సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షలకు సమయం దగ్గర పడుతోంది. జూలై లేదా ఆగస్టులో ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఇప్పటికే నోటిఫికేషన్‌లో వెల్లడించింది. పరీక్షల గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థులు కూడా మరింత సన్నద్ధతతో దీక్ష చేస్తున్నారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికే మెయిన్ పరీక్షలకు అవకాశం ఉంటుంది.
ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్ పరీక్షలకు ఎంపిక చేయనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ప్రస్తుతం భర్తీ చేయనున్న 503 గ్రూప్–1 ఉద్యోగాలకు రాష్ట్రవ్యాప్తంగా 25,150 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధిస్తారు. దీంతో ఎక్కువ మార్కులు సాధించిన వారికే మెయిన్స్‌కు అవకాశం దక్కనుండగా.. ఈ ఎంపిక విధానంలోనూ టీఎస్‌పీఎస్సీ మల్టీజోన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, జెండర్, ఈడబ్ల్యూఎస్, డిజేబుల్, స్పోర్ట్స్ కేటగిరీలో మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
ఒక్కో పోస్టుకు 700 మంది...
ఇప్పటివరకు గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో జనరల్ మెరిట్ ప్రకారం ఎంపిక జరిగేది. దీంతో కటాఫ్ మార్కులు ఒక సంఖ్య దగ్గర ఆగిపోయేవి. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత స్థానిక అభ్యర్థులకే ఉద్యోగాలు దక్కాలనే ఉద్దేశంతో తెచ్చిన నూతన జోనల్ విధానంతో ఎంపిక విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో గ్రూప్–1 కటాఫ్ మార్కులు ఒక్కో జోన్‌లో, ఒక్కో కేటగిరీలో ఒక్కో రకంగా ఉండనున్నాయి. రాష్ట్రంలో రెండు మల్టీ జోన్లు ఉండగా.. ఒక్కో మల్టీజోన్‌లో కటాఫ్ మార్కులు ఒక్కోలా ఉంటాయి. అదేవిధంగా రిజర్వేషన్లు, జెండర్ ప్రకారం కటాఫ్ మార్కులు మరోవిధంగా ఉంటాయి. గ్రూప్–1 కొలువులకు ఇప్పటివరకు 3.5 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి.
మరో రెండ్రోజుల్లో దరఖాస్తులు మరిన్ని వచ్చే అవకాశముంది. ప్రస్తుత గణాంకాల ప్రకారం చూస్తే ఒక్కో పోస్టుకు సగటున 700 మంది పోటీపడుతున్నారు. పోటీ ఎక్కువగా ఉండటం, కటాఫ్ నిర్ధారణలోనూ జోన్ల వారీగా వేర్వేరుగా ఉండటంతో అభ్యర్థులు మరింత కఠిన సాధన చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రిలిమ్స్ మార్కులను కేవలం మెయిన్ పరీక్షల ఎంపిక వరకే పరిగణిస్తామని, తుది ర్యాంకింగ్‌లో వీటిని పరిగణించబోమని టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే స్పష్టం చేసింది.
కటాఫ్ ఇలా...
అభ్యర్థుల స్థానికత ఆధారంగా మల్టీజోన్లను కేటాయిస్తారు. ఈ క్రమంలో గ్రూప్–1 మెయిన్స్‌కు ఎంపిక రెండు మల్టీజోన్ల ఆధారంగా చేపడతారు. ఆ తర్వాత రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, డిజేబుల్, స్పోర్ట్స్ రిజర్వేషన్లను అమలు చేస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దీంతో కటాఫ్ మార్కులు ఒక్కో జోన్‌లో ఒక్కో రకంగా ఉంటాయి. ఉదాహరణకు మల్టీజోన్–1లోని బీసీ–ఏ కేటగిరీలో ఎంపికైన అభ్యర్థి మార్కులు.. మల్టీజోన్–2లో బీసీ–ఏ కేటగిరీలో ఎంపికైన అభ్యర్థి మార్కులు ఒకేరకంగా ఉండవు. ఇదే తరహాలో మిగిలిన కేటగిరీల్లో ఒక్కో జోన్‌లో కటాఫ్ మార్కులు ఒక్కోవిధంగా ఉండనున్నాయి.
గ్రూప్–1 ఒక్క పోస్టుకు 756 మంది పోటీ.. మొత్తం దరఖాస్తులు 3,80,202
రాష్ట్ర సివిల్ సరీ్వసుగా చెప్పుకునే గ్రూప్–1 కొలువుకు పోటీ విపరీతంగా ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారిగా చేపడుతున్న గ్రూప్–1 ఉద్యోగాలను దక్కించుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగానే కుస్తీ పడుతున్నారు. పలు ప్రభుత్వ శాఖల్లో గ్రూప్–1 కేటగిరీలో ఉన్న 503 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ఏప్రిల్ నెలాఖరులో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మే 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. జూన్ 4 నాటికి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగియగా 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తులు సమరి్పంచినట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.
ఇందులో పురుషులు 2,28,951, మహిళలు 1,51,192, ట్రాన్స్‌జెండర్లు 59 ఉన్నారు. ఇక డిజేబుల్ కేటగిరీలో 6,105, ప్రభుత్వ ఉద్యోగులు 51,553 మంది ఉన్నారు. ఈక్రమంలో ఒక్కో ఉద్యోగానికి సగటున 756 మంది పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. జూలై లేదా ఆగస్టు నెలలో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు, డిసెంబర్‌లో మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే నోటిఫికేషన్‌లో తెలిపింది. ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన 312 గ్రూప్–1 ఉద్యోగాలకు 3 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment