గూడు లేకున్నాఓటు
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన ఎన్నికల ప్రక్రియలో అనాథలనూ భాగస్తులను చేసేందుకు ఢిల్లీ ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది. నగరంలోని రాత్రి వసతి కేంద్రాలు, ఫ్లై ఓవర్లు, పేవ్‌మెంట్ల వద్ద ఉండే ఎనిమిది వేల మందికి ఓటరుకార్డులు మంజూరు చేసింది. సార్వత్రిక ఎన్నికల కోసం ఈ నెల 10న నిర్వహించే పోలింగ్‌లో వీరం తా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇలాం టి వారికి శాశ్వత చిరునామాలు ఉండవు కాబట్టి ఎన్నికల సంఘం కొత్త ఆలోచన చేసింది.
సదరు నిరాశ్రయుడు ఒకే ప్రదేశంలో మూడుసార్లు వరుసగా నిద్రించినట్టు తనిఖీల్లో తేలితేనే కార్డు మం జూరు చేయాల్సిందిగా బూత్‌స్థాయి అధికారులు (బీఎల్‌ఓ), నమోదు అధికారులను (ఆర్‌ఓ) ఆదేశించామని ఢిల్లీ ఎన్నికల సంఘం అధికారి విజయ్‌దేవ్ చెప్పారు. ఫ్లై ఓవర్లు, పేవ్‌మెంట్లు, రాత్రిపూట వసతిగృహాల్లో ఉండే వాళ్లందరికీ తనిఖీల అనంతరం కార్డులు మంజూరు చేశామని వెల్లడించారు. ‘అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేవలం 82 మంది అనాథలకు ఓటరుకార్డులు ఉండేవి. వాటి సంఖ్య ఇప్పుడు ఎనిమిది వేలకు చేరింది.
బస్టాపుల్లో కాలం గడిపే మాదకద్రవ్యాల వ్యసనపరులకూ కార్డులు ఇచ్చాం’ అని ఆయన వివరించారు. అయితే నిరాశ్రయులు, అనాథలు వేరే ప్రాంతాలకు తరలివెళ్లినట్టు తెలిస్తే ఓటర్లు జాబితాల నుంచి వాళ్ల పేర్లు తొలగి స్తామని ప్రకటించారు.
ఓటరుకార్డు పొందిన నియోజకవర్గంలో మా త్రమే ఓటు వేయాలని స్పష్టం చేశారు.
ఇక సెంట్రల్‌ఢిల్లీలో అత్యధికంగా 2,863 మంది నిరాశ్రయులు ఓటు హక్కు పొందగా, పశ్చిమఢిల్లీలో అత్యల్పంగా 80 మంది మాత్రమే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారు. ఇదిలా ఉండే ఓటు హక్కు ప్రాధాన్యం గురించి కూడా వీరందరికీ అవగాహన కల్పిం చేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోంది. అంతేగాక అధికారులే స్వయంగా వీళ్లు ఉన్న చోటికి వెళ్లి కార్డులు అందజేస్తున్నారు.
అయితే మాకేంటి?
ఓటరుకార్డు వచ్చిన మాత్రానా తన జీవితంలో ఏం మార్పు వస్తుందని రాము అనే నిరాశ్రయుడు ప్రశ్నించారు. దక్షిణఢిల్లీలోని ఓ ఫ్లై ఓవర్ కింద నివసించే ఇతడు కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. రెక్కాడితేనే డొక్కాడుతుందని, పోలింగ్‌బూత్‌కు వెళ్లి ఓటేసినంత మాత్రాన ఒరిగేదీ లేదంటూ నిట్టూ ర్పు విడిచాడు. అయితే మరికొందరు మాత్రం ఆశావహ దృక్పథంతో ఉన్నారు. మొదటిసారి ఓటు వేస్తున్నందుకు సంతోషంగాఉందని చెబుతున్నారు.
8 నాటికి పోలింగ్ కేంద్రాలు సిద్ధం
ఎన్నికల తేదీ సమీపిస్తుండడంతో ఢిల్లీలో పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. నగరంలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లు లోక్‌సభ ఎన్నికల కోసం తమ తమ ప్రాంతాల్లో పోలింగ్ బూత్‌లను సిద్ధం చేస్తున్నాయి. ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 4,550 పోలింగ్ బూత్ లు, తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరి ధిలో 2,662 పోలింగ్‌బూత్‌లు, దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 4,770 పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. స్కూళ్లు, ఇతర భవనాల్లోనూ పోలింగ్ బూత్‌లను ఏర్పాటుచేస్తున్నారు. భవనాలు లేని చోట్ల తాత్కాలికంగా గుడారాలు వేసి పోలింగ్ కేంద్రాలను నిర్మిస్తుంటారు. ఈసారి టెంట్లకు బదు లు పోర్టాకేబిన్లు ఏర్పాటు చేస్తున్నారు. కరోల్‌బాగ్‌లో పోర్టాకేబిన్లతో 31 పోలింగ్‌బూత్‌లను ఏర్పా టు చేస్తున్నారు ఏప్రిల్ 8 నాటికి పోలింగ్ బూత్‌లన్నీ సిద్ధం కానున్నాయి.
తొమ్మిదిన ఎన్నికల కమిషన్ అధికారులు పోలింగ్ కేంద్రాలను సందర్శించి అన్ని ఏర్పాట్లను సమీక్షిస్తారు. ఏవైనా లోటుపాట్లుం టే అదే రోజున వాటిని సరిచేస్తారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో తాగునీటి సదుపాయం, ఎండ బారినపడకుండా నీడ, లైట్ల వంటి సదుపాయాలు ఉండేలా చూస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పోలింగ్ కేంద్రాన్ని మోడల్ పోలింగ్ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. మోడల్ పోలింగ్ కేంద్రంలో ఓటర్ల కోసం అన్ని సదుపాయాలు ఉంటాయి. వీటి ఏర్పాటు కోసం 60 వేల రూపాయలు కేటాయించారు.