Kurnool Sona
-
కర్నూలు సోనాకు గడ్డుకాలం
- సాగునీరు లేక కాలువలన్నీ వెలవెల - కర్నూలు సోనా సాగుకు దాటిన అదను -ఇప్పుడు నీళ్లొచ్చినా పంట వేయలేని దుస్థితి -స్వల్పకాలిక రకాలు ఎంచుకోవాలని శాస్త్రవేత్తల సూచన కర్నూలు (అగ్రికల్చర్): జిల్లాలో ప్రధాన ఆహార పంట అయిన వరి సాగు ఈసారి ప్రశ్నార్థకంగా మారింది. మరీ ముఖ్యంగా ‘కర్నూలు సోనా’కు గడ్డుకాలం వచ్చింది. బీపీటీ 5204 రకం కర్నూలు సోనా బ్రాండ్ నేమ్‌తో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందింది. ఈ సారి ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ పంట సాగుకు అవకాశం లేకుండా పోతోంది. ఈ రకాన్ని నేడు వివిధ జిల్లాల్లోనూ పండిస్తున్నప్పటికీ కర్నూలు జిల్లాలో పండిన పంటకే జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో ఆదరణ ఉంది. అటువంటి పంట ప్రస్తుతం ప్రమాదంలో పడడం పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ సీజన్లో మూడు నెలలు గడిచిపోయాయి. ఇంతవరకు వర్షాలు సమృద్ధిగా కురవలేదు. ప్రాజెక్టులన్నీ వెలవెలబోతున్నాయి. కాలువలకు చుక్క నీరు రావడం లేదు. గత నెలలో జిల్లా వ్యాప్తంగా వర్షాలు ఆశాజనకంగానే కురిసినా ఎగువనున్న కర్ణాటకలో మాత్రం పడలేదు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో మొదలు కాలేదు. జిల్లాలోని కేసీ కెనాల్, ఎస్ఆర్బీసీ, తెలుగుగంగ తదితర కాలువల మనుగడ శ్రీశైలం నీటి మట్టంపైనే ఆధారపడి ఉంది. డ్యాంలో నీళ్లు అడుగంటడంతో ఈ కాలువల కింద వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఎల్ఎల్సీకి నీళ్లు విడుదలయ్యే అవకాశమున్నా వరి సాగుకు సరిపోవని, ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 11,246 హెక్టార్లకే పరిమితమైన వరి గతంలో జిల్లా వ్యాప్తంగా ఏటా లక్ష హెక్టార్లకు పైగా వరి సాగయ్యేది. రానురాను సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. ప్రాజెక్టులకు సకాలంలో నీళ్లు రాకపోవడమే ఇందుకు కారణం. ఈ ఏడాది ఖరీఫ్‌లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 76,474 హెక్టార్లు ఉండగా.. ఇప్పటి వరకు 11,246 హెక్టార్లకే పరిమితమైంది. ఇది కూడా బావులు, బోర్ల కింద సాగైంది. జిల్లాలో ప్రధానంగా బీపీటీ 5204 రకం( కర్నూలు సోనా) సాగు చేస్తారు. ఆగస్టు చివరిలోగా నాట్లు పడితేనే ఈ రకం దిగుబడి బాగా వస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు రాకపోవడం, కాలువలు ఖాళీగా ఉండటంతో కర్నూలు సోనానే కాదు..ఇతర రకాల సాగు కూడా సాధ్యపడలేదు. ఒకవేళ ఇప్పుడు నీళ్లొచ్చినా అదను దాటినందున కర్నూలు సోనా సాగు చేయొద్దని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకవేళ సాగు చేస్తే అగ్గి తెగులు తదితర చీడపీడల బెడద ఎక్కువగా ఉండే ప్రమాదముంది. దీనివల్ల పెట్టుబడి వ్యయం పెరుగుతుంది. ఇదే తరుణంలో దిగుబడులు కూడా తగ్గే అవకాశముంది. కాలువలకు నీళ్లు వస్తే ఈ నెల 15 వరకు వరిలో స్వల్ప కాలిక రకాలు సాగు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. అయితే..కాలువలకు నీళ్లొచ్చే అవకాశాలు అతి తక్కువగానే ఉన్నాయి. వరి సాగు తగ్గితే «బియ్యం ధరలు భారీగా పెరిగే ప్రమాదముంది. ఇప్పటికే క్వింటాల్ రూ.4,500లకు పైనే పలుకుతున్నాయి. ప్రత్యామ్నాయ పంటలే శరణ్యం కర్నూలు సోనా సాగుకు అదను దాటడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఒకవేళ వరి వేసుకోవాలనుకుంటే స్వల్పకాలిక రకాలైన ఎన్‌డీఎల్‌ఆర్–7, 8 రకాలు, ఆర్ఎన్ఆర్–15048, ప్రద్యుమ్న రకాలు ఎంచుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రద్యుమ్న, ఆర్ఎన్ఆర్–15048 రకాలను గొర్రుతో కూడా విత్తకోవచ్చు. అన్నింటికీ మించి మొక్కజొన్న, పొద్దు తిరుగుడు, వాము, కూరగాయలు వంటి ఆరుతడి పంటలు వేసుకుంటే మేలని వ్యవసాయ శాస్త్రవేత్తలు నరసింహుడు, సుజాతమ్మ తెలిపారు. -
సన్న బియ్యం.. ప్రియం
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సన్న బియ్యం ధర ఆకాశాన్నంటుతోంది. నిన్న మొన్నటి వరకు గోదాముల్లో నిల్వ చేసిన ధాన్యం ఇప్పుడిప్పుడే బయటకొస్తోంది. జీరోపై ఇతర రాష్ట్రాలకు తరలిపోతోంది. గత ఏడాది ఖరీఫ్‌లో జిల్లాలోని 2.50 లక్షల ఎకరాల్లో వరి సాగయింది. ఎకరాకు 25 క్వింటాళ్ల చొప్పున 62.50 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇందులో 50 శాతం గోదాముల్లోనే ఉండిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా వరి ధాన్యం గోదాముల్లోకి చేరడంతో మార్కెట్లో సప్లయ్ తగ్గిపోయి బియ్యం ధర అమాంతం పెరిగిపోయింది. పది రోజుల క్రితం క్వింటా బియ్యం ధర రూ.3వేల నుంచి రూ.3,100 ఉండగా.. నేడు రూ.3,500లకు చేరుకుంది. ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉంది. కేంద్రంలో నరేంద్రమోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బియ్యం ఎగుమతులకు అవకాశం కల్పిస్తామని చెప్పిన తర్వాత నుంచి ధరలు పెరుగుతుండటం గమనార్హం. కర్నూలు సోనాకు జాతీయ, అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. సన్న రకాలతో పోలిస్తే కర్నూలు సోనా ధరలు మాత్రమే పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలోని ఆళ్లగడ్డ, నంద్యాల, శిరువెళ్ల, కోవెలకుంట్ల, బనగానపల్లె, కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, నందికొట్కూరు ప్రాంతాల్లో గోదాములు అధికంగా ఉన్నాయి. గత ఖరీఫ్‌లో 62.50 లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి రాగా.. ఇందులో 30 లక్షల క్వింటాళ్లకు పైగా గోదాముల్లోనే ఉండిపోయింది. కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వం బియ్యం ఎగుమతులకు అవకాశం కల్పిస్తే ధరలు పెరుగుతాయనే దూరదృష్టితో మిల్లర్లు, వ్యాపారులు ధాన్యాన్ని గోదాముల్లో దాచినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మార్కెట్‌కు బియ్యం సరఫరాా తగ్గిపోయి ధర పెరిగేందుకు కారణమైంది. అనుకున్నట్లుగానే బియ్యం ధర పెరుగుతుండటంతో గోదాముల్లోని ధాన్యం నిల్వలు బయటకొస్తున్నాయి. మార్కెటింగ్ శాఖ, వాణిజ్య పన్నుల శాఖ పట్టించుకోకపోవడంతో ధాన్యం, బియ్యం జీరోపై తరలుతోంది. రాష్ట్ర పరిధిలో బియ్యం విక్రయించేందుకు 5 శాతం వ్యాట్, ఒక శాతం మార్కెట్ ఫీజు చెల్లించాల్సి ఉంది. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ వ్యాట్ పోటు అధికం. అందువల్లే మిల్లర్లు, వ్యాపారులు జీరోపై ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. బియ్యం ధరలు పెరిగేందుకు ట్యాక్స్‌లు కూడా కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వ్యాట్‌ను బూచిగా చూపి మిల్లర్లు ధరలు పెంచేస్తున్నారు. బియ్యం, ధాన్యం వ్యాపారంలో 60 శాతం పైగా జీరోపైనే తరలిపోతోంది. నిబంధనల మేరకు మిల్లర్లు ప్రభుత్వానికి లెవీ ఇవ్వాల్సి ఉంది. లెవీ ఇచ్చిన మిల్లర్లకు పౌర సరఫరాల శాఖ బహిరంగ మార్కెట్లో బియ్యం అమ్ముకునేందుకు పర్మిట్లు ఇస్తుంది. బియ్యం రాష్ట్రం పరిధిలో అమ్ముకోవాలన్నా, ఇతర రాష్ట్రాల్లో అమ్ముకోవాలన్నా పౌర సరఫరాల శాఖ జారీ చేసిన పర్మిట్ తప్పనిసరి. అయితే మిల్లర్లు, వ్యాపారులు ఈ పర్మిట్లు లేకుండానే జీరోపై తరలిస్తుండటం వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి పడుతోంది. బియ్యం ధర అమాంతం పెరిగిపోతుండటం సామాన్య, మధ్య తరగతి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. క్వింటా బియ్యం ధర రూ.3,500లకు చేరినా రిటైల్‌గా కిలో బియ్యం రూ.38 నుంచి రూ.40లు పలుకుతోంది. దీంతో రేషన్ దుకాణాల్లో కిలో రూపాయి చొప్పున కొనుగోలు చేసిన బియ్యాన్ని పలువురు లబ్ధిదారులు బహిరంగ మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. సన్నబియ్యం ధర పెరుగుతుండటంతో వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.