fact check: కుంభకర్ణ నిద్ర మీదే రామోజీ  | FactCheck: Eenadu Ramoji Rao Fake News On YSR Rythu Bharosa And Farmers Crop Loss, Facts Inside - Sakshi
Sakshi News home page

FactCheck: కుంభకర్ణ నిద్ర మీదే రామోజీ

Published Tue, Mar 12 2024 5:39 AM | Last Updated on Tue, Mar 12 2024 11:34 AM

fact check: Ramoji Rao Eenadu Fake News on YSR Rythu Bharosa and Farmers Crop loss - Sakshi

వైఎస్సార్‌ రైతు భరోసా కింద రూ.1,078.36 కోట్ల పెట్టుబడి సాయం

సున్నా వడ్డీ రాయితీ కింద రూ.215.98 కోట్ల చెల్లింపు 

కరువు, మిచాంగ్‌ తుపాన్‌ సాయం రూ.1,294.58 కోట్లు  

వారం రోజుల వ్యవధిలోనే రూ.2,588.92 కోట్ల్ల లబ్ధి 

సాక్షి, అమరావతి:  నిత్యం కుట్రపూరిత ఆలోచనలు, విషపూరిత రాతలు.. అక్షరాలకు అందని ఆక్రోశం.. ఇదీ ఈనాడు రామోజీరావు పరిస్థితి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పదేపదే అబద్ధాలను అచ్చేస్తూ వయోభారానికి తోడు తనకున్న అల్జీమర్స్‌ వ్యాధి ముదిరి పోయిందని సోమవారం మరోసారి రుజువు చేసుకున్నాడు. దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో ఖరీఫ్‌తో పాటు రబీలో పంటల సాగు తగ్గిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేందుకు వీలుగా ఒకే వ్యవసాయ సీజన్‌లో నాలుగు సార్లు సబ్సిడీపై విత్తనాలు ప్రభుత్వం అందించిన విషయాన్ని తన రాతల్లో మరుగున పరిచారు. 103 కరువు మండలాల పరిధిలో పంటలు నష్టపోయిన రైతులతో పాటు డిసెంబర్‌లో విరుచుకుపడిన మిచాంగ్‌ తుపాన్‌ వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకూ పెట్టుబడి రాయితీని నాలుగు రోజుల క్రితమే విడుదల చేసిన విషయాన్ని మరచిపోయారు. మూడో విడత రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీలు కలిపి ఏకంగా 75.96 లక్షల మందికి రూ.2588.92 కోట్లు లబ్ధి చేకూర్చిన అంశం ఈ కబోదికి కన్పించలేదు.  

ఆరోపణ: ఖరీఫ్, రబీలో కలిపి 45 లక్షల ఎకరాల్లో బీడు 
వాస్తవం: ఖరీఫ్, రబీ పంట కాలాల్లో సాధారణ విస్తీర్ణం 140.24 లక్షల ఎకరాలకు గాను 104.94 లక్షల ఎకరాల్లో సాగైంది. బెట్ట పరిస్థితుల వలన 35.30 లక్షల ఎకరాలలో పంటలు వేయలేదు. కానీ ఉద్యాన పంటల విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. పండ్లు, ప్లాంటేషన్‌ తోటలు, కూరగాయలు, వాణిజ్య పూలు, ఇతర ఉద్యాన పంటల విస్తీర్ణం ఖరీఫ్, రబీల్లో 7,87,621 ఎకరాలకు చేరింది. సాధారణం కన్నా కేవలం 27.42 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు తగ్గింది. కానీ ఈనాడుకు మాత్రం ఏకంగా 45 లక్షల ఎకరాల్లో తగ్గినట్టుగా కని్పంచింది.   

ఆరోపణ: కరువు, తుపానులతో మరో 43 లక్షల ఎకరాల్లో పంట నష్టం 
వాస్తవం:    వర్షాభావ పరిస్థితుల వల్ల ఏడు జిల్లాల్లో 103 కరువు మండలాలను ప్రకటించారు. ఈ మండలాల్లో 14,24,245 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగా గుర్తించారు. ఇందులో ఉద్యాన, వ్యవసాయ పంటలున్నాయి. రబీ సీజన్‌ ఆరంభంలో విరుచుకుపడిన మిచాంగ్‌ తుపాన్‌ భారీ వర్షాల వలన 6,64,380 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగా గుర్తించారు. కరువు, మిచాంగ్‌ తుపాన్‌ వల్ల  20,88,625 ఎకరాలు పంటలు దెబ్బతింటే ఈనాడుకు మాత్రం 43 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగా కని్పంచింది.  

ఆరోపణ: వెంటాడిన పొడి వాతావరణం 
వాస్తవం:
దేశ వ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు ఖరీఫ్‌తో పాటు రబీలోనూ కొనసాగింది. కానీ పొడి వాతావరణం కని్పంచినంత మాత్రాన కరువు ఉన్నట్టు కాదన్న విషయం రామోజీకి తెలియంది కాదు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు ఏదైనా ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా గుర్తించాలంటే ఆరు ప్రామాణికాల ఆధారంగా తీసుకుంటారు. తొలుత ప్రాథమిక అంచనా,  క్షేత్ర స్థాయి పరిశీలన, తర్వాత నిబంధనల మేరకు 33 శాతానికి పైగా మునిగిపోయి దెబ్బతిన్న పంటలను పరిగణనలోకి తీసుకొని నష్టం తుది అంచనాలను రూపొందిస్తారు. ఆ మేరకు పంటలవారీగా లెక్కించి పరిహారాన్ని (ఇన్‌పుట్‌æసబ్సిడీ) అందిస్తారు.  

ఆరోపణ: పడిపోయిన 3 కోట్ల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి 
వాస్తవం:
కరువు, మిచాంగ్‌ ప్రభావం ఉన్నప్పటికీ 2023–24లో ఆహార ధాన్యాల దిగుబడి 154.73 లక్షల టన్నులు నమోదవుతున్నట్టు డైరెక్టర్‌ ఆఫ్‌ స్టాటస్టిక్స్‌ (కేంద్ర గణాంక శాఖ) రెండో ముందస్తు అంచనా వేసింది.  ఈ దిగుబడులు గడిచిన ఐదేళ్ల సగటు దిగుబడులతో పోలిస్తే తక్కువేమీ కాదు. వరితో సహా జొన్న, సజ్జ, రాగి, పెసలు, మినుము, ఉలవలు వేరుసెనగ, నువ్వులు, పత్తి పంటల ఎకరా దిగుబడి గత ఏడాదితో పోలిస్తే పెరిగింది. 2023–24 సీజన్‌లో 57.87 లక్షల ఎకరాలకు 48.93లక్షల ఎకరాల్లో వరి సాగైంది. వాస్తవాలు ఇలా ఉంటే ఏకంగా 3 కోట్ల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి తగ్గిందంటూ కాకిలెక్కలు అచ్చేశారు. 

 ఆరోపణ: కరువు విజృంభిస్తున్నా ఉపశమన చర్యలేవీ 
వాస్తవం:
ఒకే సీజన్‌లో నాలుగు సార్లు సబ్సిడీపై విత్తనాలు అందించారు. బెట్ట పరిస్థితులు నెలకొన్న సమయంలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలకు అనుగుణంగా ఆర్బీకేల ద్వారా 80 శాతం సబ్సిడీపై విత్తనాలను సరఫరా చేశారు. 2023లో జూలై– ఆగస్ట్‌ నెలల్లో కురిసిన అధిక వర్షాలకు వరి నారుమళ్ళు దెబ్బతిని నష్టపోయిన రైతులు మరలా విత్తుకునేందుకు 1479 క్వింటాళ్ళ స్వల్పకాలిక వరి రకాలు అందించారు. బెట్ట పరిస్థితుల వల్ల ఖరీఫ్‌ 2023లో పంటలు దెబ్బతిన్న రైతులకు 30వేల క్వింటాళ్ల ఉలవలు, అలసంద, మినుము, పెసర, కంది, రాగి, జొన్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు విత్తనాలను రూ.26.02 కోట్ల సబ్సిడీతో 1.14 లక్షల మందికి ఇచ్చారు. 2023 డిసెంబర్‌లో మిచాంగ్‌ తుపాను వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు 49,758 క్వింటాళ్ల శనగ, వేరుశనగ, మినుములు, పెసర, నువ్వులు, రాగి, తక్కువ పంట కాల వరి రకాలను రూ. 31.06 కోట్ల సబ్సిడీతో 71415 మందికి పంపిణీ చేశారు. మిచాంగ్‌ తుపాన్‌ వేళ రంగుమారిన, తడిసిన 6.79లక్షల టన్నుల ధాన్యాన్ని 1.11లక్షల మంది రైతుల నుంచి కొనుగోలు చేసి వారికి జీఎల్‌టీతో సహా రూ.1483.61 కోట్లు జమ చేశారు.

 ఆరోపణ: కరువు, తుపాన్‌ వేళ సాయమేది? 
వాస్తవం: కరువు, మిచాంగ్, అకాల వర్షాల వల్ల అందించిన సాయానికి అదనంగా 2023–24 సీజన్‌లో వైఎస్సార్‌ రైతు భరోసా కింద రూ.7226.08 కోట్ల పెట్టుబడి సాయంతో పాటు వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పధకం ద్వారా రూ.1117.21కోట్లు, వై.ఎస్‌.ఆర్‌. సున్నావడ్డీ పంట రుణాల పథకం ద్వారా రూ.215.98 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేసింది అంతేకాకుండా ఈ సీజన్‌లో ఇప్పటి వరకు రూ.326.14 కోట్ల ఖర్చుతో ఆర్బీకేల ద్వారా రైతులకు అందించారు. ఇవేమీ ఈనాడుకు కని్పంచకపోవడం విడ్డూరంగా ఉంది. 

 ఆరోపణ: సాయంపై సర్కార్‌ మీనమేషాలు 
వాస్తవం:
ఖరీఫ్‌ 2023 పంటకాలంలో మే–ఆగస్ట్‌ మధ్య కురిసిన వర్షాలు, వరదల వల్ల 12,198.62 ఎకరాల్లో దెబ్బతిన్న అరటి, కూరగాయలు, బొప్పాయి, తమలపాకు, మామిడి తదితర ఉద్యాన పంటల రైతులు 11,373 మందికి పెట్టుబడి రాయితీగా రూ.11 కోట్లు అందించారు. 2023 మార్చి–మే మధ్య కురిసిన అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న మొక్కొజొ­న్న, జొన్న పంటలకు సంబంధించి 1892 మంది రైతులకు క్వింటాలుకు రూ. 500 చొప్పున రూ.5 కోట్ల ప్రత్యేక పెట్టుబడి రాయితీ ఇచ్చారు. 2023లో కరువు వల్ల నష్టపోయిన 6.96 లక్షల మంది రైతులకు రూ.847.23 కోట్లు, మిచాంగ్‌ తుపాన్‌ వల్ల నష్టపోయిన 4.61 లక్షల మంది రైతులకు రూ.442.36 కోట్లు పెట్టుబడి రాయితీని రైతుల ఖాతాలకు ఇటీవలే విడుదల చేశారు. దీనికోసం జీవో ఎంఎస్‌ నెం.5 జారీ చేశారు. ఈ జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శించారు. తమ పేరు లేదని కానీ, ఇన్‌పుట్‌ సబ్సిడీ రాలేదని ఒక్కరంటే ఒక్క రైతూ ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవు. అదే ఈనాడుకు కంట­గింపుగా ఉంది.  

గతంలో ఎన్నడూ లేనంత దుర్భిక్షం 
చంద్రబాబు పాలనలో ఏటా సగటున 324 మండలాల్లో కరువు తాండవించేది. కరువు మండలాలను సీజన్‌కు అనుగుణంగా ప్రకటించిన దాఖలాలు లేవు. 2014 ఖరీఫ్‌ కరువు మండలాలను 2015 నవంబర్‌లో, 2015వి 2016 నవంబర్‌లో, 2016వి 2017 జూన్‌లోనూ, 2017వి 2018 ఆగష్టులోనూ ప్రకటించారు.  2018 ఖరీఫ్, 2018–19 రబీ సీజన్‌లలో ఏర్పడిన కరువు మండలాలను అసలు ప్రకటించనే లేదు. తన ఐదేళ్ల పాలనలో 24,79,985 మంది రైతులకు చెల్లించాల్సిన రూ.2558 కోట్లు ఎగ్గొట్టిన ఘనత చంద్రబాబుదే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement