వికలాంగ ఓటర్లకు ప్రత్యేక సదుపాయాలు
వికలాంగ ఓటర్లకు ప్రత్యేక సదుపాయాలు
Published Sun, Mar 30 2014 11:02 PM | Last Updated on Mon, Oct 22 2018 7:42 PM
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో వికలాంగ ఓటర్లంతా చురుగ్గా పాల్గొనే చేయడానికి పలు చర్యలు తీసుకుంటున్నామని ఢిల్లీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈఓ) విజయ్‌దేవ్ శనివారం ప్రకటించారు. వికలాంగులు ఓటింగ్ రోజు ఎన్నికల అధికారులను సంప్రదించడానికి వీలుగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నామని వెల్లడించారు. పోలింగ్‌బూత్‌ల వద్ద వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ఢిల్లీ ఎన్నికల సంఘం వెబ్‌సైట్లో ఈ సాఫ్ట్‌వేర్‌ను వారంలోపు అందుబాటులోకి తెస్తారు. దీనిని వినియోగించుకోవాలనుకునేవాళ్లు అందులో తమ పేరు, చిరునామాతోపాటు ఏవైనా అవసరాలు ఉంటే తెలియజేయాలి. ‘వికలాంగులు సులువుగా ఓటు వేయడానికి వీలుగా వారికి అన్ని సదుపాయాలూ కల్పిస్తాం. అందుకే ఈ సాఫ్ట్‌వేర్‌ను తయారు చేస్తున్నాం’ అని విజయ్‌దేవ్ వివరించారు.
ఉదాహరణకు ఒక వికలాంగుడికి వీల్‌చెయిర్ లేదా సహాయకుడి అవసరం ఉంటే అతడు/ఆమె వెబ్‌సైట్లోని సాఫ్ట్‌వేర్ ద్వారా ఎన్నికల సంఘానికి ఆ విషయం తెలియజేయవచ్చు. ముందస్తుగా సమాచారం అందితే అధికారులు సదరు ఓటరుకు ఆ సదుపాయాలు కల్పిస్తారు. అంతేకాదు ఢిల్లీ వ్యాప్తంగా ఎంతమంది వికలాంగ ఓటర్లు ఉన్నారో ఈ సాఫ్ట్‌వేర్ వల్ల తెలుసుకోవచ్చని ఎన్నికల సంఘం భావిస్తోంది. ప్రస్తుతం నగరవ్యాప్తంగా ఎంతమంది వికలాంగ ఓటర్లు ఉన్నారో తెలియకపోవడం వల్ల వారికి తగిన ఏర్పాట్లు చేయలేకపోతున్నామని విజయ్‌దేవ్ అన్నారు.
జాతీయ వికలాంగుల ఉపాధి ప్రోత్సాహక కేంద్రం (ఎన్సీపీఈడీపీ) గణాంకాల ప్రకారం రాజధానిలో 2.5 లక్షల మంది వికలాంగులు ఉన్నారు. అంధుల కోసం బ్రెయిలీ లిపి బ్యాలెట్ పత్రాలు/ర్యాంప్‌లను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని కూడా ఆదేశించామని విజయ్‌దేవ్ ఈ సందర్భంగా తెలిపారు. ‘వికలాంగుల అభిప్రాయాలు తీసుకొని వారికి అనుగుణంగా ఏర్పాట్లు చేసే పని ఇంత వరకూ జరగలేదు. అందుకే మేం కొన్ని స్వచ్ఛందసంస్థలను సంప్రదించి సాఫ్ట్‌వేర్ తయారు చేస్తున్నారు. కేంద్ర న్యాయ, సాంఘిక సంక్షేమ మంత్రిత్వశాఖ కూడా ఇందుకు సహకరించింది. ప్రతి పోలింగ్‌బూత్ వద్ద వికలాంగ ఓటర్ల కోసం కొందరు స్వచ్ఛంద సేవకులు, ఒక వీల్‌చెయిర్ అందుబాటులో ఉంచుతున్నాం.
వాళ్లు సులువుగా లోపలికి ప్రవేశించి నిష్ర్కమించేలా చూడాలని పోలింగ్ సిబ్బందిని ఆదేశించాం. వైకల్యమున్న ఓటర్లతో మర్యాదగా వ్యవహరించాలని కూడా సూచించాం. ఈ నిబంధనలను ఉల్లంఘించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం’ అని విజయ్‌దేవ్ అన్నారు. అయితే వికలాంగుల హక్కుల కోసం పోరాడేవాళ్లు మాత్రం ఈ చర్యలు సరిపోవని అంటున్నారు. ఢిల్లీ ఎన్నికల సంఘం మాత్రమే ఇటువంటి చర్యలను ప్రకటించిందని, మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఏమంటని వికలాంగుల హక్కుల సంస్థ సమన్వయకర్త జావెద్ అబీదీ ప్రశ్నించారు. వికలాంగ ఓటర్లకు తగిన సదుపాయాలు కల్పించేలా ఆదేశించాలంటూ ఆయన 2004లోనే సుప్రీంకోర్టును ఆదేశించారు. వైకల్యమున్న వాళ్లు పోలింగ్‌బూత్‌లోకి ప్రవేశించేందుకు తగిన ర్యాంప్‌లు (మెట్లకు బదులుగా) లేవని ఆక్షేపించారు.
Advertisement
Advertisement