ఆశలు..ఆవిరే!
♦ కరిగిపోతున్న కార్తెలు ఆశాజనకంగా లేని వర్షాలు
♦ నై బారిన ప్రాజెక్టులు చెరువులు, కుంటల పరిస్థితీ అంతే
♦ కొద్దిపాటి వర్షాలతో ఆరుతడి పంటలే సాగు ఆందోళనలో రైతన్న
ఆశలు ఆవిరయ్యేలా ఉన్నాయి... ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు మూడు నెలల ముందే వెల్లడించారు. వారు చెప్పినట్టు రైతులు వర్షాలపై, పంటలపై భారీ ఆశలే పెట్టుకున్నారు. వర్షాలు మాత్రం ఊరించి ఉసూరుమనిపిస్తున్నాయి. వచ్చినట్టే వచ్చి ముఖం చాటేస్తున్నాయి.
వరుసగా రెండేళ్లు కరువుతో అల్లాడిన రైతాంగం ఈసారైనా గట్టెక్కుతామని ఆశించింది. ఇప్పటికే 80శాతం రైతులు నారుమళ్లు పోసి, దుక్కులు దున్ని నాట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కార్తెలన్నీ కరిగిపోతున్నా వానల జాడ లేకుండా పోయింది. సాధారణ వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. నీరు లేక ప్రాజెక్టులు, చెరువులు వెలవెలబోతున్నాయి. ఈసారి పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. ఇంకా సమయం ఉన్నందున అటు అధికారులు, ఇటు రైతులు వర్షాలపై భారీ ఆశలే పెట్టుకున్నారు.
మెదక్/గజ్వేల్ . జిల్లాలో సింగూర్‌తోపాటు మెదక్-నిజామాబాద్ జిల్లాల సరిహద్దులోని పోచారం ప్రాజెక్ట్, పాపన్నపేట మండలం ఘనపురం ప్రాజెక్ట్, మెదక్ మండలం రాయిన్‌పల్లి ప్రాజెక్ట్‌తోపాటు మెదక్ డివిజన్‌లోనే అతిపెద్దవైన కోంటూరు చెరువు, చిన్నశంకరంపేట మండలం అంబాజిపేట పెద్దచెరువుతోపాటు వందలాది చెరువు, కుంటలు ఉన్నాయి. అలాగే 50 వేలకు పైగా బోరుబావులు ఉన్నాయి. వీటి ఆధారంగా జిల్లాలో 5.07 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూములు సాగవుతాయి.
ఇందులో సుమారు లక్ష హెక్టార్ల వరకు మెట్ట భూములున్నాయి. వీటిలో ఆరుతడి పంటలైన మొక్కజొన్న, జొన్న, పెసర్లు, బెబ్బర్లు, కందులు తదితర పంటలు వేశారు. మిగతా నాలుగు లక్షల పైచిలుకు హెక్టార్లలో ప్రాజెక్ట్‌లు, చెరువు, కుంటలు, బోరుబావుల ఆధారంగా వరి సాగువుతుంది. కాగా గత రెండేళ్లుగా వర్షాలు లేక బోరుబావులు మూలనపడ్డాయి. అడపాదడపా కురిసే జల్లులకు నారుమళ్లు పోసిన అన్నదాతలు ఆకాశంవైపు నిత్యం ఆశగా చూస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమై నెలరోజులైంది. ఇప్పటికే మృగశిరకార్తె వెళ్లిపోయి ఆరుద్రకార్తె ప్రారంభమైంది. అడపాదడపా కురిసే వర్షపు నీరు ఏ మూలకూ చాలడం లేదు. దీంతో ప్రాజెక్ట్‌లతోపాటు చెరువు, కుంటల్లోకి ఏ మాత్రం నీరు రాలేదు.
ఆయకట్టు ఇలా...
నిజామాబాద్-మెదక్ జిల్లా సరిహద్దులో గల పోచారం ప్రాజెక్ట్‌లోకి చుక్కనీరు రాలేదు. ఈ ప్రాజెక్ట్ ఆధారంగా అధికారిక లెక్కల ప్రకారం 15వేల హెక్టార్ల ఆయకట్టు ఉంది. పాపన్నపేట మండలం ఘనపురం ఆయకట్టు 30 వేల ఎకరాలుంది. మెదక్ మండలం రాయిన్‌పల్లి ప్రాజెక్ట్ కింద 14,500 ఎకరాల వ్యవసాయ సాగుభూమి ఉంది. ఇదే మండలం కోంటూరు చెరువు కింద రెండు వేల ఆయకట్టు, చిన్నశంకరంపేట అంబాజిపేట పెద్ద చెరువు పరిధిలో 90 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. అయితే ఈ చెరువులన్నీ నీరు లేక వెలవెలబోతున్నాయి. జిల్లాలో అనేక చెరువు, కుంటలది ఇదే దుస్థితి. ఈ నెలలోనైనా భారీ వర్షాలు కురిస్తేనే బోరుబావులు, చెరువు, కుంటల్లోకి నీరుచేరే అవకాశం ఉంది. లేకుంటే రైతన్న రోడ్డున పడితే ప్రజాజీవనం స్తంభించే ప్రమాదం ఉంది.
జలాశయాలు వెలవెల...
ఇప్పటివరకు భారీ వర్షాలు లేకపోవడంతో జలాశయాలన్నీ వెలవెలబోయాయి. వర్షాలు అడపాదడపా కురిసినా వచ్చిన నీరు వచ్చినట్టుగానే ఇంకిపోయింది. వరుసగా రెండేళ్లు కరువు తాండవించిన కారణంగా నోళ్లు తెరుచుకున్న చెరువులు, కుంటలు, ఇతర పెద్ద జలాశయాలన్నీ జలకళ కోసం ఎదురు చూస్తున్నాయి.
జిల్లాలో వర్షపాతం ఇలా...
జిల్లాలో 5 లక్షల హెక్టార్లకుపైగా పంటలు సాగులోకి వస్తాయని వ్యవసాయశాఖ అంచనా. ఇప్పటికే 2.45లక్షల హెక్టార్లు సాగులోకి వచ్చాయి. జూన్‌లో 125.6 మి.మీటర్ల వర్షపాతానికి గాను 136.9 మి.మీ. నమోదైంది. ప్రస్తుత జూలైకి సంబంధించి 218.9 మి.మీ. వర్షపాతానికి గాను ఇప్పటివరకు 4.3 మి.మీ. నమోదైంది. గతేడాది జూన్ నుంచి అక్టోబర్ వరకు 676.1 మి.మీటర్ల వర్షపాతానికిగాను 399.8 మి.మీటర్లు మాత్రమే నమోదు కావడంతో రైతులు తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొన్నారు.
పెరుగుతున్న పప్పుధాన్యాల సాగు
గతంతో పోల్చితే ఈ సారి పప్పుధాన్యాల సాగు క్రమంగా పెరుగుతోంది. కంది 26 వేల హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి గానూ గతేడాది 20వేల హెక్టార్లకే పరిమితం కాగా, ఈ సారి ఇప్పటికే 33 వేల హెక్టార్లకుపైగా కంది సాగులోకి వచ్చింది. సోయాబీన్ 15వేల హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికిగాను ఇప్పటికే 24వేల హెక్టార్లకుపైగా సాగులోకి వచ్చింది. వీటితోపాటు మొక్కజొన్న సాగు ఇప్పటి వరకు 80వేల హెక్టార్లలో సాగైంది. మరోవైపు పత్తి సాగును తగ్గించాలంటూ ప్రభుత్వం విసృత ప్రచారం చేపట్టినా రైతులు పత్తిపై మమకారం తగ్గించుకోలేదు. గతేడాది జూన్ నెలాఖరు నాటికి 71,524 హెక్టార్లు సాగులోకి రాగా ఈసారి ఇప్పటివరకు పత్తి 67 వేల హెక్టార్లకుపైగా సాగు చేశారు. వరి 14,540 హెక్టార్లలో, చెరుకు 7,200 హెక్టార్లు, జొన్న 6,120 హెక్టార్లు, మొక్కజొన్న 80 వేల హెక్టార్లు, పెసర 18,900 హెక్టార్లు, మినుములు 11,300 హెక్టార్లలో సాగవుతున్నాయి.
ఈ సారి ఆశాజనకమే...
జిల్లాలో ఈసారి ఖరీఫ్ ఆశాజనకంగానే ఉంది. జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 4.34 లక్షల హెక్టార్లు. వర్షాలు ఆశాజనకంగా ఉంటే జిల్లా వ్యాప్తంగా 5 లక్షల హెక్టార్ల వరకు పంటలు సాగయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే విత్తనాల ప్రక్రియ వేగంగా సాగుతుంది. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయనే నమ్మకం ఉంది. మేము ఊహించినట్లుగానే పప్పుదినుసుల సాగుపట్ల రైతులు ఆసక్తి ప్రదర్శించారు. మొక్కజొన్న సాగు కూడా పెరుగుతుందని భావిస్తున్నాం. - మాధవిశ్రీలత, జేడీఏ, సంగారెడ్డి