తుది తీర్పునకు లోబడే గ్రూప్‌–1 ఫలితాలు | Telangana High Court Responds on Group 1 Results | Sakshi
Sakshi News home page

తుది తీర్పునకు లోబడే గ్రూప్‌–1 ఫలితాలు

Oct 14 2022 1:20 AM | Updated on Oct 14 2022 1:20 AM

Telangana High Court Responds on Group 1 Results - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి గ్రూప్‌–1 అభ్యర్థులు దాఖలు చేసిన కేసులో తుది తీర్పునకు లోబడే ఫలితాలు ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ల వినతిని పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు సూచించింది. గ్రూప్‌–1 ప్రాథమిక పరీక్ష ఫలితాల వెల్లడికి ముందే సమస్యను పరిష్కరించాలని స్పష్టం చేసింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది.

ఎస్టీ రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ 2022, సెప్టెంబర్‌ 30న రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్‌ 33ను విడుదల చేసిందని.. కొత్త రిజర్వేషన్ల మేరకు మళ్లీ నోటిఫికేషన్‌ విడుదల చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ.. మెదక్‌ జిల్లా సర్ధనా హవేలీఘన్‌పూర్‌ పోచమ్మరాల్‌ తండాకు చెందిన జీ. స్వప్న సహా మరో నలుగురు హైకోర్టును ఆశ్రయించారు. పరిపాలనా విభాగం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ)ని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ గురువారం విచారణ చేపట్టారు.

పిటిషనర్‌ తరఫున న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపించారు. ఈ జీవోను వచ్చే ఆదివారం జరిగే ప్రాథమిక పరీక్షకు వర్తింపజేయాలని కోరారు. 503 పోస్టులను భర్తీ చేయడం కోసం ఈ ఏప్రిల్‌ 26న టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ జారీ చేసిందన్నారు. పెంచిన రిజర్వేషన్లకు అనుగుణంగా రోస్టర్‌ పాయింట్ల నిర్ణయించకుండానే గ్రూప్‌–1 ప్రిలిమినరీ నిర్వహిస్తున్నారని.. పాయింట్లు కేటాయిస్తే ఎస్టీ అభ్యర్థులకు రిజర్వేషన్‌ కోటా కింద దాదాపు 50 పోస్టులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ప్రస్తుతం ప్రాథమిక పరీక్షలు నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశించారు. అయితే తుది ఫలితాలు మాత్రం తీర్పునకు లోబడే ఉంటాయని పేర్కొంటూ..విచారణ వాయిదా వేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement