గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ రద్దు సబబే  | Telangana High Court On Group-1 prelims cancellation | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ రద్దు సబబే 

Published Thu, Sep 28 2023 1:13 AM | Last Updated on Thu, Sep 28 2023 1:13 AM

Telangana High Court On Group-1 prelims cancellation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్ష రద్దు చేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం సమర్ధించింది. నోటిఫికేషన్‌ నిబంధనలను సవరిస్తూ అనుబంధ నోటిఫికేషన్‌ జారీ చేయకపోవడం చట్ట వ్యతిరేకమేనని పేర్కొంది. అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత సింగిల్‌ జడ్జి తీర్పు వెలువరించారని, అందులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదని స్పష్టం చేసింది. జూన్‌ 11న నిర్వహించిన పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని ఆదేశించింది. బయోమెట్రిక్‌ సహా నోటిఫికేషన్‌లో పేర్కొన్న అన్ని నిబంధనలను తప్పకుండా పాటించాలని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ)కి తేల్చిచెప్పింది.

సింగిల్‌ జడ్జి తీర్పును కొట్టివేయాలని కోరుతూ టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ దాఖలు చేసిన అప్పీల్‌ పిటిషన్‌ను తిరస్కరిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్ష రద్దు చేస్తూ ఈ నెల 23న సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ టీఎస్‌పీఎస్సీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి, జస్టిస్‌ అనిల్‌కుమార్‌ జూకంటి ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. టీఎస్‌పీఎస్సీ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్, అప్పీల్‌లో ప్రతివాదుల తరఫున సీనియర్‌ న్యాయవాది గిరిధర్‌రావు, నర్సింగ్, హసీనా సుల్తానా వాడీవేడిగా వాదనలు వినిపించారు.  

బయోమెట్రిక్‌పై వాదన ఆమోద యోగ్యం కాదు 
‘గత ఏడాది అక్టోబర్‌లో తొలిసారి గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ నిర్వహించినప్పుడు 2.83 లక్షల మంది వరకు హాజరయ్యారని కమిషన్‌ చెబుతోంది. అప్పుడు సమర్థవంతంగా బయోమెట్రిక్‌ నిర్వహించిన కమిషన్‌.. 2.33 లక్షల మంది పాల్గొన్న జూన్‌లో మాత్రం భారీ సంఖ్య కారణంగా తీసుకోలేదని చెప్పడం ఆమోదయోగ్యం కాదు. కానిస్టేబుల్‌ పోస్టులు సహా ఇతర పలు పోస్టుల నియామక పరీక్షలకు బయోమెట్రిక్‌ తీసుకున్నప్పుడు గ్రూప్‌–1కు తీసుకోకపోవడాన్ని కమిషన్‌ సమర్ధించుకోలేదు.

ఇంకోవైపు 50 వేల మంది పరీక్షకు దూరం కావడం చిన్న విషయమేమీ కాదు. అభ్యర్థుల్లో కమిషన్‌ విశ్వసనీయత కోల్పోవడమే ఇందుకు కారణంగా కన్పిస్తోంది. నోటిఫికేషన్‌ నిబంధనల ప్రకారం ఓఎంఆర్‌ షీట్లపై ఇద్దరు ఇన్విజిలేటర్ల సంతకాలు ఉండాలి. కానీ కొన్ని షీట్లపై ఒక్కరి సంతకమే ఉంది. దీనికి కమిషన్‌ సమాధానం సమంజసనీయంగా లేదు. గ్రూప్‌–1 కంటే ఎక్కువ మంది హాజరైన గ్రూప్‌–4కు ఓఎంఆర్‌ షీట్లపై ఫొటో ఇచ్చినప్పుడు గ్రూప్‌–1కు ఇవ్వకపోవడం అక్రమాలకు ఆస్కారం ఇచ్చేలా ఉంది..’అని ధర్మాసనం అభిప్రాయపడింది.  

ఆ 258 మంది భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారుతుంది.. 
‘నోటిఫికేషన్‌ నిబంధనల్లో మార్పుచేర్పులు, సవరణలు చేసే అధికారం కమిషన్‌కు ఉంది. అయితే నోటిఫికేషన్‌ వెలువరించాక సవరణ చేయాలనుకుంటే ఆ మేరకు అనుబంధ నోటిఫికేషన్‌ జారీ చేయాలి. గ్రూప్‌–4 పరీక్షలకు బయోమెట్రిక్‌ లేదంటూ అనుబంధ నోటిఫికేషన్‌ వెలువరించిన కమిషన్‌ గ్రూప్‌–1 విషయంలో అలా చేయకపోవడం సమర్థనీయం కాదు. జూన్‌ 11న గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహణ తర్వాత 2,33,248 మంది పరీక్షకు హాజరయ్యారని చెప్పిన కమిషన్‌.. అనంతరం ఆ సంఖ్యను 2,33,506గా చెప్పింది.

ఈ వ్యత్యాసం గ్రూప్‌–1 మొత్తం పోస్టుల్లో (503) సగం కంటే ఎక్కువ (258). ఒకవేళ నిజంగా అక్రమాలు చోటుచేసుకుని ఈ 258 మంది మెయిన్స్‌ పరీక్షకు ఎంపికైతే.. అంతమంది మెరిట్‌ అభ్యర్థులు అవకాశం కోల్పోతారు. వారి భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇక ప్రిలిమ్స్‌ ప్రాథమిక పరీక్ష అని, పట్టించుకోనవసరం లేదన్న కమిషన్‌ వాదన కూడా ఆమోదయోగ్యంగా లేదు. ఇరుపక్షాల వాదనలను లోతుగా పరిశీలించాక సింగిల్‌ జడ్జి తీర్పులో జోక్యం చేసుకునేందుకు ఆస్కారం కనబడటం లేదు..’అని బెంచ్‌ స్పష్టం చేసింది. 

ముగ్గురి వల్ల లక్షల మంది ఇబ్బందుల్లోకి.. 
‘ముగ్గురు అభ్యర్థులు మాత్రమే పరీక్షను రద్దు చేయాలని కోరారు. ముగ్గురి కోసం లక్షల మంది భవిష్యత్‌ ఇబ్బందుల్లో నెట్టడం సరికాదు. 2.33 లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని అప్పీల్‌ను ఆమోదించాలి..’అని ఏజీ కోరారు. కాగా.. ‘అభ్యర్థుల సంఖ్యలో తేడా అక్రమాలు తావిచ్చేదిగా ఉంది. పరీక్షల నిర్వహణలో కమిషన్‌కు చిత్తశుద్ధి లోపించింది. ఒకసారి పేపర్‌ లీక్‌ అయినప్పుడు కట్టుదిట్టమైన భద్రత మధ్య పరీక్ష నిర్వహించాల్సిన కమిషన్‌.. రెండోసారి కూడా విఫలమయ్యింది. కాబట్టి పరీక్షను రద్దు చేసి నోటిఫికేషన్‌లోని నిబంధనలకు అనుగుణంగా పరీక్ష నిర్వహించాలి..’అంటూ గిరిధర్‌రావు, నర్సింగ్‌ వాదించారు.     

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement