గ్రూప్–1పై పిటిషనర్‌ను ప్రశ్నించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 పరీక్షకు సంబంధించి సింగిల్ జడ్జి వద్ద పలు పిటిషన్లు పెండింగ్‌లో ఉండగా, నేరుగా ఇక్కడ పిటిషన్ ఎందుకు వేశారని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం పిటిషనర్‌ను ప్రశ్నించింది. రాజ్యాంగ పరమైన ఉల్లంఘనలు ఏమైనా ఉన్నాయని అడిగింది. విచారణను రేపటికి వాయిదా వేస్తూ, ఇక్కడే విచారణ జరపాలా.. లేక సింగిల్ జడ్జి వద్ద ఉన్న పిటిషన్‌లకు అటాచ్ చేయాలా అనేది తేలుస్తామని స్పష్టం చేసింది.
2024, ఫిబ్రవరి 19న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం టీఎస్‌పీఎస్సీ రూల్ ఆఫ్ లాను పాటించాలని, ప్రిలిమ్స్, మెయిన్స్.. అన్నింటా రిజర్వేషన్లు అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ నల్లగొండ జిల్లా శాలిగౌరారానికి చెందిన పోగుల రాంబాబు సహా మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మహిళలు, దివ్యాంగుల కేటగిరీలోనూ సమాంతర రిజర్వేషన్లు పాటించాలని, అధికారులు వరి్టకల్‌గా రోస్టర్ పాయింట్లు నిర్ధారిస్తున్నారని, మెయిన్స్‌కు 1ః50 గా ఎంపిక చేశారని, దీనిలో కూడా సమాంతర రిజర్వేషన్ల ప్రకారం ఎంపిక చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ లోకస్ లేకుండానే రూల్‌ను చాలెంజ్ చేస్తూ పిటిషన్ వేశారని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. ‘చట్టబద్ధమైన రూల్స్ లేనప్పుడు సింగిల్ జడ్జి వద్ద పిటిషన్ దాఖలు చేయాలి కదా, ఇక్కడ ఎందుకు’అని ప్రశ్నించింది. పిటిషనర్ న్యాయవాది సమయం కోరడంతో విచారణ ఈ నెల 25కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment