కర్నూలు సోనాకు గడ్డుకాలం
కర్నూలు సోనాకు గడ్డుకాలం
Published Mon, Sep 4 2017 11:09 PM | Last Updated on Sun, Sep 17 2017 6:23 PM
- సాగునీరు లేక కాలువలన్నీ వెలవెల
- కర్నూలు సోనా సాగుకు దాటిన అదను
-ఇప్పుడు నీళ్లొచ్చినా పంట వేయలేని దుస్థితి
-స్వల్పకాలిక రకాలు ఎంచుకోవాలని శాస్త్రవేత్తల సూచన
కర్నూలు (అగ్రికల్చర్): జిల్లాలో ప్రధాన ఆహార పంట అయిన వరి సాగు ఈసారి ప్రశ్నార్థకంగా మారింది. మరీ ముఖ్యంగా ‘కర్నూలు సోనా’కు గడ్డుకాలం వచ్చింది. బీపీటీ 5204 రకం కర్నూలు సోనా బ్రాండ్ నేమ్‌తో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందింది. ఈ సారి ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ పంట సాగుకు అవకాశం లేకుండా పోతోంది. ఈ రకాన్ని నేడు వివిధ జిల్లాల్లోనూ పండిస్తున్నప్పటికీ కర్నూలు జిల్లాలో పండిన పంటకే జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో ఆదరణ ఉంది. అటువంటి పంట ప్రస్తుతం ప్రమాదంలో పడడం పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ సీజన్‌లో మూడు నెలలు గడిచిపోయాయి. ఇంతవరకు వర్షాలు సమృద్ధిగా కురవలేదు. ప్రాజెక్టులన్నీ వెలవెలబోతున్నాయి.
కాలువలకు చుక్క నీరు రావడం లేదు. గత నెలలో జిల్లా వ్యాప్తంగా వర్షాలు ఆశాజనకంగానే కురిసినా ఎగువనున్న కర్ణాటకలో మాత్రం పడలేదు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో మొదలు కాలేదు. జిల్లాలోని కేసీ కెనాల్, ఎస్‌ఆర్‌బీసీ, తెలుగుగంగ తదితర కాలువల మనుగడ శ్రీశైలం నీటి మట్టంపైనే ఆధారపడి ఉంది. డ్యాంలో నీళ్లు అడుగంటడంతో ఈ కాలువల కింద వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఎల్‌ఎల్‌సీకి నీళ్లు విడుదలయ్యే అవకాశమున్నా వరి సాగుకు సరిపోవని, ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
11,246 హెక్టార్లకే పరిమితమైన వరి
గతంలో జిల్లా వ్యాప్తంగా ఏటా లక్ష హెక్టార్లకు పైగా వరి సాగయ్యేది. రానురాను సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. ప్రాజెక్టులకు సకాలంలో నీళ్లు రాకపోవడమే ఇందుకు కారణం. ఈ ఏడాది ఖరీఫ్‌లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 76,474 హెక్టార్లు ఉండగా.. ఇప్పటి వరకు 11,246 హెక్టార్లకే పరిమితమైంది. ఇది కూడా బావులు, బోర్ల కింద సాగైంది. జిల్లాలో ప్రధానంగా బీపీటీ 5204 రకం( కర్నూలు సోనా) సాగు చేస్తారు. ఆగస్టు చివరిలోగా నాట్లు పడితేనే ఈ రకం దిగుబడి బాగా వస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు రాకపోవడం, కాలువలు ఖాళీగా ఉండటంతో కర్నూలు సోనానే కాదు..ఇతర రకాల సాగు కూడా సాధ్యపడలేదు. ఒకవేళ ఇప్పుడు నీళ్లొచ్చినా అదను దాటినందున కర్నూలు సోనా సాగు చేయొద్దని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఒకవేళ సాగు చేస్తే అగ్గి తెగులు తదితర చీడపీడల బెడద ఎక్కువగా ఉండే ప్రమాదముంది. దీనివల్ల పెట్టుబడి వ్యయం పెరుగుతుంది. ఇదే తరుణంలో దిగుబడులు కూడా తగ్గే అవకాశముంది. కాలువలకు నీళ్లు వస్తే ఈ నెల 15 వరకు వరిలో స్వల్ప కాలిక రకాలు సాగు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. అయితే..కాలువలకు నీళ్లొచ్చే అవకాశాలు అతి తక్కువగానే ఉన్నాయి. వరి సాగు తగ్గితే «బియ్యం ధరలు భారీగా పెరిగే ప్రమాదముంది. ఇప్పటికే క్వింటాల్ రూ.4,500లకు పైనే పలుకుతున్నాయి.
ప్రత్యామ్నాయ పంటలే శరణ్యం
కర్నూలు సోనా సాగుకు అదను దాటడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఒకవేళ వరి వేసుకోవాలనుకుంటే స్వల్పకాలిక రకాలైన ఎన్‌డీఎల్‌ఆర్–7, 8 రకాలు, ఆర్‌ఎన్‌ఆర్–15048, ప్రద్యుమ్న రకాలు ఎంచుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రద్యుమ్న, ఆర్‌ఎన్‌ఆర్–15048 రకాలను గొర్రుతో కూడా విత్తకోవచ్చు. అన్నింటికీ మించి మొక్కజొన్న, పొద్దు తిరుగుడు, వాము, కూరగాయలు వంటి ఆరుతడి పంటలు వేసుకుంటే మేలని వ్యవసాయ శాస్త్రవేత్తలు నరసింహుడు, సుజాతమ్మ తెలిపారు.
Advertisement
Advertisement