అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో వెలుగులోకి
ఎన్నికల సమయాల్లో నగదు తరలించిన టాస్క్‌ఫోర్స్ బృందాలు
ఆ మొత్తాల్ని గమ్యం చేర్చిన వారిలో ఆయా జిల్లాల పోలీసులు
ఇప్పటికే ఓ ఎస్పీ స్థాయి అధికారి పాత్రపై ఆధారాలు లభ్యం
మరికొందరు నాన్ క్యాడర్ అధికారుల ప్రమేయం!
సాక్షి, హైదరాబాద్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ‘పోలీసు వాహనాల్లో ఎలక్షన్ ఫండ్ రవాణా’ వ్యవహారంలో మరికొందరు ఖాకీల పాత్ర ఉన్నట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) పి.రాధాకిషన్‌రావు, ఓ మాజీ ఎస్పీ పేర్లు వెలుగులోకి వచ్చాయి.
ఒకరు ఇప్పటికే అరెస్టు కాగా మరొకరిని పోలీసులు విచారించారు. తెరవెనుక స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు పాత్ర ఉన్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. హైదరాబాద్ నుంచి టాస్క్‌ఫోర్స్, ఎస్‌ఐబీ వాహనాల్లో ఇతర జిల్లాలకు నగదు తరలినట్లు నిర్థారించారు.
ఈ మొత్తాలను ఆయా జిల్లాల్లో రిసీవ్ చేసుకున్నది ఎవరు? అక్కడ నుంచి ఎవరి వద్దకు చేరాయి? అనే అంశాలపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ఓ ఎస్పీ, మరికొందరు నాన్–క్యాడర్ ఎస్పీ స్థాయి అధికారుల పాత్రపై కొన్ని ఆధారాలు లభ్యమైనట్లు తెలిసింది.
ప్రధానంగా ఎన్నికల సమయంలోనే..
టాస్క్‌ఫోర్స్, ఎస్‌ఐబీ అధికారులు ప్రధానంగా గతంలో జరిగిన ఎన్నికలు, ఉప ఎన్నికల సమాయాల్లోనే నగదు అక్రమ రవాణా చేసినట్లు అధికారులు నిర్ధారిస్తున్నారు. ఈ మొత్తం వివిధ జిల్లాల్లో ఉన్న కొందరు నేతలకు చేరినట్లు అనుమానిస్తున్నారు. సిట్ అధికారులు ఇప్పటికే ఆయా నగదు అక్రమ రవాణా వాహనాల్లో ప్రయాణించిన ఎస్సైలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులతో పాటు డ్రైవర్లను ప్రశ్నించి వాంగ్మూలాలు నమోదు చేశారు.
2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి వీటిని వాడటం మొదలెట్టారు. 2020లో జరిగిన దుబ్బాక, 2021 అక్టోబర్‌లో జరిగిన హుజూరాబాద్, 2022 అక్టోబర్ రెండో వారంలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికలతో పాటు గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన సాధారణ ఎన్నికల సందర్భాల్లో ఈ నగదు అక్రమ రవాణా ఎక్కువ జరిగినట్లు అంచనాకు వచ్చారు.
హైదరాబాద్‌లోని వ్యక్తుల నుంచి ఆ మొత్తాలను తరలించే బాధ్యతల్ని అప్పటి రాధాకిషన్‌రావు నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్ పోలీసులు, జిల్లాలకు తీసుకువెళ్లే అంశాన్ని ఎస్‌ఐబీలోని కొందరు అధికారులు చేపట్టినట్లు సమాచారం. అయితే ఈ మొత్తాలను సురక్షితంగా వివిధ ప్రాంతాల్లోని వ్యక్తుల వద్దకు చేర్చాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు చెందిన స్థానిక అధికారుల సహకారం తీసుకుని ఉంటారని అనుమానించారు.
ప్రభాకర్‌రావు లేదా రాధాకిషన్‌రావుల్లో ఎవరో ఒకరు వారితో మాట్లాడి, నగదు తరలింపులో సహకరించేలా ఒప్పించి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేశారు. ఈ కోణంలో లోతుగా ఆరా తీసిన ఉన్నతాధికారులు ఓ ఎస్పీ స్థాయి అధికారి పాత్రను గుర్తించినట్లు సమాచారం.
మరికొందరు నాన్–క్యాడర్ ఎస్పీ స్థాయి అధికారుల పాత్రపై కొన్ని ఆధారాలు లభ్యమైనట్లు తెలిసింది. కొందరికి నోటీసులు ఇచ్చి విచారించిన సిట్... అన్ని అంశాలు పూర్తిస్థాయిలో వెలుగులోకి వచ్చాక మిగిలిన వారికీ నోటీసులు జారీ చేసి విచారించాలని, వాంగ్మూలాలు నమోదు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
సంప్రదింపులు ఆపేసిన ప్రభాకర్‌రావు
సుదీర్ఘకాలం ఎస్‌ఐబీ చీఫ్‌గా వ్యవహరించిన టి.ప్రభాకర్‌రావు గత ఏడాది డిసెంబర్ 4న రాజీనామా చేశారు. ఆపై ఎస్‌ఐబీలో జరుగుతున్న పరిణామాలు, ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ డి.ప్రణీత్‌రావుపై కేసు నేపథ్యంలో అమెరికా వెళ్లిపోయారు. పోలీసు అధికారులు ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్నలతో పాటు మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావు అరెస్టుల తర్వాత తిరిగి రావాలని భావించారు.
అప్పటి నుంచి కొన్నాళ్లు కొందరు పోలీసు అధికారులు, తన సన్నిహితులతో సంప్రదింపులు జరిపారు. అయితే ప్రస్తుతం ఆయన ఇక్కడ ఉన్న వారితో సంప్రదింపులు పూర్తిగా ఆపేశారని తెలిసింది. ఈ నేపథ్యంలో పోలీసులు రెడ్ కార్నర్ నోటీసుల ద్వారా ఆయన్ను రప్పించాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment