులను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నారు. టికెట్‌ దక్కని నేతలు కూడా కండువాలు మార్చేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.    

సాక్షి, మెదక్‌ :  మెదక్‌ అసెంబ్లీ స్థానం నుంచి తెలంగాణ జన సమితి పోటీ చేస్తుందని తెలియడంతో  టీఆర్‌ఎస్‌ నాయకుల్లో ఉత్సాహం పెరిగింది.   మొదటి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి పోటీలో ఉంటారని టీఆర్‌ఎస్‌ భావించింది.  దీంతో ఇక్కడి నుంచి  టికెట్‌ ఆశించిన కాంగ్రెస్‌ పార్టీ ఆశావహుల్లో నైరాశ్యం అలముకుంది.   శ్రేణులు సైతం మెదక్‌ సీటును వదులుకోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. పార్టీ తీరును బాహాటంగానే వారందరూ తప్పుబడుతున్నారు. అయితే తాజాగా టీజేఎస్‌ పేరు తెరపైకి రావడంతో కాంగ్రెస్‌లోని అసంతృప్తులను తమ వైపు తిప్పుకునేందుకు టీఆర్‌ఎస్‌ దృష్టి సారించింది.

 ఆశావహులతో పాటు అసంతృప్తితో ఉన్న ద్వితీయశ్రేణి నాయకులను పార్టీలో చేర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. టీఆర్‌ఎస్‌ నేత దేవేందర్‌రెడ్డి స్వయంగా కాంగ్రెస్‌లోని అసంతృప్త నేతలతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.   తమ పార్టీలో చేరి మద్దతు ఇస్తే వారికి న్యాయం చేస్తామని కాంగ్రెస్‌ నేతలకు నచ్చచెబుతున్నట్లు సమాచారం. పలువురు నేతలు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సముఖంగా ఉన్నట్లు కూడా  తెలుస్తోంది. కాంగ్రెస్‌ అభ్యర్థి బరిలో ఉండరని తెలియడంతో కాంగ్రెస్‌ నాయకులు సైతం పార్టీలు మారేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎమ్మెల్యే టికెట్‌ ఆశించిన నేతలు కాంగ్రెస్‌ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. వీరిని టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవాలని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి పావులు కదుపుతున్నారు.

అసంతృప్త నేతలతో ఆమె కూడా టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 19వ తర్వాత చేరికలపై స్పష్టత ఇస్తామని వారు చెప్పినట్లు సమాచారం. కాగా బీజేపీ నేతలు సైతం పార్టీ తీరుతో కొంత అసంతృప్తితో ఉన్నారు. స్థానికులకు కాకుండా మెదక్‌ టికెట్‌ ఇతరులకు అప్పగించే యోచనలో బీజేపీ అధిష్టానం ఉంది. దీన్ని పసిగట్టిన కొంత మంది బీజేపీ నాయకులు పార్టీ తీరుపై అధిష్టానంపై కోపంగా ఉన్నారు. పార్టీ తీరు నచ్చని బీజేపీ జిల్లా నాయకుడు సుభాష్‌రెడ్డి బుధవారం టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఆయన బాటలోనే మెదక్‌ నియోకజవర్గంలోని పలువురు బీజేపీ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement