
ఆటలు మనుషులకేనా.. మీకే ఒలింపిక్స్ గేమ్స్ ఉంటాయా.. మేమూ ఆడతాం అంటూ చాలెంజ్ చేస్తున్నాయి ఈ ఉడతలు. అంతేకాదు ఐస్ స్కేటింగ్ వంటి గేమ్స్ కూడా ఆడేస్తున్నాయి. ఆడటమే కాదు ఒలింపిక్స్ పతకాలను కూడా గెలుచుకున్నాయి. ఉడతల ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయబ్బా.. ఎక్కడా వినలేదే అనుకుంటున్నారా.. అవును ఒలింపిక్స్ ఏం జరగలేదు. ఇదంతా గీర్ట్ వెగెన్ అనే ఫొటోగ్రాఫర్ మాయాజాలం. తన ఇంటికి వచ్చే ఉడతలకు కొన్ని తిండి గింజలు వేసి.. వాటితో పాటు చిన్న చిన్న ఆటవస్తువులు కూడా పెట్టేవాడు. వాటిని తినేందుకు వచ్చే ఉడతలు.. ఆట వస్తువులపైకి ఎక్కినపుడు ఈ ఫొటోలను తీశాడు. చాలా అద్భుతంగా ఉన్నాయి కదూ..! అయితే వాటిని చూసినంత సులువేం కాదు ఫొటోలు తీయడం అంటే.. ఈ ఫొటోల వెనుక చాలా కష్టం దాగి ఉందని చెబుతున్నాడు వెగెన్. దాదాపు 5 ఏళ్లుగా ఈ ఉడతల ఫొటోలను తీస్తున్నాడట. ఇప్పుడు అవి తనకు మంచి స్నేహితులుగా మారాయని మురిసిపోతున్నాడు.