AP: గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ ప్రశాంతం | Group I Prelims Exam In AP Pass Off Peacefully | Sakshi
Sakshi News home page

AP: గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ ప్రశాంతం

Published Mon, Jan 9 2023 8:14 AM | Last Updated on Mon, Jan 9 2023 8:31 AM

Group I Prelims Exam In AP Pass Off Peacefully - Sakshi

సాక్షి, అమరావతి: గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఏపీపీఎస్సీ పకడ్బందీగా ఏర్పాట్లు చేయడంతో కేవలం ఒక్క చోట స్వల్ప ఘటన మినహా సజావుగా పూర్తయ్యాయి. 2022 గ్రూప్‌–1 పరీక్షకు 1,26,449 మంది రిజిస్టర్‌ చేసుకున్నారు. వీరిలో 1,06,473 మంది హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోగా 87,718 మంది (82.38 శాతం) పరీక్ష రాశారు. గతంలో జరిగిన 2018 గ్రూప్‌–1 పరీక్షకు 73 శాతం మంది పరీక్షకు హాజరు కాగా ఈసారి మరింత పెరిగింది. రెవెన్యూ, పోలీసు శాఖల సహకారంతో ప్రిలిమ్స్‌ పరీక్ష  ప్రశాంతంగా ముగిసిందని ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ ధన్యవాదాలు తెలిపారు.

ప్రశ్నల సరళి ఎలా ఉందంటే...?
ఈసారి నిర్వహించిన గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌లో ప్రశ్నలు అత్యున్నత ప్రమాణాలతో ఆయా అంశాలపై అభ్యర్థుల సమగ్ర అవగాహన, పరిజ్ఞానా­న్ని పరీక్షించేలా ఉన్నాయని పలువురు నిపుణు­లు, అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఎక్కడా డైరెక్ట్‌ ప్రశ్నలు లేవన్నారు. ఈదఫా  గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ ప్రశ్నలు సివిల్స్‌ తరహాలో ఉన్నాయని గతంలో గ్రూప్‌–1 పరీక్షకు హాజరు కావడంతోపాటు సివిల్స్‌లో సైతం ఇంటర్వ్యూ వరకు వెళ్లిన ఓ అభ్యర్థి తెలిపారు. పేపర్‌ 1లో ఇచ్చిన 120 ప్రశ్నల్లో ఆరు మినహా తక్కినవన్నీ ఆయా అంశాలపై పూర్తి అవగాహన ఉన్నవారే కచ్చితమైన సమాధానం రాయగలుగుతారని చెప్పారు.

పేపర్‌ 1, 2లో ప్రశ్నలకు ఇచ్చిన బహుళైచ్చిక సమాధానాలన్నీ సరైనవే అన్నట్లుగా ఉన్నాయని విశాఖలో తొలిసారి ఈ పరీక్షకు హాజరైన ఓ యువతి పేర్కొంది. సబ్జెక్టుపై పూర్తి అవగాహనతోపాటు క్షుణ్ణంగా అర్థం చేసుకొన్న వారే సరైన సమాధానం గుర్తించగలిగేలా ప్రశ్నలు అడిగారని తెలిపారు. పేపర్‌ 1 కంటే పేపర్‌ 2లో ప్రశ్నలు కష్టం గా ఉన్నాయని చెప్పారు. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఆప్టిట్యూడ్‌ ప్రశ్నలకు సరైన సమాధానాలు కనుక్కోవడం ఇబ్బంది అయిందని మరో అభ్యర్థి పేర్కొన్నారు. పేపర్‌ 2 లో జనరల్‌ స్టడీస్‌ అంశాలు పూర్తిగా గత ఏడాదిలో చోటు చేసుకున్న పరిణామాల పరిధిలోనివేనని తెలిపారు. గతంలో అనువాదం సరిగాలేక తప్పులు దొర్లడంతో తెలుగు మీడియం అభ్యర్థులకు నష్టం వాటిల్లిందని, ఈసారి మాత్రం తెలుగు అనువాదంలో ఎక్కడా తప్పులు దొర్లలేదని పలువురు అభ్యర్థులు వెల్లడించారు.

1 : 50లో మెయిన్స్‌కు అవకాశమివ్వాలని వినతి
ఉన్నత ప్రమాణాలతో గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ నిర్వహించారని, దీనివల్ల మంచి పరిజ్ఞానం, నైపుణ్యం ఉన్నవారు అర్హత సాధించగలుగుతారని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే మెయిన్స్‌కి ఎక్కువ మందికి అవకాశం కల్పించాలని నిపుణులతో పాటు అభ్యర్థులు కోరుతున్నారు. గతంలో గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కి 1 : 50 చొప్పున అనుమతించేవారు. అయితే టీడీపీ హయాంలో దాన్ని మార్పు చేసి ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కి ఏ మేరకు అభ్యర్థులను ఎంపిక చేయాలో నిర్ణయం తీసుకునే అధికారాన్ని కమిషన్‌కి కట్టబెట్టారు. గత ప్రభుత్వ హయాంలో 2018 గ్రూప్‌–1లో 1 : 50 ప్రకారం కాకుండా 1 : 12కి తగ్గించి అభ్యర్థులకు మెయిన్స్‌కి అవకాశమిచ్చారు. దీనివల్ల అనేకమంది ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కి అవకాశం లభించక నష్టపోయారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ బీసీ తదితర రిజర్వుడ్‌ కేటగిరీల అభ్యర్థులకు తీవ్ర నష్టం వాటిల్లింది.

ఈ వర్గాల అభ్యర్థులు మెరిట్‌ మార్కులతో జనరల్‌ కేటగిరీలో చేరాల్సి ఉన్నా వారిని కేవలం వారి కేటగిరీకే పరిమితం చేశారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ తరువాత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చాక అదే మెయిన్స్‌ను కోర్టు ఆదేశాలతో మళ్లీ నిర్వహించాల్సి రాగా 1 : 50 చొప్పున అవకాశం ఇచ్చారని అభ్యర్థులు గుర్తు చేస్తున్నారు. దీనివల్ల అంతకు ముందు అవకాశం కోల్పోయిన వారు మెయిన్స్‌ రాయడంతో పాటు అందులో మెరిట్‌లో నిలిచారని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కి 1 : 50 ప్రకారం అవకాశం ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు. 

విజయవాడలో పట్టుబడ్డ అభ్యర్థి: విజయవాడ బెంజి సర్కిల్‌ సమీపంలోని నారాయణ జూనియర్‌ కళాశాలలో ఆదివారం గ్రూప్‌–1 పరీక్షలో కాపీ కొడుతూ పట్టుబడ్డ ఓ అభ్యర్థిపై కేసు నమోదైంది. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకికి చెందిన కె.వెంకటేష్‌ లోదుస్తుల్లో దాచిన సెల్‌ఫోన్‌లో జవాబులు చూసి రాస్తుండగా ఇన్విజిలేటర్లు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement