రాష్ట్రంలో పోలింగ్ ఏప్రిల్ 10న
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల నగారా మోగింది. ఢిల్లీ, జాతీయ ప్రాదేశిక ప్రాంతంలో (ఎన్సీఆర్) ఏప్రిల్ 10న ఓటింగ్ జరుగుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి విజయ్‌దేవ్ ప్రకటించారు. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ నియోజకవర్గాలతోపాటు ఎన్సీఆర్ పరిధిలోకి ఉత్తరప్రదేశ్‌లో గౌతమబుద్ధనగర్, ఘజియాబాద్, హర్యానాలో ఫరీదాబాద్, గుర్గావ్ నియోజకవర్గాల్లో ఏప్రిల్ 10న పోలింగ్ జరుగనుంది. ఢిల్లీ, ఎన్సీఆర్లో ఈ నెల 15 నుంచి 22 వరకు నామినేషన్లు సమర్పించవచ్చు. వీటిని 24న పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి తేదీ మార్చి 26. ఓట్ల లెక్కింపు మే 16న జరుగనుంది. ఈసారి రాజధానిలో వందశాతం పోలింగ్ నమోదయ్యేందుకు చర్యలు తీసుకుంటామని విజయ్‌దేవ్ ఈ సందర్భంగా ప్రకటించారు.
మళ్లీ ముక్కోణపు పోటీయే..
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్‌సభ ఎన్నికల్లోనూ ముక్కోణపు పోటీ జరుగనుంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్, బీజేపీ అత్యధిక స్థానాలను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం ఏడు స్థానాలూ కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. దీని పరిస్థితి బలహీనంగా ఉండడంతో ప్రధాన పోటీ ఆప్, బీజేపీ మధ్యే ఉంటుందని చెప్పవచ్చు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఏడు సీట్లను గెలిచిన పార్టీ ఈ ఎన్నికల్లో ఒక్క సీటును కూడా గెలుచుకోవడం కష్టమేనని అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్‌కు అతిపెద్ద ప్రతికూలతగా మారింది. దేశమంతటితో పోలిస్తే ఆప్ ఢిల్లీలోనే బలంగా ఉంది. కానీ 48 రోజుల పాలన తరువాత ఆప్‌కు ప్రజాదరణ కొద్దిగా తగ్గిందని అంటున్నారు.
అంతర్గత కలహాలతో బీజేపీ సతమతం
నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా గెలిపించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోన్న బీజేపీ పరిస్థితి గత లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు మెరుగైనప్పటికీ అంతర్గత కలహాలు ఆ పార్టీకి ఉన్న అతిపెద్ద సమస్య. ఏడు లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయానికి పార్టీ మీనమీషాలే లెక్కిస్తుండడమే దీనికి నిదర్శనం. ఆప్ ఏడింట్లో ఐదు స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో ముందుంది. చాందినీచౌక్ నుంచి ఆశుతోష్, పశ్చిమ ఢిల్లీ నుంచి జర్నైల్ సింగ్, వాయవ్యఢిల్లీ స్థానం నుంచి మహేందర్ సింగ్, ఈశాన్య ఢిల్లీలో ఆనంద్‌కుమార్, తూర్పుఢిల్లీలో రాజ్‌మోహన్ గాంధీ ఇప్పటికే ఎన్నికల ప్రచారం ఆరంభించారు. కాంగ్రెస్ విషయానికి వస్తే న్యూఢిల్లీ నుంచి సిట్టింగ్ ఎంపీ అజయ్ మాకెన్‌కు టికెట్ దాదాపు ఖాయమైనట్లే. ఈశాన్య ఢిల్లీ నుంచి ఎవరు పోటీ చేస్తారన్నది ప్రైమరీ ద్వారా తేలనుంది. చాందినీచౌక్‌లో కపిల్ సిబల్‌కు టికెట్ ఇవ్వడం ఖాయంగా కనబడుతోంది. మిగతా నాలుగు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎంపీలకే అధిష్టానం టికెట్ ఇస్తుందా లేదా అన్నది చూడవలసి ఉంది.
ఎన్సీఆర్ బహుముఖం..
ఎన్సీఆర్ విషయానికి వస్తే ఇక్కడి నాలుగు లోక్‌సభ నియోజకవర్గాల్లో బహుముఖ పోటీ ఉండవచ్చు. గుర్గావ్ నుంచి ఆప్ ఇప్పటికే యోగేంద్ర యాదవ్‌ను బరిలోకి దింపి ఇక్కడ ఎన్నికలను ఆసక్తికరంగా మార్చింది. ప్రస్తుతం గుర్గావ్కు ప్రాతినిధ్యం వహిస్తోన్న రావ్ ఇందర్జిత్ సింగ్ కాంగ్రెస్‌ను వీడారు. ఆయన బీజేపీలో చేరుతారని అంటున్నారు. ఫరీదాబాద్‌కు ప్రస్తుతం కాంగ్రెస్ తరఫున అవతార్ సింగ్ భడానా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆప్ అమిత్ పాఠక్‌కు టికెట్ ఇచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. గౌతమబుద్ధనగర్ విషయానికి వస్తే ప్రస్తుతం బీఎస్పీ నాయకుడు సురేందర్సింగ్ నాగర్, ఘజియాబాద్‌కు బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీఎస్పీ ముకుల్ ఉపాధ్యాయ, ఎస్పీ సుదన్రావత్ను అభ్యర్థులుగా ప్రకటించాయి. రాజ్‌నాథ్‌కు ధీటుగా కాంగ్రెస్ కూడా ప్రముఖ నేతను బరిలోకి దింపవచ్చు. తమ పార్టీ కార్యకలాపాలకు ఇంతకాలంగా ప్రధాన కేంద్రంగా ఉంటున్న ఘజియాబాద్ నుంచి ఆప్ కూడా బలమైన అభ్యర్థిని నిలబెట్టనుంది.