విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండడమే కాదు.. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు, రైతుల అభ్యున్నతికి పాటుపడుతూ వ్యవసాయ, అనుబంధ రంగాల్లో స్పష్టమైన మార్పునకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాలు (ఆర్బీకేలు). దేశానికే ఇవి ఆదర్శంగా నిలుస్తూ రైతులకు అన్ని విధాలుగా భరోసా కల్పిస్తుంటే మెచ్చుకోవాల్సింది పోయి.. ఎలాగైనా రైతులకు వీటి సేవలను దూరం చేయాలన్న దుర్మార్గపు పన్నాగంతో నిత్యం వీటిపై బురద జల్లడమే పనిగా ఈనాడు రామోజీరావు పెట్టుకున్నారు.
ఏ పల్లెకు వెళ్లినా సకల సౌకర్యాలతో ఆర్బీకేలు స్వాగతం పలుకుతుండడాన్ని.. రైతులు వీటి సేవలను కొనియాడుతుండడాన్ని చూసి రామోజీకి అస్సలు నిద్ర పట్టడంలేదు. ఇలాగైతే తన ఆత్మబంధువు చంద్రబాబుకు అధికారం దక్కడం అసాధ్యం అని భావించే నిత్యం ఏదో ఒక అంశంపై విషం చిమ్ముతున్నారు. అందులో భాగమే తాజాగా ‘ప్రచారానికి లేదు హద్దు.. వసతులు అడగొద్దు’.. అంటూ ఆర్బీకేలపై తన అక్కసును చాటుకుని తన అబద్ధాలకు ఎలాంటి హద్దులేదని అక్షరం అక్షరంలో చెప్పుకున్నారు. ఈ కథనంలో వాస్తవాలేమిటంటే.. –సాక్షి, అమరావతి
ఆరోపణ : రైతులను గాలికొదిలేశారు..
వాస్తవం : గ్రామస్థాయిలో ఏర్పాటుచేసిన 10,778 ఆర్బీకేల ద్వారా 14,323 మంది సిబ్బందితో పాటు 1,573 బహుళార్ధ వ్యవసాయ విస్తరణ అధికారులు సేవలందిస్తున్నారు. వీటికి గ్రామ వలంటీర్‌తో పాటు బ్యాంకింగ్ కరస్పాండెంట్‌ను అనుసంధానం చేశారు. గతంలో ఏది కావాలన్నా మండల కేంద్రాలకు పరుగులు తీసేవారు. పగలనకా, రేయనకా నిద్రహారాలు మాని రోజుల తరబడి పడిగాపులు పడేవారు.
కానీ, ప్రస్తుతం చూద్దామన్నా ఎక్కడా క్యూలైన్ అనేది కన్పించడంలేదు. వివక్షకు తావులేకుండా అడిగిన ప్రతీరైతుకు అవసరమైన మేరకు సర్టిఫైడ్ చేసిన సాగు ఉత్పాదకాల పంపిణీతో పాటు ఈ–క్రాప్ బుకింగ్, సంక్షేమ పథకాల అమలుతో పాటు ధాన్యంతో సహా ఇతర పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. పరిశోధనా ఫలాలను నేరుగా రైతు క్షేత్రాలకు చేరవేస్తూ రైతుల్లో సామర్థ్యం పెంపుదలకు శిక్షణనిస్తున్నారు.
ఆరోపణ : ఆర్బీకేల్లో సౌకర్యాలేవి?
వాస్తవం : 526 గ్రామాల్లో ఆర్బీకేలకు సొంత భవనాలుండగా, మిగిలిన 10,252 గ్రామాల్లో ఆర్బీకేలకు రూ.2,260 కోట్ల అంచనాతో కొత్త భవనాల నిర్మాణం చేపట్టారు. తొలుత ఒక్కో భవన నిర్మాణానికి రూ.21.80 లక్షలు అంచనా వేయగా, అదనపు సదుపాయాల కోసం దీనిని రూ.23.94 లక్షలకు పెంచింది. ప్లాన్ ప్రకారం ప్రతీ ఆర్బీకే భవనం వద్ద మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉంది.
టాయిలెట్స్ నిర్మాణ పనులు జాప్యం జరిగిన చోట, సిబ్బందికి ఇబ్బందిలేకుండా ఉండేందుకు సచివాలయం, హెల్త్ క్లినిక్, ఆర్బీకే భవనాల సముదాయంలో నిర్మించిన టాయిలెట్‌ను ఆర్బీకే సిబ్బంది వినియోగించేలా ఏర్పాటుచేశారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 4,239 ఆర్బీకే భవనాలను వ్యవసాయ శాఖకు అప్పగించారు. మరో 4,935 భవనాలు వివిధ దశల్లో ఉండగా, భూ వివాదాలు, స్థలాల కొరత, కోర్టు కేసులు వంటి వివిధ కారణాలతో 1,078 భవనాల నిర్మాణం ప్రారంభించలేదు.
ఇప్పటివరకు భవనాల నిర్మాణం కోసం రూ.1,014.82 కోట్లు ఖర్చుచేయగా, మౌలిక వసతుల కల్పన కోసం మరో రూ.357 కోట్లు ఖర్చుచేశారు. సాగు ఉత్పాదకాల బుకింగ్‌తో పాటు ఎప్పటికప్పుడు వాతావరణ, మార్కెట్ సమాచారం తెలుసుకునేందుకు వీలుగా 9,484 ఆర్బీకేల్లో కియోస్క్‌లను.. వీటి పనితీరు పర్యవేక్షణకు ప్రత్యేక డాష్‌బోర్డును ఏర్పాటుచేశారు.
ఆరోపణ : ఎరువుల లారీ వస్తే సిబ్బందికి ఇబ్బందే..
వాస్తవం : ఆర్బీకేలకు ఎరువుల సరఫరాను పగటిపూట మాత్రమే చేస్తున్నారు. ఏదైనా ప్రత్యేక పరిస్థితులలో లారీల రవాణా ఆలస్యమైతే మరుసటి రోజు ఉదయం అన్‌లోడ్ అయ్యేలా ఏర్పాట్లుచేసుకోవాలని లారీ డ్రైవర్లకు మార్క్‌ఫెడ్ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఇక ఆర్బీకేల ద్వారా ఎరువు అమ్మకాలను ప్రోత్సహించేందుకు 2020–21లో మాత్రమే నగదు ప్రోత్సహకాలు ప్రకటించారు. ఆ మేరకు మార్క్‌ఫెడ్ ద్వారా చెల్లింపులు చేసేందుకు మార్కెఫెడ్ చర్యలు తీసుకుంది. 2023–24లో జిల్లాకు 8 వేల నుండి 10 వేల వరకు భూసార పరీక్షల నిమిత్తం 26 జిల్లాలకు మట్టి నమూనాల సేకరణ కోసం రూ.54.50 లక్షలు విడుదల చేశారు.
ఆరోపణ : నిర్వహణకు నిధులే లేవు?
వాస్తవం : 3,830 ఆర్బీకేల అద్దె చెల్లింపు కోసం రూ.43 కోట్లు ఖర్చుచేయగా, 2023–24 ఆర్ధిక సంవత్సరం చివరి వరకు అద్దెల నిమిత్తం మరో రూ.32.98 కోట్లు విడుదల చేశారు. ఇప్పటికే రూ.22.98 కోట్లు నేరుగా భవన యజమానుల ఖాతాలకు జమచేశారు. మిగిలిన రూ.10 కోట్లు చెల్లించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. అలాగే, ఈ ఏడాది మార్చి వరకు పెండింగ్‌లో ఉన్న విద్యుత్ బిల్లుల కోసం రూ.12 కోట్లు విడుదల చేయగా.. 2023–24 ఆర్థిక సంవత్సరం నుండి విద్యుత్ బిల్లుల చెల్లింపునకు అవసరమయ్యే బడ్జెట్‌ను నేరుగా విద్యుత్ శాఖకే కేటాయించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
స్టేషనరీ కోసం ఇప్పటికే రూ.3 కోట్లు విడుదల చేశారు. అలాగే, ఇందుకోసం ఖర్చుచేసిన ఆర్బీకే సిబ్బందికి నేరుగా రూ.53.48 లక్షలు విడుదల చేశారు. స్థానికంగా హైస్పీడ్ నెట్‌వర్క్ ఏది అందుబాటులో ఉంటే ఆ ఇంటర్నెట్ సదుపాయాన్ని ఆర్బీకేల్లో సమకూర్చారు. ఇందుకోసం ఇప్పటికే రూ.23 కోట్లు విడుదల చేశారు. సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు, రైతుసేవలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు సొంత మొబైల్ డాటాని ఉపయోగించిన సిబ్బందిపై పైసా కూడా భారం పడకుండా ఏర్పాటుచేశారు.
ఆరోపణ : రైతుభరోసా పత్రికల పేరిట అదనపు బాదుడు..
వాస్తవం : ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వ్యవసాయ రంగంలో వచ్చే మార్పులు, సాంకేతిక పరిజ్ఞానం ఎప్పటికప్పుడు రైతులకు చేరవేసే సంకల్పంతో తీసుకొచ్చిన వైఎస్సార్ రైతుభరోసా మాస పత్రిక అనతి కాలంలోనే రైతుల ఆదరణ పొందింది. 14,300 ప్రతులను వ్యవసాయ శాఖ సొంత నిధులతో ముద్రించి ఆర్బీకేలకు సరఫరా చేస్తోంది. రూ.300 చొప్పున వార్షిక చందా చెల్లించగలిగే రైతులకు నేరుగా వారి ఇంటికి పంపిస్తున్నారు. వ్యవసాయ విస్తరణ కార్యక్రమంలో భాగంగా ఆర్బీకే స్థాయిలో అవగాహన కల్పించి ఔత్సాహిక రైతులు చందాదారులుగా చేరే కార్యక్రమం చేపట్టారు. ఈ విషయంలో ఎవరిపైనా ఎలాంటి
ఒత్తిడి లేదు.
ఆర్బీకేల ద్వారా అందించిన సేవలిలా..
అదును దాటక ముందే.. కాదు కాదు.. సీజన్‌కు ముందుగానే సర్టిఫై చేసిన నాణ్యమైన సాగు ఉత్పాదకాలను బుక్ చేసుకున్న 24 గంటల్లోపే రైతుల ముంగిట్లో వాటిని అందిస్తున్నారు.
♦ ఇలా ఇప్పటివరకు ఆర్బీకేల ద్వారా 34.09 లక్షల క్వింటాళ్ల సర్టిఫైడ్ విత్తనాలను రూ.1,027.66 కోట్ల రాయితీతో 58 లక్షల మంది రైతులకు, నాన్ సబ్సిడీ కేటగిరీ కింద రూ.13 కోట్ల విలువైన 1,661 క్వింటాళ్ల పత్తి, మిరప, వరి, మొక్కజొన్న, సజ్జ, సోయాబీన్ తదితర సర్టిఫైడ్ విత్తనాలను 30వేల మంది రైతులకు సరఫరా చేశారు.
♦ఆర్బీకేల ద్వారా ఈ మూడున్నరేళ్లలో రూ.1,312 కోట్ల విలువైన 11.88 లక్షల టన్నుల ఎరువులను 31.54 లక్షల మంది రైతులకు పంపిణీ చేశారు. అలాగే, 1.51 లక్షల మంది రైతులకు రూ.14 కోట్ల విలువైన 1.36 లక్షల లీటర్ల పురుగు మందులను పంపిణీ చేశారు.
♦ వీటితో పాటు.. ఆక్వా రైతులకు సర్టిఫై చేసిన ఫీడ్, సీడ్, పాడి రైతులకు సంపూర్ణ మిశ్రమ దాణా, పశుగ్రాసం విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. టమరోవైపు.. ఆర్బీకేల ద్వారా వైఎస్సార్ రైతుభరోసా కింద 53.53 లక్షల మంది రైతులకు రూ.33,209.81 కోట్ల పెట్టుబడి సాయం, వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద 54.48 లక్షల మంది రైతులకు రూ.7,802.05 పంటల బీమా పరిహారం, 22.85 లక్షల మంది రైతులకు రూ.1,976.44 కోట్ల పెట్టుబడి రాయితీ (పంట నష్టపరిహారం), 73.88 లక్షల మంది రైతులకు రూ.1,442.66 కోట్ల సున్నా వడ్డీ రుణాలు అందించగా.. ఆర్బీకేలకు అనుబంధంగా ఏర్పాటుచేసిన 10,936 వైఎస్సార్ యంత్రసేవా కేంద్రాల కోసం రూ.366.25 కోట్ల సబ్సిడీని అందించారు. .. ఇలా నిర్విరామంగా రైతుల సేవలో నిమగ్నమైన ఆర్బీకేలకు అనతి కాలంలోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రశంసలతో పాటు అవార్డులు, రివార్డులు వరించాయి. అలాగే, సకల సౌకర్యాలతో అన్ని విధాలుగా రైతులకు భరోసా కల్పిస్తున్న వీటిపై ఈనాడు అదే పనిగా నిత్యం విషం కక్కడం వెనుక ఉన్న లక్ష్యాలు అందరికీ తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment