Paddy rice
-
‘ఎంటీయూ–1001’ రకం ధాన్యం సాగు చేయొద్దు
ఖానాపురం: రైతులు దొడ్డు రకం వరి విత్తనాలు సాగుచేయొద్దు.. మిల్లర్లు ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయమని తెగేసి చెబుతున్నారు. రైతులు తొందరపడి సాగు చేస్తే అమ్ముకోవడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఖానాపురం మండలం ధాన్యాగార కేంద్రంగా గుర్తింపు పొందింది. పాకాల చెరువు నర్సంపేట రైతులకు ప్రధాన నీటి వనరు. ఆయకట్టు కింద ఖరీఫ్‌లో 29,500 ఎకరాల్లో వరి పంటలు సాగవుతాయి. రబీలోనూ నీటి లభ్యత ఆధారంగా పంటలు సాగు చేసేవారు. కానీ, పాకాలకు గోదావరి జలాలు రావడంతో రబీలోనూ పూర్తిస్థాయిలో వరి పంటలు సాగయ్యాయి. ఖరీఫ్‌లో రైతులు ఎక్కువగా దొడ్డు రకం ధాన్యాన్ని సాగు చేస్తారు. ఇందులో ప్రధానంగా ఎంటీయూ–1001తోపాటు పలు రకాలు ఉన్నాయి. గత ఖరీఫ్‌లో సుమారు 5 వేల ఎకరాల్లో దొడ్డు రకం వడ్లను సాగు చేసినట్లు వ్యవసాయ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. సన్న రకాలను తెగుళ్ల బారి నుంచి రక్షించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో రైతులు దొడ్డు రకాల వైపే మొగ్గు చూపుతారు. ఎఫ్‌సీఐ నిబంధనతో.. ఎంటీయూ–1001 రకం ధాన్యాన్ని కొనుగోలు చేయమని ఎఫ్‌సీఐ నిబంధన పెట్టడంతో మిల్లర్లు దొడ్డు రకాలను కొనుగోలు చేయమని తెగేసి చెబుతున్నారు. ఈ రకాన్ని రైతులు సాగు చేయకుండా నియంత్రించాలని మిల్లర్లు జిల్లా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో దొడ్డు రకం ధాన్యాన్ని కొనుగోలు చేయవద్దని మండల వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతీ సమావేశంలోనూ ప్రజాప్రతినిధులకు తెలిపి రైతులు సాగు చేయకుండా నియంత్రించాలని సూచిస్తున్నారు. దీంతోపాటు విత్తన డీలర్లు సైతం ఎంటీయూ–1001 రకం ధాన్యం బస్తాలను విక్రయించకూడదని స్పష్టంగా ఆదేశించినట్లు తెలిసింది. ఈ ఒక్క రకాన్ని కాకుండా ఇతర దొడ్డు రకాలను రైతులు సాగు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. రైతులు తొందరపడి సాగు చేస్తే విక్రయించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని సూచిస్తున్నారు. ఎంటీయూ–1001 రకాన్ని కొనుగోలు చేయమంటూ మిల్లర్లు కరపత్రాలను ముద్రించి మరీ గ్రామాలకు చేరవేస్తున్నారు. 1001 సాగు చేయొద్దు రైతులు దొడ్డు రకం ఎంటీయూ–1001 రకాన్ని సాగు చేయొద్దు. ఎఫ్‌సీఐ దొడ్డు రకాన్ని తీసుకోమని చెప్పడంతో మిల్లర్లు కొనుగోలు చేయమని ఉన్నతాధికారులకు తెలిపారు. దీంతో ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. డీలర్లకు సైతం ఇప్పటికే దొడ్డు రకం విత్తన వడ్లను విక్రయించొద్దని సూచించాం. – బోగ శ్రీనివాస్, వ్యవసాయ అధికారి, ఖానాపురం -
నెలకు 3 లక్షల రూపాయల జీతం వదిలేసి..
ఆయన ఓ విశ్రాంత ఉద్యోగి. నెలకు రూ.3 లక్షలు జీతం. ప్రైవేటు కంపెనీలో డిజిఎంగా పనిచేసి వీఆర్ఎస్ తీసుకున్నారు ఘట్రాజు వెంకటేశ్వరరావు. వ్యవసాయంపై ఉన్న ఆసక్తితో అమ్మమ్మ గారి ఊరు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామానికి వచ్చి తమ 4.5 ఎకరాల పొలంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో దేశీ వరి రకాల సాగు చేపట్టారు. సుమారు రెండేళ్లు నిల్వ చేసిన ధాన్యాన్ని ఆరోగ్యదాయకమైన దేశీ బియ్యం విక్రయిస్తూ లాభాలతో ఆత్మసంతృప్తిని ఆర్జిస్తున్నారు. ఆయన అనుభవాల సారం ఆయన మాటల్లోనే.. ‘‘ప్రముఖ కంపెనీలో ముంబైలో ఉద్యోగం చేశాను. డీజీఎంగా బాధ్యతలు నిర్వహణ. ఐదేళ్ల క్రితం వీఆర్ఎస్ తీసుకుని హైదరాబాద్‌కు వచ్చేశాను. అప్పటికే ప్రకృతి సేద్యంపై ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ప్రకతి వ్యవసాయ నిపుణులు సుభాష్ పాలేకర్ శిక్షణా తరగతుల్లో పాలొని మెళకువలు నేర్చుకున్నా. ఆచరణలో పెట్టేందుకు అమ్మమ్మ వాళ్ల ఊరైన కోలవెన్ను వచ్చి స్థిరపడ్డా. 4.5 ఎకరాల్లో తులసీబాణం, నారాయణ కామిని, నవారా, కాలాభట్, మార్టూరు సన్నాలు, రత్నచోడి, బహురూపి వంటి దేశీ వరి రకాలు సాగు చేస్తున్నా. రెండు ఆవులను తెచ్చుకున్నా. ఏటా సాగు ఆరంభంలో 40 ట్రక్కుల ఘన జీవామృతాన్ని పొలంలో చల్లుతున్నా. పంటకు అన్ని పోషకాలు సమృద్ధిగా లభిస్తున్నాయి. వర్రలతో బావిని కట్టించి 1200 లీటర్ల జీవామృతం తయారుచేసి 15 రోజులకోసారి చల్లుతున్నా. పంట ఆరోగ్యంగా ఎదుగుతున్నది. తెగుళ్ల బెడద లేదు. ఆవ పిండి చెక్క కూడా జీవామృతంలో కలిపి వాడుతున్నా. ఎకరాకు రూ. 25–30 వేల వరకూ పెట్టుబడి అవుతుంది. 25–28 బస్తాల వరకూ ధాన్యం దిగుబడి వస్తున్నది. పంటను ఆశించే పురుగు నివారణకు వేపపిండి చల్లుతాను. పోషకాలు జీవామతం ద్వారా అందుతాయి. మరీ అవసరం అయితే, అగ్ని అస్త్రం చల్లుతాను. ఎలాంటి పురుగైనా నాశనం అవుతుంది. దేశవాళీ విత్తన పంట నిల్వ, మార్కెటింగ్ విషయాలు చాలా ప్రధానమైనవి. పంట చేతికి వచ్చాక కనీసం 10 నెలల నుంచి రెండేళ్ల వరకూ పంటను మాగబెట్టిన ధాన్యాన్ని మిల్లులో ఆడించి నాణ్యమైన బియ్యాన్ని బెంగుళూరు, హైదరాబాద్, కొచ్చిన్, చెన్నై ప్రాంతాల్లో ఉన్న నేరుగా విక్రయిస్తున్నా. నవారా, కాలాభట్ స్థానికంగా కిలో రూ. 90కి, బయట ప్రాంతాలకు రూ. 120కే అందిస్తున్నా, రవాణా ఖర్చు కూడా కలిపి. ఇతర రకాల బియ్యం కిలో రూ.75కే ఇస్తున్నా. ప్రతి రైతూ ప్రకృతి విధానం వైపు అడుగులు వేస్తే దిగుబడులు, ఆరోగ్యం, ఆదాయం, భూసారం పెంపుదల సాధ్యమే. ప్రభుత్వం రైతు భరోసా, ఇతర సబ్సిడీలు అందిస్తున్నది. వీటితో పాటు ప్రకృతి విధానంలో పండించిన పంటకు అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని మార్కెటింగ్ సదుపాయాలు విస్తరించి, అదనపు వసతులు కల్పిస్తే కొత్త రైతులు కూడా ఈ విధానంలోకి వచ్చేస్తారు.’’ – ఈ.శివప్రసాద్, సాక్షి, కంకిపాడు, కృష్ణా జిల్లా వడ్లు ఎంత మాగితే అన్నం అంత ఒదుగుతుంది. ధాన్యం నిల్వ చేయకుండా తినటం వల్ల కడుపు నొప్పి, అజీర్ణ సమస్యలు ఏర్పడతాయి. పంట నాణ్యంగా ఉంటే ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. అలాగే ప్రకృతి విధానం వల్ల భూసారం పెంపొందుతుందని గుర్తించాను. (క్లిక్: కొబ్బరి పొట్టుతో సేంద్రియ ఎరువు! ఎలా తయారు చేసుకోవాలంటే!) – ఘట్రాజు వెంకటేశ్వరరావు (92255 25562), కోలవెన్ను -
TS: కిలో కూడా ఎక్కువ కొనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గత యాసంగిలో ఉత్పత్తి అయిన బియ్యం సేకరణ విషయంలో కేంద్రం ఏమాత్రం కనికరం చూపడం లేదు. గతంలో సేకరించిన మాదిరే బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం) ఎక్కువగా తీసుకోవాలని పదేపదే కోరుతున్నా..ఒక్క కిలో కూడా ఎక్కువ తీసుకోబోమని తేల్చి చెబుతోంది. 2019–20కి సంబంధించి మిగిలిపోయిన లక్ష మెట్రిక్ టన్నుల కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను తీసుకునేందుకు ఎట్టకేలకు అంగీకరించిన భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ), గత యాసంగికి సంబంధించి 50 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ తీసుకోవాలన్న రాష్ట్ర వినతికి మాత్రం ససేమిరా అంటోంది. అదే జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా బాయిల్డ్ రైస్ నిల్వలు ఎక్కడివక్కడే పేరుకుపోయే అవకాశం ఉంది. లక్ష టన్నుల సీఎంఆర్‌కు సానుకూలం 2019–20 ఏడాదికి సంబంధించి తాను కొనుగోలు చేసిన 64.17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌర సరఫరాలశాఖ సీఎంఆర్ కింద మిల్లర్లకు అప్పగించింది. ఈ ధాన్యం మిల్లింగ్ అనంతరం 43.59 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంది. అయితే గడువులోగా 42.54 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే అప్పగించగా, సుమారు లక్ష మెట్రిక్ టన్నుల బియ్యం అప్పగింత ఆలస్యమైంది. దీంతో ఈ బియ్యం తీసుకునేందుకు కేంద్రం నిరాకరిస్తోంది. ఈ బియ్యం విలువ దాదాపు రూ.400 కోట్ల వరకు ఉంటుంది. ఈ బియ్యం తీసుకోవాల్సిందిగా గతంలో పలుమార్లు కోరినా కేంద్రం ససేమిరా అంటూ వస్తోంది. అయితే పది రోజుల కిందట మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్‌లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో చర్చించగా, లక్ష టన్నులు తీసుకునేందుకు ఓకే చెప్పారు. నెల రోజుల్లో డెలివరీ ఇవ్వాలని సూచించడంతో రాష్ట్రానికి పెద్ద ఉపశమనం లభించింది. బాయిల్డ్ రైస్‌పై మాత్రం స్పందన కరువు రాష్ట్రంలో 2020–21 యాసంగికి సంబంధించిన మొత్తం 62.84 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంలో 50 లక్షలు బాయిల్డ్ రైస్, మరో 12.84 లక్షల రారైస్ (పచ్చిబియ్యం) తీసుకోవాలని రాష్ట్రం కోరుతోంది. అయితే కేవలం 24.57 లక్షల మెట్రిక్ టన్నుల మేర మాత్రమే బాయిల్డ్ రైస్ ఇచ్చి, మిగతాదంతా రారైస్ ఇవ్వాలని కేంద్రం పట్టుబడుతోంది. 24.57 లక్షల టన్నుల్లో ఇప్పటికే 16 లక్షల టన్నుల మేర సేకరిం చగా, మిగతా ప్రక్రియ కొనసాగుతోంది. కేంద్రం అదనంగా బాయిల్డ్ రైస్ సేకరణ చేయలేమని చెబుతుండటంతో నిల్వల ఖాళీ రాష్ట్రానికి పెద్ద తలనొప్పి వ్యవహారంలా మారుతోంది. 80 లక్షలు కోరితే 60 లక్షలకు ఓకే... సాగు పెరిగిన నేపథ్యంలో ప్రస్తుత వానాకాలంలో రాష్ట్రంలో 1.40 కోట్ల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం ఉత్పత్తి అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో 80 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యాన్ని సేకరించాల్సిందిగా కేంద్రాన్ని రాష్ట్రం కోరుతోంది. అయితే మొదట 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తీసుకుంటామన్న ఎఫ్‌సీఐ.. తర్వాత రాష్ట్ర సంప్రదింపుల నేపథ్యంలో 60 లక్షల మెట్రిక్ టన్నులకు అంగీకరించింది. దీంతో మిగతా 20 లక్షల టన్నుల ధాన్యంపై సందిగ్ధత నెలకొంది. చదవండి: TS: ఎగుమతులతోనే రైతు ఆదాయం రెట్టింపు -
మినుములు–వరి మితంగా తింటే సరి
ఆహార శాస్త్రం గురించి ఆయుర్వేదం నిశితంగా పరిశోధించింది. శరీర పోషణ కోసం తీసుకునే ప్రతి పదార్థాన్ని ఆహారంగా వివరించింది. ఆహారాన్ని తినే విధానాన్ని బట్టి, ‘పాన (తాగేవి), చోష్య (చప్పరించేవి), లేహ్య (నాకేవి), భక్ష్య (నమిలి తినేవి) అని నాలుగు రకాలుగా వర్గీకరించింది. వండక్కర లేకుండా సహజంగా ప్రకృతి ప్రసాదించే కందమూల ఫలాలు, కొబ్బరి నీళ్లు, చెరకు రసం వంటి పానీయాలు ఒక రకం. కొత్త రుచులను కనిపెడుతూ మనం తయారుచేసుకునే తినుబండారాలు రెండవ రకం. వీటిని కృతాన్నాలు అంటారు. ప్రతి ద్రవ్యానికి ఉండే పోషక విలువలు, ఔషధ గుణాలను కూడా విశదీకరించింది. వరి, గోధుమలు మన దేశంలో ప్రధాన ఆహారం. వరి బియ్యం, మినుములకు సంబంధించిన వివరాలు.. వరి: క్షేత్ర బీజ ప్రాధాన్యత, పంటకాలం (ఋతువులు) ప్రాతిపదికగా రకరకాల ధాన్యాలు మనకు చాలా కాలంగా ఉన్నాయి. వాటి రుచులు, పోషక విలువలలో కూడా తేడాలు ఉన్నాయి. శాలిధాన్యం: కండనేన వినా శుక్లా హేమంతాః శాలయః స్మృతాః (భావ ప్రకాశ) హేమంత ఋతువులో సంక్రాంతి సమయంలో పంటకు వచ్చేవి, పైపొట్టు తీయబడి తెల్లగా ఉండే బియ్యం శాలిధాన్యం. ఈ గింజల రంగు, పరిమాణాలలో చాలా భేదాలున్నాయి. సామాన్య గుణధర్మాలు శాలయో మధురా స్నిగ్ధా బల్యా... వృష్యాశ్చ బృంహణాః.... మేధ్యాః చ ఏవ బలావహాః... ఈ అన్నం తియ్యగా జిగురుగా ఉండి, రుచికరమై, బలకరమై మలమూత్ర విసర్జనకు తోడ్పడుతుంది. మేధాకరం (బుద్ధిని వికసింపచేస్తుంది), శుక్రకరం. చలవ చేస్తుంది. కొత్త బియ్యం: వాపితేభ్యో గుణైః... రోపితాస్తు నవా వృష్యాః; పురాణా లఘవః స్మృతాః... (భావప్రకాశ) కొత్త ధాన్యం నుంచి వెంటనే ఆడించిన బియ్యంతో వండిన అన్నం కొంచెం బరువుగా ఉండి, అరుగుదల మందగిస్తుంది. పాతవైతే లఘుగుణం కలిగి, తేలికగా జీర్ణమవుతుంది. ఆధునిక శాస్త్రం రీత్యా: పాలిష్ చేసిన తెల్ల బియ్యంలో పిండి పదార్థాలు అధికంగా (78 శాతం) ఉంటాయి. ప్రొటీన్లు (6.8), కొవ్వు (0.5), ఐరన్ (0.7) ఫాస్ఫరస్ (160) శాతం ఉంటాయి. పొట్టుతో (తవుడుతో) కూడిన గోధుమ రంగు ముడిబియ్యంలో పిండి పదార్థాలు కొంచెం తక్కువగా ఉండి, బీ విటమిన్లు అధికంగా ఉంటాయి. కనుక తెల్లటి బియ్యం డయా»ñ టిస్ వ్యాధికి దోహదకారి. ముడి బియ్యాన్ని వండుకుని, మితంగా పరిమిత ప్రమాణంలో తింటే నష్టం ఉండదు. కాల్షియం, కాపర్, జింక్ వంటి లవణాలు కూడా లభిస్తాయి. మినుములు: వీటిని సంస్కృతంలో మాష అంటారు. ‘‘మాషో గురుః స్వాదుపాకః... అనిలాపః‘... శుక్రణో బృంహణః... మేదః కఫ ప్రదః... శూలాని నాశయేత్ (భావప్రకాశ) తియ్యగా రుచికరంగా ఉండే బరువైన ఆహారం. శరీర కొవ్వును బరువును పెంచుతుంది. విరేచనం సాఫీగా చేస్తుంది. శుక్రాన్ని, స్తన్యాన్ని వృద్ధి చేస్తుంది. కొంచెం వేడి చేస్తుంది. ‘ఆర్శస్ (పైల్స్), అర్ధి్దత వాతం (ముఖంలో సగభాగానికి వచ్చే ప„ý వాతం), తమక శ్వాస (ఆయాసం), కడుపులోని పుండ్లు (అల్సర్స్)... వీటిని పోగొడుతుంది. బలహీనులకు మంచి ఆహారం. క్రమశిక్షణతో వ్యాయామం చేసేవారికి చక్కటి ఆహారం. ఇడ్లీ, డోసెలలో మినుములు, వరి బియ్యం ఉంటాయి. కనుక వీటి సత్ఫలితాలను పొందాలనుకుంటే, పరిమితంగా తింటే మంచిది. పైన ఉండే నల్లని పొట్టుతోబాటు మినుముల్ని వాడుకుంటే పోషక విలువలు బాగా లభిస్తాయి. ఆధునిక శాస్త్ర వివరాలు.. (100 గ్రా.లో ఉండే పోషకాలు, గ్రాములలో) పప్పు: ప్రోటీన్లు (24), కొవ్వు (1.4), పిండి పదార్థాలు (59.6), కాల్షియం (15.4), ఫాస్ఫరస్ (385), ఐరన్ (3.8). పొట్టుతో ఉన్న మినుములలో సోడియం, పొటాషియం.. ఇవి రెండూ శూన్యం. పొట్టు తీసిన పప్పులో సోడియం నూరు గ్రాములకి 39.8 మి.గ్రా. పొటాషియం 800 మి. గ్రాములు, ఇతర లవణాలు తగినంత లభిస్తాయి. గమనిక: తెలుగువారి వంటకాలలో గారె విశిష్టమైనది. దీనిని కేవలం మినుములతోనే చేస్తారు. కొందరు బియ్యాన్ని కూడా కలిపి నానిన తరవాత పిండి రుబ్బుతారు. దీనివలన నూనెలో వేగినప్పుడు నూనె ఎక్కువగా పీల్చదని పరిశీలన. పెరుగు వడ కూడా చేస్తుంటారు. తగురీతిలో వ్యాయామం చేస్తూ, ఇవి మితంగా సేవిస్తే ప్రయోజనం మెండు. – డా. వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద వైద్య నిపుణులు, హైదరాబాద్, ఫోన్: 9963634484 -
అన్నం వండి ఆర్సెనిక్ వార్చేయండి!
మీరు నమ్మినా, నమ్మకున్నా మనం తినే అన్నంలో భయంకరమైన విషం ఉందంటున్నారు ఆహార, రసాయన నిపుణులు. దాని పేరే ఆర్సెనిక్. ఆ విషం విషయమేమిటో తెలుసుకోవాలంటే అసలు ముందుగా ఆర్సెనిక్ అంటే ఏమిటో తెలుసుకుంటే మంచిది. పూర్వకాలంలో రాజరిక పరిపాలన సమయంలో, అంతఃపుర కుట్రల్లో ప్రత్యర్థులను నిశ్శబ్దంగా మట్టుబెట్టడానికి ఉపయోగించే విషమే ఆర్సెనిక్. ఇది ఎంత ప్రభావవంతమైనదంటే నెమ్మదిగా ఇస్తూపోతే స్వాభావిక మరణంలా అనిపించేలా మృత్యువు పాలవుతారు. లేదా పెద్దమోతాదులో ఇస్తే ఠక్కున మృతిచెందుతారు. ప్రముఖ నియంత నెపోలియన్ ఆర్సెనిక్ పాయిజనింగ్తో మరణించాడనే మాట ఒకటి ప్రచారంలో ఉంది. ఇక జేమ్స్‌బాండ్ సినిమాల్లోని గూఢచారులు శత్రువుల చేతికి చిక్కినప్పుడు ఒక విషపు మాత్రను నోట్లో వేసుకొని మరణిస్తుంటారు. ఇందుకోసం ఉపయోగించే విషాలలో ఒకటి సైనైడ్ కాగా రెండోది ఆర్సెనిక్. అయితే శత్రువులను తుదముట్టించడం కోసం ఉపయోగించేందుకు ఆర్సెనిక్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా అన్నం పెడితే సరిపోతుందా అన్న పరిస్థితి ఇటీవల మన సమాజం ముందుంది. కాస్త అతిశయోక్తిగా అనిపించినా ఇది నిజం అంటున్నారు ఆహార, రసాయన నిపుణులు. రసాయన ఎరువులు, పురుగుమందులతో మట్టిలోకి అన్ని విషాలతో పాటు ఆర్సెనిక్ ఇంకుతోంది. అది మళ్లీ మొక్కల్లోంచి మనుషుల దేహాల్లోకి వచ్చి ప్రమాదఘంటికలను మోగిస్తోందని వారు హెచ్చరిస్తున్నారు. ఆ ప్రమాదం నుంచి తప్పుకోవడం ఎలాగో కూడా సూచిస్తున్నారు. ఆ విషయాలను తెలుసుకునేందుకు పుణేలోని నేషనల్ కెమికల్ లేబరేటరీకి చెందిన నిపుణులు చెబుతున్న అంశాలివి... రసాయనిక ఎరువుల, పురుగుమందుల విస్తృత ఉపయోగంతో మనం తినే వరి అన్నం, బంగాళదుంపలు తదితర ఆహార పదార్థాల్లోకి విషం... అందునా ప్రమాదకరమైన ఆర్సెనిక్ విషం చేరే అవకాశాలు ఎక్కువ. దీనివల్ల డయాబెటిస్, క్యాన్సర్ వ్యాధులు వంటి వ్యాధులు ప్రబలే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు పుణేలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ కెమికల్ లేబరేటరీ విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఓ. జి. బి. నంబియార్. మనం తినే ఆహారంలోని విషపదార్థాలపై అనేక ఆసక్తికరమైన అంశాలను ఆయన వెల్లడించారు. మన దేహం నుంచి వ్యర్థాల రూపంలో విసర్జితమైపోయే ఆర్సెనిక్‌తోపాటు మనకు అవసరమైన థయామిన్ పోషకం దేహం నుంచి అతిగా బయటకు వెళ్లిపోతుండడం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే దీనికి విరుగుడు కూడా ఆయన సూచిస్తున్నారు. వరి అన్నం వండినప్పుడు గంజి వార్చితే బియ్యంలోని ఆర్సెనిక్ విషం చాలా వరకు పోతుందని ఒక పరిష్కారం చెబుతున్నారు. అయితే మరికొన్ని ప్రత్యామ్నాయ ఆహారాలను ఆయన సూచిస్తున్నారు. థయామిన్ పుష్కలంగా ఉండే కొర్రలు వంటి చిరుధాన్యాలను ప్రధాన ఆహారంగా తీసుకుంటే ఆర్సెనిక్ బాధ తప్పుతుందని, థయామిన్ కొరత ఉండదు కాబట్టి డయాబెటిస్ సమస్య కూడా రాకుండా ఉంటుందని ఆయన అంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రకృతి ఆహారోత్సవంలో పాల్గొన్న డాక్టర్ నంబియార్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. వివరాలు.. ఆయన మాటల్లోనే.. ►మనిషి దేహంలోకి వరి అన్నం, బంగాళదుంపల ద్వారా ఆర్సెనిక్ విషం ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించే ఆ ఆర్సినిక్ రక్తంలోని థయామిన్‌ను మూత్రం ద్వారా అతిగా బయటకు వెళ్లిపో యేలా చేస్తుం టుంది. ధయామిన్ మనకు ఉపయోగకరమైన, అత్యంత కీలకమైన పోషకం. అది పోవడం మనకు నష్టం. ►ఆహారంలో ఆర్సినిక్ ఉన్నప్పుడు థయామిన్ ఎంత ప్రభావపూర్వకంగా పనిచేయాలో అంతగా పనిచేయదు. దాంతో మన శరీరంలో స్రవించిన ఇన్సులిన్ కూడా ఎంత ప్రభావవంతగా ఉండాలో అంత ప్రభావవంతంగా తన కార్యకలాపాలు సాగించలేదు. ఫలితంగా ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ వస్తుంది. సరిగ్గా ఇలాంటి పరిణామమే టైప్–2 డయాబెటిస్‌లోనూ ఉంటుంది. ►ఇక డయాబెటిస్ రోగుల దేహంలో వారి అవసరాలతో పోలిస్తే కేవలం 20% మాత్రమే థయామిన్ అందుబాటులో ఉంటుంది. ►థయామిన్ గ్లూకోజ్‌తో జత చేరినప్పుడే జీవక్రియ సక్రమంగా జరుగుతుంది. అయితే థయామిన్ లోపం వల్ల జీవక్రియలు సక్రమంగా జరగకపోవడంతో పాటు అనేక వరస పరిణామాలు సంభవిస్తాయి. ►2012–15 మధ్యకాలంలో అమెరికాకు చెందిన ఎఫ్.డి.ఎ. 1200 రకాల వరి బియ్యంపై అధ్యయనం చేసి... వరి బియ్యంలో అధికపాళ్లలో ఆర్సెనిక్ విషం ఉందని నిర్ధారణ చేసింది. ►చాలా మంది ఆరోగ్యం కోసం పాలిష్ చేసిన బియ్యం కంటే పాలిష్ చేయని ముడిబియ్యాన్ని వాడుతుంటారు. పాలిష్ చేసిన బియ్యంలో పోషకాలు వెళ్లిపోతాయని, అదే ముడిబియ్యంలో పోషకాలు చాలావరకు పోవని చాలామందిలో ఒక అభిప్రాయం ఉంది. అయితే పాలిష్ చెయ్యని ముడిబియ్యంలో ఆర్సెనిక్ విషం మరింత ఎక్కువగా ఉంటుంది. బియ్యం పైపొరలో ఆర్సెనిక్ విషం ఎక్కువగా ఉంటుంది. ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి ఆర్సనిక్ విష ప్రభావాలు తగ్గించే దిశగా మరికొన్ని పరిశోధనలూ జరుగుతున్నాయంటున్నారు డాక్టర్ నంబియార్. వాటి గురించి ఆయన చెబుతున్న అంశాలివి... ► రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడుతున్నప్పటి నుంచి, అధిక దిగుబడి వరి వంగడాలను వాడుతున్నప్పటి నుంచి ఆర్సెనిక్ విషం వరి అన్నంలో ఎక్కువ మోతాదులో ఉంటున్నదేమో అనే విషయంపై ఇంకా అధ్యయనం చేయాల్సి ఉంది. ∙ఒక బాక్టీరియా ద్రావణాన్ని ఉపయోగించడం ద్వారా వరి మొక్కల వేళ్లు ఆర్సెనిక్ విషాన్ని మట్టి నుంచి పీల్చుకోకుండా ఉండే ఒక సాగు పద్ధతిపై నా అధ్యయనం ఇంకా కొనసాగుతోంది. ఇది విజయవంతమైతే ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు మేలు జరుగుతుంది. అయితే ఈ పరిశోధన పూర్తికావడానికి ఇంకా కొన్నాళ్ల సమయం పడుతుంది ∙ వరి బియ్యం, బంగాళదుంపలు, ఇతర ధాన్యాలు, మూత్రం, నీరు, గోళ్లు, వెంట్రుకలలో ఆర్సెనిక్ ఎంత ఉన్నదీ 20 నిమిషాల్లో తెలిపే ఒక కిట్ (క్వాంటిటేటివ్ ఆర్సెనిక్ మోనిటర్)ను నేను కనుగొన్నాను. యునిసెఫ్ ఆర్థిక సహాయంతో బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్‌లలో తాగునీటిలో ఆర్సెనిక్పై పరిశోధనలో భాగంగా 2000 సంవత్సరంలో దీన్ని కనుగొన్నాను. దీన్ని సాధారణ వ్యక్తి ఎవరైనా ఉపయోగించి ఆయా ఆహార పదార్థాల్లో ఆర్సెనిక్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు ∙డయాబెటిక్ రోగులు బెన్ ఫో థయామిన్ (విటమిన్ బి1) 200 ఎం.జి. టాబ్లెట్‌ను భోజనంతో పాటుగా (రోజుకు రెండు) తీసుకోవచ్చు. వట్టి థయామిన్ మాత్ర తీసుకోవడం కన్నా కొవ్వులో కరిగే థయామిన్ డెరివేటివ్‌ను వాడటం మంచిది. భయం లేదు... జాగ్రత్తలివే... ►కొర్రలు వంటి చిరుధాన్యాలు థయామిన్ అధికపాళ్లలో కలిగి ఉంటాయి గాకీ ఆర్సెనిక్‌ను ఏమాత్రం కలిగి ఉండవు. ఇలాంటి విషం లేని వాటిని ప్రధాన ఆహారంగా తీసుకుంటే సమస్య ఉండదు. అయితే, వరి బియ్యం తినటం అనేది అనాదిగా మన ఆహారపు అలవాటు. వరి బియ్యం తినటాన్ని వెంటనే మానుకోలేం. కాబట్టి వరి బియ్యాన్ని ఆరు రెట్లు ఎక్కువ నీరు పోసి ఉడికించి... గంజి వార్చి పారబోస్తే అన్నంలోని ఆర్సెనిక్ చాలా వరకు పోతుంది. అయితే ఇలా వార్చిన గంజి పశువులకు కూడా మంచిది కాదు. ∙వరి మొక్కల వేళ్ల మారిదిగానే బంగాళదుంప మొక్కల వేళ్లు కూడా ఆర్సెనిక్ విషాన్ని మట్టి నుంచి ఎక్కువగా గ్రహిస్తుంటాయి. బంగాళదుంపల్లో 70 శాతం నీరుంటుంది. బంగాళదుంప చిప్స్‌లో ఆర్సెనిక్ విషం పాళ్లు ఎక్కువగా ఉంటాయి. బంగాళదుంపను కోసి బాగా కడిగితే ఆర్సెనిక్ పోతుంది. కడగకుండా అలాగే వేపితే ఆర్సెనిక్ అందులోనే ఉండిపోతుంది. ∙గర్భవతులు వరి బియ్యంతో వండిన అన్నం అసలు తినకుండా చిరుధాన్యాలు తదితర ఆహార ధాన్యాలు తినటం మంచిది. ఐదేళ్ల లోపు పిల్లలకు కూడా వరి అన్నం తినిపించకుండా ఉంటేనే మంచిది. వారికి మొదటినుంచి చిరుధాన్యాలతో చేసిన వంటకాలు తినిపించడం మంచిది. -
కొనలేని కేంద్రాలు..!
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రబీలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిగా కొనకపోవడంతో ఇంకా రైతుల వద్దే ధా న్యం దర్శనమిస్తోంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 15 వేల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యం కొనుగోలు చేయా ల్సి ఉంది. 15 కొనుగోలు కేంద్రాల్లో 8వేల ఎంటీల ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉంది. దీంతో వర్షాకాలం సమీపించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సరిపడా గోదాములు లేకే.. పక్షం రోజుల కింద కురిసిన అకాల వర్షాలకు కొంత మేర వరిపంట దెబ్బతినగా.. ఇప్పుడు చేతికొచ్చిన ధా న్యం నేలపాలవుతుందేమోనని దిగులు చెందుతున్నా రు. జిల్లాలో ధాన్యం నిల్వ ఉంచేందుకు సరిపడా గోదాములు లేక నిజామాబాద్ జిల్లాలోని రైస్ మిల్లర్లతో కొ నుగోలు చేయించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నా రు. ఇందుకు సివిల్ సప్లై మేనేజింగ్ డెరైక్టర్ అనిల్‌కుమార్, నిజామాబాద్ జేసీలతో జిల్లా సంయుక్త కలెక్టర్ బి. లక్ష్మీకాంతం ఆదివారం మాట్లాడినట్లు తెలిసింది. గోదాములు లేకపోవడం, వర్షకాలం దృష్ట్యా రైతులు నష్టాల పాలు కాకుండా పక్క జిల్లా రైస్ మిల్లర్లకు కొనుగోలు బాధ్యత అప్పగించనున్నట్లు అధికారులు పేర్కొంటు న్నారు. జిల్లాలోని గోదాములు ప్రస్తుతం ధాన్యంతో పూ ర్తిగా నిండిపోయినట్లు అధికారుల ద్వారా తెలుస్తోంది. కొనుగోళ్లు, నిల్వలు.. రబీకి సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం 95,463 మెట్రిక్ టన్నుల (ఎంటీ) వరిధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన రూ.125 కోట్లకుపైగా రైతులకు చెల్లించారు. ఐటీడీఏ ద్వారా 13,757 మెట్రిక్ టన్నులు, డీసీఎంఎస్ ద్వారా 1,113 మెట్రిక్ టన్నులు, పీఏసీఎస్‌ల ద్వారా 27,556 మెట్రిక్ టన్నులు, డీఆర్డీఏ ద్వారా 53,037 మెట్రిక్ టన్నులు మొత్తం 95,463 ఎంటీల ధాన్యం కొనుగోలు చేశారు. దీంతో పాటు జిల్లాలోని 24 రైస్ మిల్లర్లు 40వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ధాన్యం కొనుగోలు చేసినందుకు రూ.88 లక్షలు పీఏసీఎస్‌లకు, రూ.20 లక్షలు డీసీఎంఎస్‌కు, రూ.2కోట్లు మహిళా సంఘాలకు కమీషన్ రూపంలో చెల్లించారు. ఈ ధాన్యాన్ని నిర్మల్, భైంసా, సారంగాపూర్, బోథ్, ఇచ్చోడ, మంచిర్యాల, లక్సెట్టిపేట, జన్నారం, నార్నూర్‌లలో ఉన్న గోదాముల్లో నిల్వ ఉంచారు. నిబంధనలు ఇవీ.. క్వింటాల్ గ్రేడ్-ఏ వరిధాన్యానికి కనీస మద్దతు ధర రూ.1,345, కామన్ రకానికి రూ.1,310 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నాణ్యతకు సంబంధించి కూడా నిబంధనలు విధించింది. ధాన్యంలో తేమ 18 శాతానికి మించకూడదని నిబంధన పెట్టారు. వ్యర్థాలు ఒకశాతం, చెత్త, తప్పలు ఒక శాతం, రంగుమారిన, పురుగుతిన్న, మొలకెత్తిన ధాన్యం 4శాతం, పూర్తిగా తయారు కానీ, కుంచించుకుపోయిన ధాన్యం 3శాతం, కల్తీరకం ధాన్యం 6శాతం వరకు గరిష్టంగా కోత విధించాలని నిర్ణయించింది. వీటిలో ఏ ఒక్కటి ఒక్క శాతం పెరిగినా ప్రభుత్వం నిర్ణయించిన ధరలో కోత పడుతుందన్నమాట. జిల్లాలో రబీలో వరిధాన్యం దిగుబడి అధికంగా వచ్చింది. ఎక్కువగా కడెం, జన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేట తదితర 16 మండలాల్లో దిగుబడి వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. కడెం కెనాల్‌తో ఈ ఏరియాల్లో వరిపంట అధికదిగుబడి వచ్చినట్లుగా గుర్తిస్తున్నారు. గోదాముల నిర్మాణానికి స్థల పరిశీలన.. జిల్లాలో వెయ్యి మెట్రిక్ టన్నుల గోదాముల నిర్మాణం చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గోదాముల నిర్మాణం కోసం అవసరమైన స్థలాన్ని పరిశీలించేందుకు మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఇంజినీర్లు, అధికారులు జిల్లాకు రానున్నారు. కుంటాల, దండేపల్లి, మంచిర్యాల తదితర ప్రదేశాల్లో గోదాముల నిర్మాణం చేపట్టేందుకు స్థల పరిశీలన చేయనున్నారు. -
సన్న బియ్యం.. ప్రియం
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సన్న బియ్యం ధర ఆకాశాన్నంటుతోంది. నిన్న మొన్నటి వరకు గోదాముల్లో నిల్వ చేసిన ధాన్యం ఇప్పుడిప్పుడే బయటకొస్తోంది. జీరోపై ఇతర రాష్ట్రాలకు తరలిపోతోంది. గత ఏడాది ఖరీఫ్‌లో జిల్లాలోని 2.50 లక్షల ఎకరాల్లో వరి సాగయింది. ఎకరాకు 25 క్వింటాళ్ల చొప్పున 62.50 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇందులో 50 శాతం గోదాముల్లోనే ఉండిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా వరి ధాన్యం గోదాముల్లోకి చేరడంతో మార్కెట్లో సప్లయ్ తగ్గిపోయి బియ్యం ధర అమాంతం పెరిగిపోయింది. పది రోజుల క్రితం క్వింటా బియ్యం ధర రూ.3వేల నుంచి రూ.3,100 ఉండగా.. నేడు రూ.3,500లకు చేరుకుంది. ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉంది. కేంద్రంలో నరేంద్రమోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బియ్యం ఎగుమతులకు అవకాశం కల్పిస్తామని చెప్పిన తర్వాత నుంచి ధరలు పెరుగుతుండటం గమనార్హం. కర్నూలు సోనాకు జాతీయ, అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. సన్న రకాలతో పోలిస్తే కర్నూలు సోనా ధరలు మాత్రమే పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలోని ఆళ్లగడ్డ, నంద్యాల, శిరువెళ్ల, కోవెలకుంట్ల, బనగానపల్లె, కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, నందికొట్కూరు ప్రాంతాల్లో గోదాములు అధికంగా ఉన్నాయి. గత ఖరీఫ్‌లో 62.50 లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి రాగా.. ఇందులో 30 లక్షల క్వింటాళ్లకు పైగా గోదాముల్లోనే ఉండిపోయింది. కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వం బియ్యం ఎగుమతులకు అవకాశం కల్పిస్తే ధరలు పెరుగుతాయనే దూరదృష్టితో మిల్లర్లు, వ్యాపారులు ధాన్యాన్ని గోదాముల్లో దాచినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మార్కెట్‌కు బియ్యం సరఫరాా తగ్గిపోయి ధర పెరిగేందుకు కారణమైంది. అనుకున్నట్లుగానే బియ్యం ధర పెరుగుతుండటంతో గోదాముల్లోని ధాన్యం నిల్వలు బయటకొస్తున్నాయి. మార్కెటింగ్ శాఖ, వాణిజ్య పన్నుల శాఖ పట్టించుకోకపోవడంతో ధాన్యం, బియ్యం జీరోపై తరలుతోంది. రాష్ట్ర పరిధిలో బియ్యం విక్రయించేందుకు 5 శాతం వ్యాట్, ఒక శాతం మార్కెట్ ఫీజు చెల్లించాల్సి ఉంది. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ వ్యాట్ పోటు అధికం. అందువల్లే మిల్లర్లు, వ్యాపారులు జీరోపై ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. బియ్యం ధరలు పెరిగేందుకు ట్యాక్స్‌లు కూడా కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వ్యాట్‌ను బూచిగా చూపి మిల్లర్లు ధరలు పెంచేస్తున్నారు. బియ్యం, ధాన్యం వ్యాపారంలో 60 శాతం పైగా జీరోపైనే తరలిపోతోంది. నిబంధనల మేరకు మిల్లర్లు ప్రభుత్వానికి లెవీ ఇవ్వాల్సి ఉంది. లెవీ ఇచ్చిన మిల్లర్లకు పౌర సరఫరాల శాఖ బహిరంగ మార్కెట్లో బియ్యం అమ్ముకునేందుకు పర్మిట్లు ఇస్తుంది. బియ్యం రాష్ట్రం పరిధిలో అమ్ముకోవాలన్నా, ఇతర రాష్ట్రాల్లో అమ్ముకోవాలన్నా పౌర సరఫరాల శాఖ జారీ చేసిన పర్మిట్ తప్పనిసరి. అయితే మిల్లర్లు, వ్యాపారులు ఈ పర్మిట్లు లేకుండానే జీరోపై తరలిస్తుండటం వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి పడుతోంది. బియ్యం ధర అమాంతం పెరిగిపోతుండటం సామాన్య, మధ్య తరగతి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. క్వింటా బియ్యం ధర రూ.3,500లకు చేరినా రిటైల్‌గా కిలో బియ్యం రూ.38 నుంచి రూ.40లు పలుకుతోంది. దీంతో రేషన్ దుకాణాల్లో కిలో రూపాయి చొప్పున కొనుగోలు చేసిన బియ్యాన్ని పలువురు లబ్ధిదారులు బహిరంగ మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. సన్నబియ్యం ధర పెరుగుతుండటంతో వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
మళ్లీ వానదెబ్బ..
కందుకూరు, న్యూస్‌లైన్: మండల పరిధిలో సోమవారం మధ్యాహ్నం ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి అపార నష్టం వాటిల్లింది. ఆకులమైలారంలో పిడుగు పాటుకు రైతు మృతి చెందగా, నేదునూరు సమీపంలోని పొలంలో రంగని బాల్‌రాజ్‌కు చెందిన ఓ ఎద్దుపై పిడుగుపడి అక్కడికక్కడే మృతిచెందింది. మహ్మద్‌నగర్‌లో ఈదురుగాలులకు ఇంటి రేకులు లేచిపోయాయి. ఆ సమయంలో ఇంట్లో ఉన్న తల్లోజి బ్రహ్మచారి స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ముచ్చర్లలో వడగళ్లు పడి వరి, కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి. ఈదురుగాలులతో గుమ్మడవెళ్లి, కందుకూరు, మీర్కాన్‌పేట, దెబ్బడగూడ, నేదునూరు, జైత్వారం, కొత్తగూడ, గూడూరు, కొత్తూర్, తదితర గ్రామాల్లో కోతకొచ్చిన వరి పంట నేలవాలగా, మామిడి కాయలు నేలరాలి నష్టం వాటిల్లింది. గుమ్మడవెళ్లి, మహ్మద్‌నగర్ గ్రామాల పరిధిలో విద్యుత్ స్థంభాలు కూలిపోగా, కొన్ని చోట్ల తీగలు తెగిపడి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. షాబాద్‌లో.. షాబాద్: షాబాద్ మండలంలో సోమవారం భారీ వర్షం కురిసింది. మండలంలోని నాగరకుంట. షాబాద్, కుమ్మరిగూడ. హైతాబాద్, మద్దూర్, సోలీపేట్ తదితర గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షానికి ఇళ్లు. పశువుల పాకలు దెబ్బతిన్నాయి. ఇళ్లు దెబ్బతిన్న బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. గండేడ్‌లో.. గండేడ్: కొనుగోలు కేంద్రంలో నిర్వాహకుల దైన్యానికి వరి ధాన్యం తడిసి ముద్దయింది. గండేడ్‌లోని కొనుగోలు కేంద్రంలో వెయ్యి బస్తాల వరి ధాన్యం సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యం కొనుగోలు చేసి తడిసి ముద్దయ్యేలా నిర్లక్ష్యంగా వ్యహరించిన అధికారుల తీరుపై రైతులు మండిపడుతున్నారు. కనీసం తాడ్పాలీన్ (తాడుపత్రీలు) కూడా ధాన్యంపై కప్పే దిక్కులేకుండా పోయింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రమలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంవల్లే రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్ముకునేందుకే మొగ్గుచూపుతున్నారన్నారు. ఇప్పటికైనా కొనుగోలు కేంద్రం ఉన్నతాధికారులు స్పందించి ధాన్యం తడవకుండా జాగ్రత్తలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. -
అపార నష్టం
సాక్షిప్రతినిధి, నల్లగొండ : అకాల వర్షం రైతన్నకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఆయకట్టు, ఆయకట్టేతర అన్న తేడా లేకుండా కొద్ది రోజులుగా మార్కెట్లను వరి ధాన్యం ముంచెత్తుతోంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో వేల క్వింటాళ్ల ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. ఒక్కసారిగా అకాల వర్షం ముంచెత్తడంతో ఎక్కడికక్కడ ధాన్యం తడిసి ముద్దయ్యింది. ఇంకా కోతలు పూర్తి కాని ప్రాంతాల్లో వరి పొలాలపైనే పంట నష్టం జరిగింది. అసలే రబీ దిగుబడికి గిట్టుబాటు ధర లభించడం గగ నంగా మారింది. చివరకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరను కూడా కొందరు మిల్లర్లు చెల్లించడం లేదు. ఈ స్థితిలో ధాన్యం తడిసి పోవడం రైతులకు అశనిపాతంలా మారింది. జిల్లావ్యాప్తంగా శుక్రవారం 659.6 మిల్లీ మీటర్ల (జిల్లా సగటు11.2మి.మీ) వర్షపాతం నమోదయింది. అధికారిక సమాచారం ఇంకా ఏమీ ప్రకటించలేదు కానీ, అకాల వర్షానికి జిల్లాలో మెజారిటీ మండలాల్లో వరి ధాన్యం బాగా తడిసిపోయింది. ఆలేరు వరిచేలు వర్షపు నీటిలో మునిగిపోయాయి. ఆలేరు, ఆత్మకూర్ (ఎం), తుర్కపల్లి, రాజాపేట, యాదగిరిగుట్ట ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం వర్షానికి తడిసింది. ఆలేరు మార్కెట్ యార్డుతో పాటు మందనపల్లి, గొలనుకొండ ఆత్మకూర్ ఎంచాడ, యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లి, రాజపేట మండలం చల్లూరు ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. భువనగిరి మార్కెట్ యార్డులు, ఐకేపీ కేంద్రాలు, భువనగిరి గంజ్, నూతన మార్కెట్, వలిగొండ మార్కెట్లలో ఉన్న ధాన్యం తడిసింది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం తరలించకపోవడంతో నిలిచిన ధాన్యం బస్తాలు తడిశాయి. భువనగిరి మండలం బొల్లేపల్లి, పచ్చబోడుతండా, రామచంద్రాపురం, పోచంపల్లి మండలం పోచంపల్లి, రేవణపల్లి, శివారెడ్డిగూడెం, బీబీనగర్, వలిగొండ మండలాల్లోని ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. భువనగిరి రెవెన్యూ డివిజన్లో రైతుల వద్ద కొనుగోలు చేసిన 33 వేల క్వింటాళ్ల ధాన్యంలో 10వేల బస్తాలు తడిసిపోయింది. కొనుగోలు చేయని 20వేల క్వింటాళ్ల ధాన్యం తడిసిందని అధికారుల అంచనా. నాగార్జున సాగర్ త్రిపురారం, నిడమనూరు, హాలియా మండల్లాలోని కోనుగోలు కేంద్రాల్లో 35 వేలబస్తాల ధాన్యం తడిసింది. గ్రామాల్లో హమాలీల కొరత కారణంగా సకాలంలో కాంటా వేయకపోవడం, ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం పోసిన రైతులకు సరిపడా పట్టాలు ఇవ్వకపోవడం వల్ల ధాన్యం తడిసింది.. కోదాడ కోదాడ మండలం గణపవరం, యర్రవరం ఐకేపీ కేంద్రాల వద్ద కాంటాలు వేసిన సుమారు నాలుగు వేల బస్తాల ధాన్యం తడిసింది. ధాన్యం తరలించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తీవ్ర నష్టం జరిగింది. మునగాల, చిలుకూరు, నడిగూడెం మండలాల్లో కల్లాలు పూర్తి కావడంతో ఇక్కడ అంతగా నష్టం జరగలేదు. ఈదురు గాలులు లేకపోవడంతో మామిడి రైతులకు నష్టం జరగలేదు. కోదాడ పట్టణంలో కొన్ని లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. మిర్యాలగూడ ఐకేపీ కేంద్రాలతో పాటు అవంతీపురం వ్యవసాయ మార్కెట్లో ధాన్యం తడిసింది. వ్యవసాయ మార్కెట్లోని ధాన్యం తడవడంతో మిల్లర్లు 70 కిలోల బస్తాకు అదనంగా మరో కిలో ధాన్యం కాంటా వేసుకున్నారు. తడకమళ్ల, దొండవారిగూడెంలో 3500 బస్తాల ధాన్యం పూర్తిగా తడిసింది. ఐకేపీ కేంద్రాలలో వర్షం నీరు నిలిచింది. దామరచర్ల మండలం దామరచర్ల, కొండ్రపోల్ ఐకేపీ కేంద్రాలలో 500 బస్తాల ధాన్యం తడిసింది. వేములపల్లి, సల్కనూరు, చిరుమర్తి, పోరెడ్డిగూడెం ఐకేపీ కేంద్రాలలో 35వేల బస్తాల ధాన్యం రాశులు తడిసిపోయాయి. సూర్యాపేట పట్టణంలో ప్రధాన రోడ్లు జలమయమయ్యాయి. మార్కెట్లో బస్తాలు తడిసి ముద్దయ్యాయి. రాయినిగూడెం, టేకుమట్ల, యండ్లపల్లి, రామారం గ్రామాల్లోని ఐకేపీ కేంద్రాల్లో వేల క్వింటాళ్ల ధాన్యం తడిసి ముద్దయింది. ఏపూర్ ఐకేపీ కేంద్రంలో ప్రహరీ గోడ కూలి ముగ్గురు రైతులకు తీవ్ర గాయాలయ్యాయి. పెన్‌పహాడ్ మండలంలో కోతలు కోయని రైతులు పరిస్థితి దయనీయంగా మారింది. చివ్వెంల మండలంలో10వేల క్వింటాళ్ల ధాన్యం రాశులు నీట మునగాయి. వెయ్యి ఎకరాల్లో వరి పొలాలు నేలవారాయి. హుజూర్నగర్ హుజూర్‌నగ ర్లోని శ్రీనగర్ కాలనీలో ఇంటి పోర్ట్‌కో కూలిపడి అక్కినేని మమత (39) మహిళ మృతి చెందింది. వేలాది ధాన్యం బస్తాలు తడిసి పోయాయి. మేళ్లచెరువు మండలం ఎర్రకుంటతండాలో పిడుగుపాటుతో ఇంటిలోని 2 క్వింటాళ్ల పత్తి, ఇల్లు దగ్ధమయ్యాయి. అంజలీపురంలో 1000 బస్తాలు, మఠంపల్లి మండలం భీల్యానాయక్‌తండా, అల్లీపురం ఐకేపీ కేంద్రాలలో 2000 బస్తాలు, నేరేడుచర్ల మండలం పెంచికల్‌దిన్నెలో 200 బస్తాలు, మేళ్లచెరువు మండలంలోని కందిబండ, కప్పలకుంటతండా, హేమ్లాతండా, మేళ్లచెరువులలోని ఐకేపీ కేంద్రాలలో 10వేల బస్తాలు వర్షానికి తడిసిపోయాయి. ఇంకా.. తుంగతుర్తి నియోజకవర్గంలో వరిచేలు దెబ్బతిన్నాయి. ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లిన ధాన్యం తడిసిపోయింది. నకిరేకల్‌లోని వ్యవసాయ మార్కెట్లో ఉన్న ఐకేపీ కేంద్రంలో ధాన్యం రాశులు కొద్ది మేర తడిసిపోయాయి. కేతేపల్లి మండలం కొత్తపేట, కాసనగోడు , కట్టంగూర్ మండలం కురుమర్తి నార్కట్‌పల్లి మండలం అక్కనపల్లి ఐకేపీ కేంద్రాలలో ధాన్యం తడిసింది. దేవరకొండ పలుచోట్ల పంట నష్టం వాటిల్లింది. దీంతోపాటు మరికొన్ని మండల కేంద్రాలలో విద్యుత్ వైర్లు తెగిపడడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడడంతో నియోజకవర్గంలో సుమారు 200 ఎకరాల వరి పంట నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. దేవరకొండ మండలం నసర్లబావి తండాలో విద్యుత్ తీగ తెగిపడడంతో పశువు మృతి చెందింది.