సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గత యాసంగిలో ఉత్పత్తి అయిన బియ్యం సేకరణ విషయంలో కేంద్రం ఏమాత్రం కనికరం చూపడం లేదు. గతంలో సేకరించిన మాదిరే బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం) ఎక్కువగా తీసుకోవాలని పదేపదే కోరుతున్నా..ఒక్క కిలో కూడా ఎక్కువ తీసుకోబోమని తేల్చి చెబుతోంది. 2019–20కి సంబంధించి మిగిలిపోయిన లక్ష మెట్రిక్ టన్నుల కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను తీసుకునేందుకు ఎట్టకేలకు అంగీకరించిన భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ), గత యాసంగికి సంబంధించి 50 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ తీసుకోవాలన్న రాష్ట్ర వినతికి మాత్రం ససేమిరా అంటోంది. అదే జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా బాయిల్డ్ రైస్ నిల్వలు ఎక్కడివక్కడే పేరుకుపోయే అవకాశం ఉంది.
లక్ష టన్నుల సీఎంఆర్‌కు సానుకూలం
2019–20 ఏడాదికి సంబంధించి తాను కొనుగోలు చేసిన 64.17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌర సరఫరాలశాఖ సీఎంఆర్ కింద మిల్లర్లకు అప్పగించింది. ఈ ధాన్యం మిల్లింగ్ అనంతరం 43.59 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంది. అయితే గడువులోగా 42.54 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే అప్పగించగా, సుమారు లక్ష మెట్రిక్ టన్నుల బియ్యం అప్పగింత ఆలస్యమైంది. దీంతో ఈ బియ్యం తీసుకునేందుకు కేంద్రం నిరాకరిస్తోంది. ఈ బియ్యం విలువ దాదాపు రూ.400 కోట్ల వరకు ఉంటుంది. ఈ బియ్యం తీసుకోవాల్సిందిగా గతంలో పలుమార్లు కోరినా కేంద్రం ససేమిరా అంటూ వస్తోంది. అయితే పది రోజుల కిందట మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్‌లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో చర్చించగా, లక్ష టన్నులు తీసుకునేందుకు ఓకే చెప్పారు. నెల రోజుల్లో డెలివరీ ఇవ్వాలని సూచించడంతో రాష్ట్రానికి పెద్ద ఉపశమనం లభించింది.
బాయిల్డ్ రైస్‌పై మాత్రం స్పందన కరువు
రాష్ట్రంలో 2020–21 యాసంగికి సంబంధించిన మొత్తం 62.84 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంలో 50 లక్షలు బాయిల్డ్ రైస్, మరో 12.84 లక్షల రారైస్ (పచ్చిబియ్యం) తీసుకోవాలని రాష్ట్రం కోరుతోంది. అయితే కేవలం 24.57 లక్షల మెట్రిక్ టన్నుల మేర మాత్రమే బాయిల్డ్ రైస్ ఇచ్చి, మిగతాదంతా రారైస్ ఇవ్వాలని కేంద్రం పట్టుబడుతోంది. 24.57 లక్షల టన్నుల్లో ఇప్పటికే 16 లక్షల టన్నుల మేర సేకరిం చగా, మిగతా ప్రక్రియ కొనసాగుతోంది. కేంద్రం అదనంగా బాయిల్డ్ రైస్ సేకరణ చేయలేమని చెబుతుండటంతో నిల్వల ఖాళీ రాష్ట్రానికి పెద్ద తలనొప్పి వ్యవహారంలా మారుతోంది.
80 లక్షలు కోరితే 60 లక్షలకు ఓకే...
సాగు పెరిగిన నేపథ్యంలో ప్రస్తుత వానాకాలంలో రాష్ట్రంలో 1.40 కోట్ల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం ఉత్పత్తి అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో 80 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యాన్ని సేకరించాల్సిందిగా కేంద్రాన్ని రాష్ట్రం కోరుతోంది. అయితే మొదట 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తీసుకుంటామన్న ఎఫ్‌సీఐ.. తర్వాత రాష్ట్ర సంప్రదింపుల నేపథ్యంలో 60 లక్షల మెట్రిక్ టన్నులకు అంగీకరించింది. దీంతో మిగతా 20 లక్షల టన్నుల ధాన్యంపై సందిగ్ధత నెలకొంది.
చదవండి: TS: ఎగుమతులతోనే రైతు ఆదాయం రెట్టింపు
Comments
Please login to add a commentAdd a comment