కల్తీ విత్తన బాధితులను ఆదుకోవాలి
గుంటూరు వెస్ట్: కల్తీ విత్తనాలు సాగు చేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గద్దె చలమయ్య, జిల్లా కార్యదర్శి వై రాధాకృష్ణ కోరారు. రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. చలమయ్య, రాధా కృష్ణ మాట్లాడుతూ జీవా, బ్రహ్మపుత్ర మిర్చి విత్తనాలు, కావేరి ప్రత్తి విత్తనాలు కల్తీ రకాలు కావడంతో పంటలు కాపులేక రైతులు తీవ్రంగా నష్టపోయినట్లు తెలిపారు. రబీకి నీటిని విడుదల చేయాలని కోరారు. వరదలకు నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.20 వేలు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నారు. అనంతరం కలెక్టరేట్ నుంచి జెడ్పీ గ్రీవెన్స్‌సెల్ వరకు రైతులు ప్రదర్శన నిర్వహించారు. జెడ్పీ ఇన్‌చార్జి సీఈఓ సోమేపల్లి వెంకటసుబ్బయ్యకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు బాలకష్ణ, మేడికొండూరు రామకృష్ణ, రావి వెంకటరత్నం, వలి పాల్గొన్నారు.