తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు జెడ్పీ హైసూ్కలు వద్ద ఓటు వేసేందుకు పెద్ద సంఖ్యలో బారులుదీరిన మహిళలు
పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 6 గంటల నుంచే ఓటర్ల బారులు
ఉప్పెనలా కదలివచ్చిన వృద్ధులు, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు
పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అధిక శాతం ఓటింగ్ సాయంత్రం 5 గంటలకు 68.04 శాతం పోలింగ్ నమోదు
6 గంటల వరకు క్యూలైన్లలో ఉన్న వారందరికీ ఓటేసే అవకాశం కల్పించిన ఈసీ
పలుచోట్ల రాత్రి 10 వరకూ కొనసాగిన పోలింగ్.. 76.50 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వర్గాల వెల్లడి
ఫలితాలను నిర్దేశించేది మహిళలు, గ్రామీణులేనన్న ఇండియాటుడే టీవీ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్.. ప్రభుత్వ సేవలను బట్టే 80 శాతం మహిళలు ఓట్లు వేస్తారన్న యాక్సిస్ మై ఇండియా సీఎండీ ప్రదీప్ గుప్తా
సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి గుమ్మం వద్దే ప్రజలకు ప్రభుత్వం సేవలు
సంక్షేమాభివృద్ధి పథకాలతో ఇంటింటా వచ్చిన విప్లవాత్మక మార్పును ప్రతిబింబించిన పోలింగ్ సరళి
ప్రభుత్వ సానుకూలత సునామీలా ఓటెత్తిందంటున్న రాజకీయ పరిశీలకులు
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వంపై సానుకూలత (పాజిటివ్) పోటెత్తింది. ఓటు వేసేందుకు వెల్లువెత్తారు. పోలింగ్ కేంద్రాల వద్ద సోమవారం ఉదయం 6 గంటల నుంచే ఓటర్లు బారులు తీరారు. వృద్ధులు, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రజలు భారీ ఎత్తున కదలివచ్చారు. సాయంత్రం 5 గంటలకు 68.04 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం ఆరు గంటల సమయంలో కూడా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లే కనిపించారు.
వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. కొన్ని కేంద్రాల్లో రాత్రి పది గంటల వరకూ పోలింగ్ కొనసాగింది. మొత్తమ్మీద గత ఎన్నికల తరహాలోనే ఇప్పుడూ పోలింగ్ నమోదు 80 శాతానికి చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నగర, పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక శాతం పోలింగ్ నమోదైంది. ఇటీవల కురుస్తున్న వర్షాలతో ఎండల ప్రభావం తగ్గడం కూడా పోలింగ్ శాతం పెరగడానికి దోహదం చేసింది.
నిర్దేశించేది మహిళలు, గ్రామీణ ఓటర్లే..
పోలింగ్ సరళిపై ఇండియాటుడే ఛానల్ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్ సోమవారం రాత్రి టీవీలో చర్చ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో తాను విస్తారంగా పర్యటించానని.. మహిళలు, గ్రామీణ ప్రాంత ఓటర్లు ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తారని రాజ్‌దీప్ సర్దేశాయ్ పేర్కొన్నారు. ఈ చర్చలో పాల్గొన్న సెఫాలజిస్ట్, ఎగ్జిట్ పోల్స్ నిర్వహించే యాక్సి మై ఇండియా సీఎండీ ప్రదీప్ గుప్తా దీనిపై ఏకీభవించారు. ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికల ఫలితాలను మహిళలు, గ్రామీణ ప్రాంత ఓటర్లే నిర్ణయిస్తారని చెప్పారు. రోడ్లు గురించి కాకుండా ప్రభుత్వ సేవలు ఎలా ఉన్నాయన్నదే ప్రామాణికంగా తీసుకుని 80 శాతం మంది మహిళలు ఓటు వేస్తారని తెలిపారు.
ఇంటింటి అభివృద్ధిని ప్రతిబింబించిన పోలింగ్ సరళి..
నవరత్నాల పథకాలను గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వం అందిస్తోంది. రాష్ట్రంలో పోలింగ్ సరళిని పరిశీలిస్తే మహిళలు, గ్రామీణ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సంక్షేమాభివృద్ధి పథకాలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలలో విప్లవాత్మక సంస్కరణలు, సుపరిపాలనతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలు సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారు.
ఇంటింటి అభివృద్ధి మరింతగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ ఓట్లు వేసేందుకు స్వచ్ఛందంగా వచ్చారు. ప్రభుత్వ సానుకూలత సునామీలా ఓటెత్తిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ ఎన్నికలను పెత్తందారులు – పేదలకు మధ్య జరుగుతున్న యుద్ధంగా బడుగు, బలహీన వర్గాలు భావించడం వల్లే భారీగా పోలింగ్ నమోదైందని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment