కృత్రిమ మేధ కబ్జాపర్వం! | AI technology is infiltrating all sectors and killing jobs | Sakshi
Sakshi News home page

కృత్రిమ మేధ కబ్జాపర్వం!

Published Tue, Mar 28 2023 2:00 AM | Last Updated on Tue, Mar 28 2023 2:01 AM

AI technology is infiltrating all sectors and killing jobs - Sakshi

దొడ్డ శ్రీనివాస రెడ్డి :  కృత్రిమ మేధ (ఏఐ) క్రమంగా మన జీవితాల్ని కబ్జా చేస్తోంది. కంప్యూటర్‌ నిపుణుడు క్రిస్టఫర్‌ స్ట్రాచె 1951లో మాంచెస్టర్‌ యూనివర్సిటీలో కృత్రిమ మేధ ఆధారంగా రూపొందించిన కంప్యూటర్‌ ప్రోగ్రాంతో మొదలైన ఏఐ శకం నేడు అన్ని రంగాల్లోకి శరవేగంగా చొరబడుతోంది. వివిధ రంగాల్లో ఉద్యోగాలకు కోతపెడుతూ రోజురోజుకూ మరింతగా విస్తరిస్తోంది.

‘కృత్రిమ మేధ మనిషి మేదస్సును చేరుకోవడానికి ఇంకా అనేక పరిశోధనలు, లక్ష్యాలను సాధించాల్సి ఉంది. ఈ లక్ష్యసాధనకు ఎంత సమయం పడుతుందన్నది ఇదమిత్థంగా చెప్పలేం’అని అంతర్జాతీయంగా ఖ్యాతి పొందిన ఏఐ నిపుణుడు స్టువర్ట్‌ రసెల్‌ నాలుగేళ్ల క్రితం అన్న మాటలివి. అయితే మనిషి మేదస్సును అందుకోవడంలో కృత్రిమ మేధకు ఇంకా ఎక్కువ సమయం పట్టకపోవచ్చనిపిస్తోంది.

కోడ్‌ రాస్తుంది... 
చాట్‌జీపీటీ ప్రాథమిక స్థాయిలో కంప్యూటర్‌ ప్రోగ్రాం కోడ్‌ రాయగలుగుతుంది. అయితే కృత్రిమ మేధపై పెరుగుతున్న పరిశోధనలను పరిశీలిస్తే ఈ ఏడాదిలోనే సంక్లిష్టమైన కోడింగ్‌లను రాయగల సత్తా ఏఐ సమకూర్చుకోగలుగుతుందని అర్థమవుతోంది. మనిషి రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను పరీక్షించడానికి రెండేళ్ల క్రితమే ఏఐ ఆధారిత ‘టురింగ్‌ బోట్స్‌’అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు టురింగ్‌ బోట్స్‌ స్వయంగా సాఫ్ట్‌వేర్‌లను రూపొందించే దిశగా అవతరిస్తున్నాయి.

మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ ఫోరెస్టర్‌ అంచనా ప్రకారం ఈ ఏడాది చివరికల్లా ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్లలో 10 శాతానికిపైగా టురింగ్‌ బోట్స్‌ కోడ్‌లను, టెస్ట్‌లను రాయగలుగుతాయి. సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ ఉద్యోగాలను ఇవి ఆక్రమించబోతున్నాయని, ఆ ఉద్యోగులు ఇక పర్యవేక్షణ, నిర్వహణ ఉద్యోగులుగా మారబోతున్నారనేది ఫోరెస్టర్‌ అభిప్రాయం. వచ్చే ఏడాదికల్లా చాలావరకు వ్యాపార సంస్థలు కోడింగ్‌కు సంబంధించి 30 శాతం వరకు కృత్రిమ మేధపై ఆధారపడబోతున్నాయని ఇంటర్నేషనల్‌ డేటా కార్పొరేషన్‌ (ఐడీసీ) ఒక నిర్ధారణకు వ చ్చింది.

ఈ ఏడాది ఫార్చూన్‌–500 కంపెనీల ద్వారా వెళ్లే అన్ని రకాల సమాచారాల్లో 10 శాతానికిపైగా ఏఐ ఆధారిత సాఫ్ట్‌వేర్‌లే సృష్టించబోతున్నాయని ఫోరెస్టర్‌ చెబుతోంది. అదే 2025 నాటికి అన్ని వ్యాపార సంస్థల నుండి వెలువడే సమాచారంలో 30 శాతానికిపైగా కృత్రిమ మేధ ఆధారిత కంప్యూటర్లే సృష్టించబోతున్నాయని వ్యాపార పరిశోధనా సంస్థ గార్ట్‌నర్‌ అంచనా. అలాగే 2026 నాటికి వ్యాపార సంస్థల మధ్య లావాదేవీల్లో సగానికి పైగా ఏఐ ద్వారానే సాగబోతున్నాయని, 2030 నాటికి మొత్తంగా కృత్రిమ మేధ ఆధారంగా ఐదో వంతు వ్యాపార లావాదేవీలు సాగుబోతున్నాయని కూడా గార్ట్‌నర్‌ అభిప్రాయం.

2026 నాటికి 75 శాతం బడా కంపెనీల ఉత్పత్తుల నాణ్యత, సామర్థ్యం, సప్లయ్‌ చెయిన్, అభివృద్ధి కార్యక్రమాలను కృత్రిమ మేధే నిర్వహించబోతోందని డేటా కార్పొరేషన్‌ ఐడీసీ చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 1.7 కోట్ల మంది కాంటాక్ట్‌ సెంటర్‌ ఏజెంట్లు పనిచేస్తుండగా 2026 నాటికి వాళ్ల మధ్య జరిగే లావాదేవీల్లో 10 శాతం ఏఐ ద్వారా ఆటోమేట్‌ కాబోతున్నాయని గార్ట్‌నర్‌ చెబుతోంది. దీనివల్ల మొత్తంగా 8,000 కోట్ల డాలర్లు ఆదా అవుతుందని కూడాఈ సంస్థ వెల్లడించింది. 

మనిషి అవసరం లేదు.. 
మనిషి రోజువారీ పనులన్నింటినీ అతిత్వరలో కృత్రిమ మేధ హస్తగతం చేసుకోబోతోందని ఏఐ నిపుణుడు కామ్‌ ఫులీ హెచ్చరిస్తున్నారు. ఆదాయం, చదువు విషయంలో సమాజంలో చివరన ఉన్న అత్యధిక జనాభాను ఏఐ తీవ్రంగా ప్రభావితం చేయబోతోందని ఆయన అంటున్నారు. ‘ఒకçప్పుడు కంపెనీలు ఆదాయం కోసం ఉద్యోగుల సంఖ్యను 5–10 శాతం తగ్గించుకొనేందుకు ప్రయత్నాలు చేసేవి, కానీ ఇప్పుడు అందుబాటులోకి వ చ్చిన ఏఐతో ఒక శాతం ఉద్యోగులతో మొత్తం పని ఎలా చేయించవచ్చో ఆలోచిస్తున్నాయి’అని ఇన్ఫోసిస్‌ అధ్యక్షుడు మోహన్‌ జోషి ఇటీవల న్యూయార్క్‌ టైమ్స్‌ ఇంటర్వ్యూలో చెప్పారు.

ఏఐ ఆధారిత చాట్‌జీపీటీ సమాజంపై తీవ్ర ప్రభావం చూపబోతోందని దాని స్థాపిత సంస్థ ఓపెన్‌ ఏఐ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ హెచ్చరిస్తున్నారు. మనిషి మాదిరి అనేక లక్ష్యాలను పూర్తిచేయగల ఏఐ చాట్‌బోట్‌ వల్ల మనుషులు నిర్వహించే అనేక ఉద్యోగాలకు ఎసరుపెట్టబోతోందని, అయితే మనిషికున్న సృజనాత్మకశక్తి కారణంగా కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని ఆల్డ్‌మన్‌ అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగ సమాచారం అందించే రెస్యూమ్‌బిల్డర్‌.కామ్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో అమెరికాకు చెందిన వెయ్యి కంపెనీల్లో సగానికిపైగా ఉద్యోగుల స్థానంలో ఇప్పటికే చాట్‌జీపీటీ లేదా ఇతర చాట్‌బోట్‌లను వినియోగిస్తున్నట్లు వెల్లడైంది.

మరో సర్వేలో 44 శాతం కంపెనీలు కృత్రిమ మేధను తమ కంపెనీ వ్యవహారాల్లో ఉపయోగించుకొనేందుకు వీలుగా పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిసింది. గతేడాది ఐబీఎం సంస్థ సంపాదించుకున్న మొత్తం 9,130 పేటెంట్లలో 2,300 కృత్రిమ మేధతో సంబంధం ఉన్నవే కావడం రానున్న కాలంలో ఏఐ విస్తృతిని చెప్పకనే చెబుతోంది. 

నియంత్రణ ఎలా? 
ఇందుకలడందుగలడు అన్నట్లుగా అన్ని రంగాల్లోకి, అన్ని విభాగాల్లోకి చోచ్చుకుపోతున్న కృత్రిమ మేధ నియంత్రణ సాధ్యమా? దాన్ని కట్టడి చేయాలంటే అనుసరించాల్సిన పద్ధతులేమిటన్నది ఇప్పుడు కంపెనీ అధిపతుల నుంచి ప్రభుత్వాధినేతల వరకు వేధిస్తున్న ప్రశ్న. కృత్రిమ మేధ నిర్వహించే కార్యకలాపాలను, తప్పొప్పులను న్యాయపరంగా ఎలా ఎదురుకోవాలి, సైబర్‌ సెక్యూరిటీని ఎలా సాధించాలన్న చర్చ ముమ్మరంగా జరుగుతోంది.

ఇప్పటికే ఏఐ ద్వారా ఎలాంటి అవకతవకలు జరగకుండా చూసేందుకు ప్రతి కంపెనీ చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ (సీఐఓ) లేదా చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ (సీటీఓ)ను నియమించుకుంటోంది. రానున్న రోజుల్లో కృత్రిమ మేధ ద్వారా జరిగే కార్యకలాపాల నియంత్రణ అన్నది ప్రతి వ్యాపార సంస్థకు పెద్ద బాధ్యత కాబోతోందని ఫోరెస్టర్‌ చెబుతోంది.

ఇటీవల జరిగిన డేటా రోబో సర్వేలో ఏఐపై ప్రభుత్వ నియంత్రణలకు 81 శాతం మంది టెక్‌ కంపెనీల అధిపతులు సానుకూలంగా స్పందించారు. కృత్రిమ మేధ విస్తరిస్తున్న వేళ ప్రజల సంరక్షణార్థం అమెరికా ఇటీవల ఏఐ బిల్‌ ఆఫ్‌ రైట్స్‌ పేరిట ఒక ముసాయిదా బిల్లును రూపొందించింది. సైబర్‌ సెక్యూరిటీ కోసం కంపెనీలు పాటిస్తున్న మార్గదర్శక సూత్రాలను ప్రభుత్వ నిబంధనలుగా మార్చడంపై చాలా వరకు వ్యాపార సంస్థలు సుముఖంగా ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement