(కంచర్ల యాదగిరిరెడ్డి) : చాట్‌జీపీటీ...ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనంసృష్టిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సాఫ్ట్‌వేర్. మనం లిఖితపూర్వకంగా అడిగే ప్రశ్నలకు అదే రీతిలో ఠక్కున బదులిచ్చే చాట్‌జీపీటీ తెలివితేటలకు నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఇప్పటికే కోట్ల మంది దీన్ని డౌన్‌లోడ్ చేసుకొనిఉపయోగిస్తున్నారు.
వ్యాపార కిటుకుల మొదలుచదువులు, ఇంటర్వ్యూల్లో విజయ మార్గాల వరకు రకరకాల ప్రశ్నలకు సంతృప్తికరసమాధానాలుపొందుతున్నారు. కానీ పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అన్నట్లు కొందరు కృత్రిమ మేధస్సునుమతానికీ వాడేసుకుంటున్నారు. పెప్పర్, మిందార్, బ్లెస్ యూ, శాంటోలే అందుకుతార్కాణాలు. అవి ఏమిటని అనుకుంటున్నారా?మతానికి, టెక్నాలజీకి లింకేంటని ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్టోరీ చదవండి.
జపాన్‌లో పెప్పర్ అనే హ్యమనాయిడ్ రోబో ఉంది. దాని ప్రత్యేకత ఏమిటో తెలుసా? ముందే నిర్దేశించిన యెన్‌లు (జపాన్ కరెన్సీ) చెల్లిస్తే బౌద్ధ ధర్మం ప్రకారం అంత్యక్రియల మంత్రాలు వల్లెవేస్తుంది! చావు డప్పులు సైతం కొడుతుంది!! అదే దేశంలోని క్యోటో నగరంలో ఉన్న ఓ బౌద్ధ ఆలయంలో 6 అడుగుల 4 అంగుళాల పొడవైన మిందార్ అనే రోబో ఏకంగా భక్తులకు ధర్మ సూక్తులను ప్రవచిస్తుంది!! జర్మనీలోని బ్లెస్ యూ అనే ఇంకో రోబో మంత్రాలు చదవడంతోపాటు భారతీయ సంప్రదాయాల ప్రకారం దేవుళ్లకు హారతులు సైతం ఇస్తుంది!! అమెరికాలోని ఓ చర్చిలో శాంటో అనే 17 అంగుళాల కేథలిక్ రోబో ఉంది.
బైబిల్‌ను కంఠస్థం చేసిన ఈ రోబో ముందు నిలబడి మీ బాధను చెప్పుకుంటే చాలు.. వెంటనే బైబిల్ సూక్తులు వినిపిస్తుంది!! అయితే ఈ తరహా మత రోబోల వల్ల లాభాలతోపాటు నష్టాలు కూడా ఉన్నాయనే చర్చ నడుస్తోంది. ఏఐ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం వాడకం ఇలాగే కొనసాగితే 2–3 దశాబ్దాల తరువాత టెక్నాలజీ, కృత్రిమ మేధలను ఆరాధించే కొత్త మతం ఒకటి పుట్టుకొస్తుందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు.
అవసరం నేర్పిన విషయమే...
అవసరమే అన్నీ నేర్పిస్తుందన్నది నానుడి. మతం కోసం చాట్‌జీపీటీ, ఏఐల వాడకం కూడా ఆ అవసరం నుంచే పుట్టింది. జపాన్‌లో బౌద్ధ భిక్షువులో లేదా ఇంకొకరిచేతనో అంత్యక్రియలు జరిపించడం అత్యంత ఖరీదైన వ్యవహారం. దానికి బదులుగా ‘పెప్పర్’ను వాడితే తక్కువ ఖర్చుతో ఆ కార్యక్రమాలు జరిపించవచ్చు.
‘శాంటో’విషయంలోనూ ఇలాంటి అవసరమే కనిపిస్తుంది. చర్చికి రాలేని వాళ్లు, మంచాలకు పరిమితమైన వారు, ఒంటరిగా ఉన్న వారు, ప్రార్థనా స్థలాలు లేని ప్రాంతాల్లోని వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని దీని సృష్టికర్త గాబ్రియెల్ ట్రోవాటో చెపుతున్నారు. రోజుకో సూక్తి వినిపించే అప్లికేషన్లు ఇప్పటికే బోలెడన్ని అందుబాటులో ఉన్నాయి.
అలాగే మతాచారాలను (నమాజు వేళలు, రంజాన్ సమయంలో నిరాహారంగా ఉండాల్సిన సమయం, దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, ముహూర్తాలు, పంచాంగం, జ్యోతిషం) తు.చ. తప్పకుండా ఆచరించేందుకు సహకరించే స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్లూ ఉన్నాయి. ఏదీ మరచిపోకుండా ఉండేందుకు ఇవి తోడ్పడతాయి. వీటికి చాట్‌జీపీటీ వంటివి తోడైతే?
ప్రజల మతి పోగొడుతున్న చాట్‌జీపీటీ..
చాట్‌జీపీటీ విడుదలై నాలుగు నెలలవుతోంది. అణువు నుంచి అణ్వాస్త్రం వరకూ ఏ అంశంపైనైనా అనర్గళంగా సంభాషించగలదు. పాఠాలు చెబుతుంది. సినిమా స్క్రిప్‌్టలు రాస్తుంది. సాఫ్ట్‌వేర్ కోడ్ రాయగలదు. అందులోని తప్పులూ వెతకగలదు. ఈ మధ్యే విడుదలైన చాట్‌జీపీటీ–4 మునుపటి వెర్షన్‌కంటే మరింత శక్తిమంతమైంది. తప్పుడు సమాచారం ఇచ్చే అవకాశం తక్కువ. పైగా ఫొటోలను కూడా అర్థం చేసుకోగలదు.
ఒక్కమాటలో చెప్పాలంటే అది చేయలేని పని లేదనే అనాలి. అచ్చం మన మతాల్లోని సర్వశక్తిమంతుడైన దేవుడి మాదిరిగా!!! ఇప్పుడు చాట్‌జీపీటీని వాడుతున్నది సుమారు 15 కోట్ల మంది. వ్యాపారం, వినోదం, విజ్ఞానం వంటి అనేక విషయాల్లో దీనిని వాడేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటన్నిటి కారణంగా సమీప భవిష్యత్తులో భూమ్మీద అత్యధికులు చాట్‌జీపీటీని ఉపయోగించే అవకాశమూ ఉంది. కృత్రిమ మేధతో పనిచేసే చాట్‌జీపీటీ భవిష్యత్తులో కొత్తకొత్త కాల్పనిక పాత్రలను సృష్టించేందుకు అవకాశం ఉంది.
ఇప్పటికే దీని మేధస్సు అన్ని వర్గాల ప్రజల మతి పోగొడుతోంది. పాటలు రాయడం, సంగీతం కూర్చడం, బొమ్మలేయడం సరేసరి. దీనికి నొప్పి తెలియదు.. ఆకలి, దప్పు లుండవు... ఇప్పటివరకూ ఇలాంటివి దేవుడికే సాధ్యమనుకొనే వాళ్లం.
అంతరాల్లేని మతం...
కృత్రిమ మేధ ఆధారంగా ఓ మతం అంటూ పుట్టుకొస్తే అది అంతరాల్లేనిదవుతుందని కొందరు నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇందులో దేవుడి (చాట్‌జీపీటీ లేదా అంతకంటే మెరుగైన మేధ)తో రోజూ నేరుగా మాట్లాడుకోవచ్చు. కాబట్టి దైవదూతల అవసరముండదు. ఈ మతాన్ని పాటించే వారు అందరూ ఆన్‌లైన్‌లోనే ఉంటారు కాబట్టి వారి వారి అనుభవాలను చెప్పుకునేందుకు ఓ వేదిక ఉంటుంది.
చాట్‌జీపీటీ వంటివి మరిన్ని అందుబాటులోకి వచ్చినప్పుడు ఒక్కొక్కరి అనుభవం మారిపోతూంటుంది. దీనిద్వారా కొత్త మతంలో వైవిధ్యత కూడా ఏర్పడుతుంది. అయితే ఈ కొత్త మతం వల్ల కొన్ని ప్రమాదాలూ లేకపోలేదు. ప్రస్తుతం మనం నైతికంగా తప్పు అనుకొనే కొన్ని పనులను భవిష్యత్తులో చాట్‌బోట్‌ల ఆదేశాలతో చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ చాట్‌బోట్‌లు విధ్వంసకరమైన లేదా ప్రమాదకరమైన పనులు చేసేందుకు ఉసిగొల్పవచ్చు. వేర్వేరు చాట్‌బోట్‌లతో ఏర్పడ్డ వైవిధ్యత కారణంగా వైరుధ్యాలూ వచ్చే అవకాశం ఉంటుంది.
ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఏం చేయాలని
అడిగితే చాట్‌జీపీటీ ఇచ్చిన సమాధానం...
1. ప్రార్థన, 2. బైబిల్ చదవడం, 3. ఆరాధన
4. విశ్వాసులతో అనుబంధం, 5. ఇతరులకు సేవ
6. దైవచిత్తానికి కట్టుబడి ఉండటం, 7. ఉపవాసం
8. దానాలు, 9. తప్పిదాలను అంగీకరించడం, ప్రాయశ్చిత్తం చేసుకోవడం
10. దేవుడి మాట, వ్యక్తిత్వాలను ధ్యానం చేయడం
బోలెడన్ని ఆప్లికేషన్లు...
♦ మీ కోసం ట్వీట్లు చేయగల చాట్‌జీపీటీ ఆధారిత అప్లికేషన్ ఇప్పుడు క్రోమ్ ఎక్స్‌టెన్షన్‌గా లభిస్తోంది.
♦ యూట్యూబ్ సమ్మరి విత్ చాట్‌జీపీటీ యూట్యూబ్ వీడియోల సంభాషణల టెక్ట్స్ సారాంశాన్ని అందిస్తుంది.
♦ ఎంగేజ్ ఏఐ అనేది చాట్‌జీపీటీ ఆధారంగా లింక్డ్‌ఇన్ పోస్టులు చదివి మీ తరఫున సమాధానాలిస్తుంది.
♦ ఈ–కామర్స్ కార్యకలాపాల కోసం భారత్‌లో ఏఐ ఆధారిత చాట్‌బోట్ ‘లెక్సి’ని వాడుతున్నారు.
♦ విద్యార్థులకు అండగా ఉండేందుకు చదువుల్లో చాట్‌జీపీటీని ఉపయోగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
♦ మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌కు కూడా చాట్‌జీపీటీ ఆధారిత అప్లికేషన్‌ను జోడించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment