గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌కు తీవ్ర పోటీ | Excitement over Group-1 Prelims Cutoff Marks: Telangana | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌కు తీవ్ర పోటీ

Published Tue, Jun 11 2024 1:09 AM | Last Updated on Tue, Jun 11 2024 1:09 AM

Excitement over Group-1 Prelims Cutoff Marks: Telangana

గత రెండుసార్లు కంటే ఈసారి అత్యధికంగా అభ్యర్థుల హాజరు 

ప్రశ్నపత్రం సులభంగా ఉండటంతో కటాఫ్‌ మార్కులపై ఉత్కంఠ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ మూడో సారి నిర్వహించిన గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్షలో తీవ్ర పోటీ నెలకొంది. గతంలో రెండుసార్లు నిర్వహించి రద్దు చేసిన ప్రిలిమ్స్‌తో పోలిస్తే ఈసారి అభ్యర్థుల సంఖ్య భారీగా పెరిగింది. ఈసారి పరీక్షకు 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 3.02 లక్షల మంది (74%) ప్రిలిమ్స్‌ రాసినట్లు కమిషన్‌ ప్రాథమికంగా వెల్లడించింది.

దీనికితోడు ఈసారి ప్రశ్నపత్రం సులభంగా ఉండటంతో కటాఫ్‌ మార్కులపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. అన్ని కేటగిరీల్లో ప్రశ్నలు సులభతరం నుంచి మధ్య స్తంగా ఉన్నట్లు ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. కమిషన్‌ ప్రాథమిక ‘కీ’విడుదల చేశాకే స్పష్టత కటాఫ్‌పై వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అర్హతకు కనీసం 50 శాతానికి పైబడి మార్కులు రావాల్సిందేనని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

రెండుసార్లు రద్దు కావడంతో..: వాస్తవానికి గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీకి 2022 ఏప్రిల్‌లో 503 ఉద్యోగాల భర్తీకి కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అదే ఏడాది అక్టోబర్‌లో ప్రిలిమ్స్‌ నిర్వహించి 1:50 నిష్పత్తిలో మెయిన్‌ పరీక్షలకు తేదీలు ప్రకటించింది. కానీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగు చూడటంతో ప్రిలిమ్స్‌ను కమిషన్‌ రద్దు చేసింది. ఆ తర్వాత గతేడాది జూన్‌లో రెండోసారి ప్రిలిమ్స్‌ నిర్వహించగా అందులో లోపాలు జరిగాయంటూ అభ్యర్థులు కోర్టుకెక్కారు.

దీంతో కోర్టు ఆదేశంతో ప్రిలిమ్స్‌ను కమిషన్‌రద్దు చేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం... కొత్తగా 60 గ్రూప్‌–1 పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వడంతో టీజీపీఎస్సీ మొత్తంగా 563 గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ జారీ చేసింది. అలాగే గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తును అప్‌డేట్‌ చేసుకొనే అవకాశం కల్పించడంతోపాటు కొత్తగా దరకాస్తు చేసుకొనే అవకాశం కలి్పంచింది. దీంతో కొత్తగా 23 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఫలితంగా అభ్యర్థుల సంఖ్య 4.03 లక్షల చేరింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement