మార్కెట్‌లోకి మూడు కొత్త వంగడాలు | Three new entrants into the market | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లోకి మూడు కొత్త వంగడాలు

Published Tue, Aug 13 2024 6:02 AM | Last Updated on Tue, Aug 13 2024 6:02 AM

Three new entrants into the market

ఎన్జీ రంగా వ్యవసాయ వర్శిటీ శాస్త్రవేత్తల సృష్టి 

శనగలో నంద్యాల గ్రామ్, పెసరలో లాంపెసర 

వేరుశనగలో ఐసీఏఆర్‌ కోణార్క్‌ రకాలు 

దక్షిణాది రాష్ట్రాల్లో సాగుకు అనువైన వంగడాలు 

ప్రధానిచే ఢిల్లీలో విడుదల 

సాక్షి, అమరావతి: మారుతున్న వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ, అధిక దిగుబడులను సాధించే మూడు కొత్త వంగడాలను ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మార్కెట్‌లోకి తీసుకొచి్చంది. ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ స్థాయిలో విడుదల చేసిన 109 వంగడాల్లో ఎన్జీ రంగా వర్శిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ వంగడాలూ ఉన్నాయి. 

దేశీ శనగలో నంద్యాల గ్రామ్, పెసరలో లాం పెసర, వేరుశనగలో ఐసీఏఆర్‌ కోణార్క్‌ (టీసీజీఎస్‌ 1707) రకాలను వర్శిటీ అభివృద్ధి చేసింది. వీటి ప్రత్యేకతలను వర్శిటీ వైస్‌ఛాన్సలర్‌ డాక్టర్‌ ఆర్‌. శారదా జయలక్ష్మీదేవి సోమవారం మీడియాకు వివరించారు. ఈ వంగడాలను ప్రధాని మోదీ విడుదల చేయడం గర్వకారణంగా ఉందని చెప్పారు. ఆ వంగడాల విశిష్టతలివీ.. 

నంద్యాల గ్రామ్‌ (ఎన్‌బీఈజీ 1267): రబీ సీజన్‌కు అనుకూలమైన ఈ శనగ రకం పంట కాలం 90 నుంచి 95 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 20.95 క్వింటాళ్లు. ఎండు తెగులును తట్టుకోగలదు. దేశీ శనగ రకం యంత్రంతో కోతకు అనుకూలం. 1, 2 రక్షిత నీటి పారుదలతో పండించుకోవచ్చు. 15.96 శాతం సీడ్‌ ప్రొటీన్‌ ఉంటుంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో రబీ సీజన్‌కు అనుకూలం. 

ఐసీఏఆర్‌ కోణార్క్‌ (టీసీజీఎస్‌–1707): ఖరీఫ్‌ సీజన్‌కు అనుకూలమైన ఈ వేరుశనగ రకం పంట కాలం 110 నుంచి 115 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 24.75 క్వింటాళ్లు వస్తుంది. రసం పీల్చే  పురుగులను తట్టుకుంటుంది. ఆకుమచ్చ తెగులు, వేరుకుళ్లు, కాండంకుళ్లు, వేరు ఎండు తెగుళ్లను మధ్యస్థంగా తట్టుకుంటుంది. కాయ నుంచి పప్పు దిగుబడి 70 నుంచి 75 శాతం ఉంటుంది. నూనె 49 శాతం వస్తుంది. 100 గింజల బరువు 40 నుంచి 45 గ్రాములుంటుంది. ప్రొటీన్స్‌ 29 శాతం. అధిక నీటి వినియోగ సామర్థ్యం ఉంటుంది. గింజలు లేత గులాబీ రంగులో ఉంటాయి. కాయలన్నీ ఒకేసారి పక్వానికి వస్తాయి.  

లాం పెసర (ఎల్‌జీజీ 610): రబీ సీజన్‌కు అనుకూలమైన ఈ పెసర రకం పంట కాలం 74 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 11.17 క్వింటాళ్లు వస్తుంది. ఎల్లో మొజాయిక్‌ వైరస్‌ను తట్టుకుంటుంది. యంత్రంతో కోతకు అనుకూలం. రబీ సీజన్‌లో వరి మాగాణులకే కాదు.. మెట్ట ప్రాంతాల్లో సైతం సాగుకు అనుకూలం. వీటిలో ప్రొటీన్స్‌ 23.16 శాతం ఉంటాయి. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిశాలలో రబీ సీజన్‌లో సాగుకు అనువైన రకమిది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement