సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం ఢిల్లీ ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాల ఓట్ల లెక్కింపు శుక్రవారం జరుగనుంది. ఏడు లోక్‌సభ నియోజకవర్గాల్లోని ఏడు కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ఉదయం ఎనిమిది గంటలకు మొదలవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల పర్యవేక్షణలో పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తరువాత అరగంట వ్యవధి ఇచ్చి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎంలు) తెరుస్తారు.
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపునకు 10 మంది మైక్రోఅబ్జర్వర్లను, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారిని నియమిస్తారు. ఓట్ల లెక్కింపు కేంద్రం పరిసరాల్లోకి మొబైల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లడంపై నిషేధం విధించారు. అయితే ఎన్నికల అధికారులు మాత్రం ఫలితాలను ప్రసారం చేయడానికి ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించవచ్చు. కౌంటింగ్ సూపర్‌వైజర్లు, మైక్రోఅబ్జర్వర్లు, ఎన్నికల కమిషన్ అనుమతి పొందిన వ్యక్తులు మినహా ఇతరులెవరినీ ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి అనుమతించరు.
మీడియా కూడా ఓట్ల లెక్కింపు కేంద్రంలో ప్రవేశించకూడదనే అధికారులు స్పష్టం చేశారు. మొత్తం ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీడియో తీస్తారు. నగరవ్యాప్తంగా ఏప్రిల్ పదిన లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందుకు ఉపయోగించిన 20 వేల ఈవీఎంలను ఏడు కేంద్రాల్లోని స్ట్రాంగ్‌రూముల్లో ఉంచారు. వీటికి రెండంచెల భద్రత కల్పించారు. పోటీలో ఉన్న 150 మంది అభ్యర్థుల భవితను తేల్చనున్న ఈవీఎంలకు మొదటి వరుసలో పారామిలిటరీ బలగాలు భద్రత కల్పిస్తుండగా, బయట నుంచి ఢిల్లీ పోలీసులు కాపలా కాస్తున్నారు.
ఇదిలా ఉంటే ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి విజయ్ దేవ్ సోమవారమే ఏర్పాట్లను పరిశీలించారు. రెండు పార్లమెంటరీ స్థానాల కౌంటింగ్ కేంద్రాలను సందర్శించారు. న్యూఢిల్లీ పార్లమెంట్ స్థానంలోని గోల్‌మార్కెట్ ఎస్పీ బెంగాలీ గాళ్స్ సీనియర్ సెకండరీ స్కూల్‌తో పాటు ద్వారకా సెక్టార్-9లోని ఇంటిగ్రేటెడ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని స్ట్రాంగ్‌రూమ్‌లోకి వెళ్లి అక్కడ కౌంటింగ్ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం...ప్రతి పార్లమెంట్ స్థానంలో 10 సూక్ష్మ పరిశీలకులు ఉంటారని, ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ విధులు నిర్వహిస్తారని విజయ్‌దేవ్ అన్నారు. ఏప్రిల్ పదిన జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 65.09 శాతం ఓటింగ్ నమోదయింది.
ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు
Published Tue, May 13 2014 11:29 PM | Last Updated on Thu, Jul 11 2019 8:26 PM
Advertisement
Advertisement