­గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ వాయిదాకు హైకోర్టు నిరాకరణ | High Court rejects postponement of Group1 prelims | Sakshi
Sakshi News home page

­గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ వాయిదాకు హైకోర్టు నిరాకరణ

Published Wed, Jun 5 2024 5:58 AM | Last Updated on Wed, Jun 5 2024 5:58 AM

High Court rejects postponement of Group1 prelims

పరీక్ష వాయిదా కుదరదన్న టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది 

పిటిషనర్ల వినతిపత్రాన్ని పరిశీలించి.. చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 9న ఇంటెలిజెన్స్‌ బ్యూరో డిపార్ట్‌మెంట్‌ పరీక్ష ఉన్నందున గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ వాయిదా వేయాలన్న పిటిషనర్ల అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చి0ది. అయితే పిటిషనర్లు ఈ నెల 1న ఇచ్చిన వినతిపత్రాన్ని పరిశీలించి చట్టప్రకారం నిర్ణయం తెలియజేయాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సరీ్వస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ)కు స్పష్టం చేసింది. పిటిషన్‌లో విచారణను ముగించింది. 

ఇంటెలిజెన్స్‌ బ్యూరో డిపార్ట్‌మెంట్‌ పరిధిలోని అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌– ఐఐ/ఎగ్జిక్యూటివ్‌ పోస్టుకు 2వ స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఈ నెల 9న ఉందని, అదేరోజు నిర్వహిస్తున్న గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ను వాయిదా వేయాలని కోరుతూ ఎం.గణేశ్, భూక్యా భరత్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ పుల్ల కార్తీక్‌ మంగళవారం విచారణ చేపట్టారు. టీజీపీఎస్సీ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ..‘గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్షకు సంబంధించి షెడ్యూల్‌ ముందుగానే ప్రకటించాం. 

9న పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. 4,03,645 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారందరూ పరీక్షకు సిద్ధమయ్యారు. కొందరి కోసం లక్షల మందిని ఇబ్బంది పెట్టడం...పరీక్ష వాయిదా వేయడం సాధ్యం కాదు. అయినా పిటిషనర్ల వినతిపత్రంపై అధికారులు చట్టప్రకారం నిర్ణయం తీసుకుంటారు’అని వెల్లడించారు. వాదనలు విన్న న్యాయమూర్తి...ఈ పిటిషన్‌లో మెరిట్స్‌లోకి వెళ్లడంలేదని, చట్టప్రకారం టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement