పాకాల ఆయకట్టు పరిధిలో సాగైన వరి పంట (ఫైల్)
ఖానాపురం: రైతులు దొడ్డు రకం వరి విత్తనాలు సాగుచేయొద్దు.. మిల్లర్లు ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయమని తెగేసి చెబుతున్నారు. రైతులు తొందరపడి సాగు చేస్తే అమ్ముకోవడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఖానాపురం మండలం ధాన్యాగార కేంద్రంగా గుర్తింపు పొందింది. పాకాల చెరువు నర్సంపేట రైతులకు ప్రధాన నీటి వనరు. ఆయకట్టు కింద ఖరీఫ్‌లో 29,500 ఎకరాల్లో వరి పంటలు సాగవుతాయి. రబీలోనూ నీటి లభ్యత ఆధారంగా పంటలు సాగు చేసేవారు. కానీ, పాకాలకు గోదావరి జలాలు రావడంతో రబీలోనూ పూర్తిస్థాయిలో వరి పంటలు సాగయ్యాయి.
ఖరీఫ్‌లో రైతులు ఎక్కువగా దొడ్డు రకం ధాన్యాన్ని సాగు చేస్తారు. ఇందులో ప్రధానంగా ఎంటీయూ–1001తోపాటు పలు రకాలు ఉన్నాయి. గత ఖరీఫ్‌లో సుమారు 5 వేల ఎకరాల్లో దొడ్డు రకం వడ్లను సాగు చేసినట్లు వ్యవసాయ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. సన్న రకాలను తెగుళ్ల బారి నుంచి రక్షించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో రైతులు దొడ్డు రకాల వైపే మొగ్గు చూపుతారు.
ఎఫ్‌సీఐ నిబంధనతో..
ఎంటీయూ–1001 రకం ధాన్యాన్ని కొనుగోలు చేయమని ఎఫ్‌సీఐ నిబంధన పెట్టడంతో మిల్లర్లు దొడ్డు రకాలను కొనుగోలు చేయమని తెగేసి చెబుతున్నారు. ఈ రకాన్ని రైతులు సాగు చేయకుండా నియంత్రించాలని మిల్లర్లు జిల్లా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో దొడ్డు రకం ధాన్యాన్ని కొనుగోలు చేయవద్దని మండల వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతీ సమావేశంలోనూ ప్రజాప్రతినిధులకు తెలిపి రైతులు సాగు చేయకుండా నియంత్రించాలని సూచిస్తున్నారు.
దీంతోపాటు విత్తన డీలర్లు సైతం ఎంటీయూ–1001 రకం ధాన్యం బస్తాలను విక్రయించకూడదని స్పష్టంగా ఆదేశించినట్లు తెలిసింది. ఈ ఒక్క రకాన్ని కాకుండా ఇతర దొడ్డు రకాలను రైతులు సాగు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. రైతులు తొందరపడి సాగు చేస్తే విక్రయించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని సూచిస్తున్నారు. ఎంటీయూ–1001 రకాన్ని కొనుగోలు చేయమంటూ మిల్లర్లు కరపత్రాలను ముద్రించి మరీ గ్రామాలకు చేరవేస్తున్నారు.
1001 సాగు చేయొద్దు
రైతులు దొడ్డు రకం ఎంటీయూ–1001 రకాన్ని సాగు చేయొద్దు. ఎఫ్‌సీఐ దొడ్డు రకాన్ని తీసుకోమని చెప్పడంతో మిల్లర్లు కొనుగోలు చేయమని ఉన్నతాధికారులకు తెలిపారు. దీంతో ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. డీలర్లకు సైతం ఇప్పటికే దొడ్డు రకం విత్తన వడ్లను విక్రయించొద్దని సూచించాం.
– బోగ శ్రీనివాస్, వ్యవసాయ అధికారి, ఖానాపురం
Comments
Please login to add a commentAdd a comment