అపార నష్టం
సాక్షిప్రతినిధి, నల్లగొండ : అకాల వర్షం రైతన్నకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఆయకట్టు, ఆయకట్టేతర అన్న తేడా లేకుండా కొద్ది రోజులుగా మార్కెట్లను వరి ధాన్యం ముంచెత్తుతోంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో వేల క్వింటాళ్ల ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. ఒక్కసారిగా అకాల వర్షం ముంచెత్తడంతో ఎక్కడికక్కడ ధాన్యం తడిసి ముద్దయ్యింది. ఇంకా కోతలు పూర్తి కాని ప్రాంతాల్లో వరి పొలాలపైనే పంట నష్టం జరిగింది. అసలే రబీ దిగుబడికి గిట్టుబాటు ధర లభించడం గగ నంగా మారింది.
చివరకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరను కూడా కొందరు మిల్లర్లు చెల్లించడం లేదు. ఈ స్థితిలో ధాన్యం తడిసి పోవడం రైతులకు అశనిపాతంలా మారింది. జిల్లావ్యాప్తంగా శుక్రవారం 659.6 మిల్లీ మీటర్ల (జిల్లా సగటు11.2మి.మీ) వర్షపాతం నమోదయింది. అధికారిక సమాచారం ఇంకా ఏమీ ప్రకటించలేదు కానీ, అకాల వర్షానికి జిల్లాలో మెజారిటీ మండలాల్లో వరి ధాన్యం బాగా తడిసిపోయింది.
ఆలేరు
వరిచేలు వర్షపు నీటిలో మునిగిపోయాయి. ఆలేరు, ఆత్మకూర్ (ఎం), తుర్కపల్లి, రాజాపేట, యాదగిరిగుట్ట ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం వర్షానికి తడిసింది. ఆలేరు మార్కెట్ యార్డుతో పాటు మందనపల్లి, గొలనుకొండ ఆత్మకూర్ ఎంచాడ, యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లి, రాజపేట మండలం చల్లూరు ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది.
భువనగిరి
మార్కెట్ యార్డులు, ఐకేపీ కేంద్రాలు, భువనగిరి గంజ్, నూతన మార్కెట్, వలిగొండ మార్కెట్లలో ఉన్న ధాన్యం తడిసింది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం తరలించకపోవడంతో నిలిచిన ధాన్యం బస్తాలు తడిశాయి. భువనగిరి మండలం బొల్లేపల్లి, పచ్చబోడుతండా, రామచంద్రాపురం, పోచంపల్లి మండలం పోచంపల్లి, రేవణపల్లి, శివారెడ్డిగూడెం, బీబీనగర్, వలిగొండ మండలాల్లోని ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. భువనగిరి రెవెన్యూ డివిజన్‌లో రైతుల వద్ద కొనుగోలు చేసిన 33 వేల క్వింటాళ్ల ధాన్యంలో 10వేల బస్తాలు తడిసిపోయింది. కొనుగోలు చేయని 20వేల క్వింటాళ్ల ధాన్యం తడిసిందని అధికారుల అంచనా.
నాగార్జున సాగర్
త్రిపురారం, నిడమనూరు, హాలియా మండల్లాలోని కోనుగోలు కేంద్రాల్లో 35 వేలబస్తాల ధాన్యం తడిసింది. గ్రామాల్లో హమాలీల కొరత కారణంగా సకాలంలో కాంటా వేయకపోవడం, ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం పోసిన రైతులకు సరిపడా పట్టాలు ఇవ్వకపోవడం వల్ల ధాన్యం తడిసింది..
కోదాడ
కోదాడ మండలం గణపవరం, యర్రవరం ఐకేపీ కేంద్రాల వద్ద కాంటాలు వేసిన సుమారు నాలుగు వేల బస్తాల ధాన్యం తడిసింది. ధాన్యం తరలించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తీవ్ర నష్టం జరిగింది. మునగాల, చిలుకూరు, నడిగూడెం మండలాల్లో కల్లాలు పూర్తి కావడంతో ఇక్కడ అంతగా నష్టం జరగలేదు. ఈదురు గాలులు లేకపోవడంతో మామిడి రైతులకు నష్టం జరగలేదు. కోదాడ పట్టణంలో కొన్ని లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది.
మిర్యాలగూడ
ఐకేపీ కేంద్రాలతో పాటు అవంతీపురం వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం తడిసింది. వ్యవసాయ మార్కెట్‌లోని ధాన్యం తడవడంతో మిల్లర్లు 70 కిలోల బస్తాకు అదనంగా మరో కిలో ధాన్యం కాంటా వేసుకున్నారు. తడకమళ్ల, దొండవారిగూడెంలో 3500 బస్తాల ధాన్యం పూర్తిగా తడిసింది. ఐకేపీ కేంద్రాలలో వర్షం నీరు నిలిచింది. దామరచర్ల మండలం దామరచర్ల, కొండ్రపోల్ ఐకేపీ కేంద్రాలలో 500 బస్తాల ధాన్యం తడిసింది. వేములపల్లి, సల్కనూరు, చిరుమర్తి, పోరెడ్డిగూడెం ఐకేపీ కేంద్రాలలో 35వేల బస్తాల ధాన్యం రాశులు తడిసిపోయాయి.
సూర్యాపేట
పట్టణంలో ప్రధాన రోడ్లు జలమయమయ్యాయి. మార్కెట్‌లో బస్తాలు తడిసి ముద్దయ్యాయి. రాయినిగూడెం, టేకుమట్ల, యండ్లపల్లి, రామారం గ్రామాల్లోని ఐకేపీ కేంద్రాల్లో వేల క్వింటాళ్ల ధాన్యం తడిసి ముద్దయింది. ఏపూర్ ఐకేపీ కేంద్రంలో ప్రహరీ గోడ కూలి ముగ్గురు రైతులకు తీవ్ర గాయాలయ్యాయి. పెన్‌పహాడ్ మండలంలో కోతలు కోయని రైతులు పరిస్థితి దయనీయంగా మారింది. చివ్వెంల మండలంలో10వేల క్వింటాళ్ల ధాన్యం రాశులు నీట మునగాయి. వెయ్యి ఎకరాల్లో వరి పొలాలు నేలవారాయి.
హుజూర్‌నగర్
హుజూర్‌నగ ర్‌లోని శ్రీనగర్ కాలనీలో ఇంటి పోర్ట్‌కో కూలిపడి అక్కినేని మమత (39) మహిళ మృతి చెందింది. వేలాది ధాన్యం బస్తాలు తడిసి పోయాయి. మేళ్లచెరువు మండలం ఎర్రకుంటతండాలో పిడుగుపాటుతో ఇంటిలోని 2 క్వింటాళ్ల పత్తి, ఇల్లు దగ్ధమయ్యాయి. అంజలీపురంలో 1000 బస్తాలు, మఠంపల్లి మండలం భీల్యానాయక్‌తండా, అల్లీపురం ఐకేపీ కేంద్రాలలో 2000 బస్తాలు, నేరేడుచర్ల మండలం పెంచికల్‌దిన్నెలో 200 బస్తాలు, మేళ్లచెరువు మండలంలోని కందిబండ, కప్పలకుంటతండా, హేమ్లాతండా, మేళ్లచెరువులలోని ఐకేపీ కేంద్రాలలో 10వేల బస్తాలు వర్షానికి తడిసిపోయాయి. ఇంకా.. తుంగతుర్తి నియోజకవర్గంలో వరిచేలు దెబ్బతిన్నాయి.
ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లిన ధాన్యం తడిసిపోయింది. నకిరేకల్‌లోని వ్యవసాయ మార్కెట్‌లో ఉన్న ఐకేపీ కేంద్రంలో ధాన్యం రాశులు కొద్ది మేర తడిసిపోయాయి. కేతేపల్లి మండలం కొత్తపేట, కాసనగోడు , కట్టంగూర్ మండలం కురుమర్తి నార్కట్‌పల్లి మండలం అక్కనపల్లి ఐకేపీ కేంద్రాలలో ధాన్యం తడిసింది. దేవరకొండ పలుచోట్ల పంట నష్టం వాటిల్లింది. దీంతోపాటు మరికొన్ని మండల కేంద్రాలలో విద్యుత్ వైర్లు తెగిపడడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడడంతో నియోజకవర్గంలో సుమారు 200 ఎకరాల వరి పంట నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. దేవరకొండ మండలం నసర్లబావి తండాలో విద్యుత్ తీగ తెగిపడడంతో పశువు మృతి చెందింది.