ఒక రైతు విత్తనాలు చల్లాడు. చల్లుతున్నప్పుడు చెల్లాచెదురై దారి పక్కన పడిన విత్తనాలను పక్షులొచ్చి తినేశాయి. రాతి నేలపై పడిన విత్తనాలు మొలకెత్తినప్పటికీ వాటి వేళ్లకు తేమ అందక చనిపోయాయి. ముళ్ల పొదల్లో పడిన విత్తనాలు మొక్కలయ్యాయి కానీ, పొదలు కప్పివేయడంతో సూర్యరశ్మి అందక అవీ అంతరించాయి. సారవంతమైన నేలలో పడిన విత్తనాలు మాత్రమే ఏపుగా ఎదిగి, మంచి దిగుబడిని ఇచ్చాయి. ఈ కథ బైబిలులోనిది. మంచిమాటను విత్తనంతో, మానవ వివేకాన్ని సారవంతమైన నేలతో పోల్చారు జీసస్ క్రైస్ట్.
ఒక మంచి మాట మన మనసులో పడి, దాని ఫలాలు మన ద్వారా సమాజానికి అందాలంటే అనేక అడ్డుంకులు ఉంటాయి. బయటి అడ్డంకులు కొన్ని, లోపలి అడ్డంకులు కొన్ని. బయటి అడ్డంకులు.. మనలోని విత్తనాలను తినేసే పక్షులు. లోపలి అడ్డంకులు.. మనలోనే మనకు ఎదురు తిరిగే శక్తులు. అశ్రద్ధ, అలక్ష్యం, అవివేకం, సోమరితనం, అసహనం, తొందరపాటు.. ఇవీ ఆ శక్తులు. బయటి శక్తుల్ని, లోపలి శక్తుల్ని ఎదుర్కొని, మనం వినిన, మనం చూసిన మంచిని మనసుకు ఎక్కించుకుంటే.. సారవంతమైన భూమిలో పడి సమృద్ధిగా పండిన పంటలా.. మన ఆలోచనలు పుష్పిస్తాయి. ఫలిస్తాయి. మానవ జీవితాన్ని సుఖశాంతులతో సుభిక్షం చేస్తాయి. రేపు ‘వరల్డ్ సాయిల్ డే’. నేల తల్లి దినోత్సవం. మంచి ఆలోచనలకు మనమొక సారవంతమైన నేలగా మారాలని తీర్మానించుకోడానికి ఇదొక మంచి సందర్భం.
Comments
Please login to add a commentAdd a comment