‘మెదక్’ టికెట్‌పై రోజుకో ప్రచారం సాగుతోంది. గజ్వేల్‌కు చెందిన నాయకుడు నర్సారెడ్డికి టికెట్ వస్తుందన్న ప్రచారంతో ఆశావహుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. దీంతో ఒక్కసారిగా స్థానికత అంశం తెరపైకి తీసుకొచ్చారు. నిన్నటి వరకు టికెట్ నాదం టే నాది అన్న ఆశావహులు, నేడు స్థానికులమైన తమలో ఒకరికి టికెట్ ఇవ్వాలని, ఎవరికి వచ్చినా కలిసి పనిచేస్తామని అధిష్టానానికి తమ నిర్ణయాన్ని తెలియజేస్తున్నారు. హామీ మేరకే నర్సారెడ్డి కాంగ్రెస్‌లో చేరారన్న అనుచరల మాటలు నాయకులను మరింత కలవర పెడుతున్నాయి.
సాక్షి, మెదక్: మెదక్ నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. నెల రోజులుగా ఎమ్మెల్యే టికెట్‌పై ఉత్కంఠ సాగుతోంది. ఇది వరకే 13 మంది అభ్యర్థులు ఈ స్థానం కోసం పోటీ పడుతున్న విషయం తెలిసిందె. దీనికితోడు స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి బరిలో దిగుతుందా? అన్న ప్రశ్న కూడా వేధిస్తోంది. స్క్రీనింగ్ కమిటీ జాబితా కూడా ఏఐసీసీకి చేరడంతో టికెట్ రాజకీయాలు హస్తినను తాకాయి. ఆశావహులు ఎవరికివారే టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇది ఇలా కొనసాగుతుండగానే తాజాగా తెరపైకి గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన తూంకుంట నర్సారెడ్డి పేరు వచ్చింది. టీఆర్‌ఎస్‌ను వీడి శనివారం ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఆయన మెదక్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ పెద్దలుకూడా మెదక్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని హామీ ఇచ్చిన తర్వాతే నర్సారెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు అంగీకరించారని ఆయన అనుచరులు చెబుతున్నారు. మెదక్ నుంచి నర్సారెడ్డి పోటీ చేస్తారని సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఇది నియోజకవర్గంలోని కాంగ్రెస్‌లో కలవరం రేపుతోంది. 13 మంది అభ్యర్థులు పోటీ పడుతుంటే స్థానికేతరుడైన నర్సారెడ్డికి పేరు తెరపైకి రావడాన్ని ఆశావహులు జీర్ణించుకో లేకపోతున్నారు.
గెలిచే వారికే..
గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన నర్సారెడ్డికి మెదక్ టికెట్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వొద్దని ఆశావహులంతా పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు అధిష్టానం పెద్దలపై వత్తిడి తీసుకువస్తున్నారు. శుక్రవారం రాత్రి పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ను కలిశారు. శనివారం ఆశావహులు మాజీ ఎంపీ, స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి నివాసంలో సమావేశమయ్యారు. కాంగ్రెస్ నేతలు బట్టి జగపతి, సుప్రభాతరావు, తిరుపతిరెడ్డి, బాలకృష్ణ తదితరులంతా సమావేశమై స్థానికులమైన తమలో ఎవరికైనా ఒకరికి టికెట్ ఇవ్వాలని, ఎవ్వరికి టికెట్ ఇచ్చినా అందరం కాంగ్రెస్ గెలుపుకోసం పనిచేస్తామని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విజయశాంతితో సమావేశమైన వీరంతా నర్సారెడ్డికి టికెట్ ఇచ్చే విషయమై ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
స్థానికులకే టికెట్ వచ్చేలా చూడాలని ఆశావహులంతా ఆమెను కోరినట్లు సమాచారం.‘ కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి షరతులు లేకుండా నర్సారెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకుందని, స్థానికులు గెలిచే అభ్యర్థులకు మాత్రమే అధిస్టానం టికెట్ ఇస్తుందని’ ఆశావహులకు విజయశాంతి భరోసా ఇచ్చినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఆయోమయం సృష్టించేందుకే టీఆర్‌ఎస్ పార్టీ నర్సారెడ్డికి కాంగ్రెస్ టికెట్ వస్తుందంటూ తప్పుడు ప్రచారం చేస్తోందని ఓ కాంగ్రెస్ నేత అన్నారు. ఇదిలా ఉంటే నర్సారెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని కొంత మంది ఆశావహులు స్వాగతిస్తున్నారంటూ సాగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. కాగా నర్సారెడ్డి మెదక్ ఎంపీ టికెట్ కోరుతున్నారన్న ప్రచారం కూడా సాగుతోంది.
అధిష్టానం మదిలో ఏముందో..?
ఈ విషయంలో అధిష్టానం మదిలో ఏముందో తెలియక ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న నేతలు, కాంగ్రెస్ శ్రేణులు సతమతం అవుతున్నాయి. టికెట్ ఎవరికి దక్కుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది. నవంబర్ 3 తర్వాత ఎమ్మెల్యే టికెట్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే మహాకూటమిలో భాగంగా మెదక్ టికెట్‌పై తెలంగాణ జన సమితి కూడా ఆశలు పెట్టుకుంది. మెదక్ టికెట్ తమకే వస్తుందని ఆ పార్టీ నేతలు గట్టి చెబుతుండటంతోపాటు ఇటీవల సంబరాలు సైతం చేసుకోవటం కాంగ్రెస్ నాయకులను మరింత కలవరపరుస్తోంది. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఎమ్మెల్యే ఆశావహులతో రెండు మూడురోజుల్లో భేటీ కానుంది. ఈ భేటీలో మెదక్ ఎమ్మెల్యే టికెట్ విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment