సన్న బియ్యం.. ప్రియం
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సన్న బియ్యం ధర ఆకాశాన్నంటుతోంది. నిన్న మొన్నటి వరకు గోదాముల్లో నిల్వ చేసిన ధాన్యం ఇప్పుడిప్పుడే బయటకొస్తోంది. జీరోపై ఇతర రాష్ట్రాలకు తరలిపోతోంది. గత ఏడాది ఖరీఫ్‌లో జిల్లాలోని 2.50 లక్షల ఎకరాల్లో వరి సాగయింది. ఎకరాకు 25 క్వింటాళ్ల చొప్పున 62.50 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇందులో 50 శాతం గోదాముల్లోనే ఉండిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా వరి ధాన్యం గోదాముల్లోకి చేరడంతో మార్కెట్లో సప్లయ్ తగ్గిపోయి బియ్యం ధర అమాంతం పెరిగిపోయింది.
పది రోజుల క్రితం క్వింటా బియ్యం ధర రూ.3వేల నుంచి రూ.3,100 ఉండగా.. నేడు రూ.3,500లకు చేరుకుంది. ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉంది. కేంద్రంలో నరేంద్రమోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బియ్యం ఎగుమతులకు అవకాశం కల్పిస్తామని చెప్పిన తర్వాత నుంచి ధరలు పెరుగుతుండటం గమనార్హం. కర్నూలు సోనాకు జాతీయ, అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది.
సన్న రకాలతో పోలిస్తే కర్నూలు సోనా ధరలు మాత్రమే పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలోని ఆళ్లగడ్డ, నంద్యాల, శిరువెళ్ల, కోవెలకుంట్ల, బనగానపల్లె, కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, నందికొట్కూరు ప్రాంతాల్లో గోదాములు అధికంగా ఉన్నాయి. గత ఖరీఫ్‌లో 62.50 లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి రాగా.. ఇందులో 30 లక్షల క్వింటాళ్లకు పైగా గోదాముల్లోనే ఉండిపోయింది. కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వం బియ్యం ఎగుమతులకు అవకాశం కల్పిస్తే ధరలు పెరుగుతాయనే దూరదృష్టితో మిల్లర్లు, వ్యాపారులు ధాన్యాన్ని గోదాముల్లో దాచినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో మార్కెట్‌కు బియ్యం సరఫరాా తగ్గిపోయి ధర పెరిగేందుకు కారణమైంది. అనుకున్నట్లుగానే బియ్యం ధర పెరుగుతుండటంతో గోదాముల్లోని ధాన్యం నిల్వలు బయటకొస్తున్నాయి. మార్కెటింగ్ శాఖ, వాణిజ్య పన్నుల శాఖ పట్టించుకోకపోవడంతో ధాన్యం, బియ్యం జీరోపై తరలుతోంది. రాష్ట్ర పరిధిలో బియ్యం విక్రయించేందుకు 5 శాతం వ్యాట్, ఒక శాతం మార్కెట్ ఫీజు చెల్లించాల్సి ఉంది. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ వ్యాట్ పోటు అధికం. అందువల్లే మిల్లర్లు, వ్యాపారులు జీరోపై ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
బియ్యం ధరలు పెరిగేందుకు ట్యాక్స్‌లు కూడా కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వ్యాట్‌ను బూచిగా చూపి మిల్లర్లు ధరలు పెంచేస్తున్నారు. బియ్యం, ధాన్యం వ్యాపారంలో 60 శాతం పైగా జీరోపైనే తరలిపోతోంది. నిబంధనల మేరకు మిల్లర్లు ప్రభుత్వానికి లెవీ ఇవ్వాల్సి ఉంది. లెవీ ఇచ్చిన మిల్లర్లకు పౌర సరఫరాల శాఖ బహిరంగ మార్కెట్‌లో బియ్యం అమ్ముకునేందుకు పర్మిట్‌లు ఇస్తుంది. బియ్యం రాష్ట్రం పరిధిలో అమ్ముకోవాలన్నా, ఇతర రాష్ట్రాల్లో అమ్ముకోవాలన్నా పౌర సరఫరాల శాఖ జారీ చేసిన పర్మిట్ తప్పనిసరి.
అయితే మిల్లర్లు, వ్యాపారులు ఈ పర్మిట్లు లేకుండానే జీరోపై తరలిస్తుండటం వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి పడుతోంది. బియ్యం ధర అమాంతం పెరిగిపోతుండటం సామాన్య, మధ్య తరగతి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. క్వింటా బియ్యం ధర రూ.3,500లకు చేరినా రిటైల్‌గా కిలో బియ్యం రూ.38 నుంచి రూ.40లు పలుకుతోంది. దీంతో రేషన్ దుకాణాల్లో కిలో రూపాయి చొప్పున కొనుగోలు చేసిన బియ్యాన్ని పలువురు లబ్ధిదారులు బహిరంగ మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. సన్నబియ్యం ధర పెరుగుతుండటంతో వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.