
సాక్షి, అమరావతి: బెట్ట పరిస్థితులున్నాయి.. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ఏదంటూ నిన్నటి వరకు ఓ రకమైన ఏడుపు.. నాలుగు వర్షాలు కురవగానే వానలు కురుస్తున్నా విత్తనాలేవంటూ ఇప్పుడు కొత్తగా మరో ఏడుపు. ఇది ఈనాడుకు మాత్రమే తెలిసిన భిన్న రాగాలు. ఇందులో విశేషమేమిటంటే.. రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల క్రితమే ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను రూపొందించి, అమల్లో పెట్టిన విషయం ఈనాడు గ్రహించలేకపోవడం. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సీజన్‌లో సాగు ముందుకు సాగక ఇబ్బంది పడుతున్న రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుంటే రామోజీకి మాత్రం ఇవేమీ కనిపించడంలేదు.
సాగు వేళ కష్టాల్లో ఉన్న రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తూ అండగా నిలవాల్సింది పోయి వారిని రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తూ వక్రబుద్ధిని ప్రదర్శిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏనాడూ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను సక్రమంగా అమలు పరిచింది లేదు. రైతులకు సరిగా విత్తనాలిచ్చిందీ లేదు. పైగా, రూ.384 కోట్లు విత్తన బకాయిలు పెట్టింది. ఈ బకాయిలను కూడా ప్రస్తుత ప్రభుత్వమే చెల్లించింది. దీనిపై ఏనాడూ నోరు మెదపని రామోజీ.. ఇప్పుడు మాత్రంరైతులకు అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉంచి, అన్నదాతకు అన్ని విధాలుగా సహకరిస్తున్నా, బురద జల్లుతున్నారు.
ప్రతి 15 రోజులకూ సమీక్ష
రాష్ట్రంలో ఖరీఫ్ సాగు లక్ష్యానికి అనుగుణంగా సీజన్‌కు ముందుగానే రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్బీకేల్లో) 5.73 లక్షల క్వింటాళ్ల విత్తనాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. 7.32 లక్షల మంది రైతులకు 5.14 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేసింది. అయితే, జూన్‌లో వర్షాలు సరిగా కురవలేదు. వెంటనే ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు శాస్త్రవేత్తలు, సంబంధిత శాఖల నిపుణులతో సమాలోచనలు జరిపి ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను రూపొందించింది.
ప్రతి 15 రోజులకోసారి పరిస్థితిని సమీక్షిస్తూ తదనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. జూలైలో అధిక వర్షాల వల్ల నారుమళ్లు, నాట్లు దెబ్బతిన్న కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో రైతులు కోరుకున్న వరి విత్తనాలను 80 శాతం సబ్సిడీపై పంపిణీ చేసింది. రాయలసీమ జిల్లాల్లో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అక్కడి రైతులకు అవసరమైన విత్తనాలను 80 శాతం సబ్సిడీపై పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. గతంలో వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు రైతుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు ఉలవలు, అలసందలు, పెసలు, మినుములు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగుల విత్తనాలను సిద్ధం చేసింది.
రాయలసీమ జిల్లాల్లో ఏ ఆర్బీకేకు వెళ్లినా విత్తనాలకు కొదవలేదు. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక కింద ఆర్బీకేల్లో సిద్ధం చేసిన విత్తన నిల్వల వివరాలతో పాటు ఏ విధంగా సాగు చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే విషయంపై కరపత్రాలు, వాల్ పోస్టర్లు, వ్యవసాయ సలహా మండళ్లు, పంటల వారీ వాట్సప్ గ్రూపులు, ఆర్బీకే ఛానల్, ఆర్బీకేల ద్వారా రైతులకు విస్తృత అవగాహన కల్పిస్తోంది.
జిల్లాల నుంచి 77,049 క్వింటాళ్ల విత్తనం అవసరమని ఇండెంట్లు రాగా.., 78,440 క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేసింది. ఆగస్టు 17వ తేదీ నుంచే విత్తన సరఫరా ప్రారంభించింది. 80 శాతం సబ్సిడీపై అన్ని రకాల విత్తనాలు సమృద్ధిగా ఉంచినప్పటికీ ఎక్కువ శాతం ఉలవలు ఇస్తున్నారంటూ దు్రష్పచారం చేయడం విడ్డూరం. రైతులు కోరిన పంట విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేస్తోందే తప్ప వారికి అవసరం లేని వాటిని సరఫరా చేయడం వల్ల ప్రయోజనం ఏముంటుందో రామోజీకే తెలియాలి.
అన్ని రకాల విత్తనాలు సిద్ధం
రాష్ట్ర ప్రభుత్వం జూన్‌లోనే రైతులకు అవసరమైన అన్ని రకాల విత్తనాలను సరిపడినంతగా సిద్ధంగా ఉంచింది. విత్తనం దొరకడంలేదని రాష్ట్రవ్యాప్తంగా ఒక్క రైతూ అనలేదు. ఎందుకంటే.. వారి కళ్లెదుటే ఆర్బీకేల్లో విత్తనాలు కనిపిస్తున్నాయి. చూడనిది ఈనాడు మాత్రమే. అనంతపురం జిల్లాల్లో 6,700 క్వింటాళ్ల విత్తనాన్ని రైతులకు అందుబాటులో ఉంచింది. శ్రీ సత్యసాయి జిల్లాలో 8,960 క్వింటాళ్లు, చిత్తూరు జిల్లాలో 2,700 క్వింటాళ్లు, అన్నమయ్య జిల్లాలో 7,419 క్వింటాళ్లు సిద్ధం చేసింది. తిరుపతి జిల్లాలో రైతుల కోరిన 226 క్వింటాళ్ల ఉలవలు అందుబాటులో ఉంచింది.
కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ముందస్తు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక లేనప్పటికీ, స్థానికంగా వచ్చిన డిమాండ్ మేరకు 3,151 క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేసింది. వైఎస్సార్ జిల్లాలో తొలిదశలో 612 క్వింటాళ్లు, రెండో దశలో 3,929 క్వింటాళ్ల విత్తనం నిల్వ చేసింది. సీజన్ ముగిసేవరకు వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రాంతాల్లో 80 శాతం రాయితీపై విత్తనాల సరఫరాకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే, ఈ సీజన్‌లో వర్షాలు మరీ తక్కువగా ఉండటంతో రైతులు ముందస్తు రబీ పంటలు వేసుకొనే ఆలోచనలో ఉన్నారు.
అందువల్ల వారు ఖరీఫ్‌లో సాగుకు ఆసక్తి చూపించడంలేదు. తక్కువ మొత్తంలో విత్తనాలు తీసుకుంటున్నారు. దీంతో రాయలసీమ ప్రాంతాల్లో.. ముఖ్యంగా అనంతపురం, వైఎస్సార్, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ముందస్తు రబీ కింద శనగ సాగుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నందున ప్రభుత్వం కూడా ముందస్తుగానే సెప్టెంబర్ 15వ తేదీ నుంచి ఆర్బీకేల ద్వారా శనగ విత్తనం సరఫరాకు ఏర్పాట్లు చేస్తోంది. వాస్తవాలు ఇలా ఉంటే ఈనాడులో సత్యదూరమైన ఆరోపణలతో అబద్ధాలను అచ్చేయడంపట్ల రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment