
గోడౌన్ నిల్వ ఉంచిన పసుపు
కొల్లిపర: వైఎస్సార్ కడప జిల్లా నుంచి కొల్లిపర మండలంలోని తూములూరు గ్రామానికి పసుపు విత్తనం దిగుమతులు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు పది వేల పుట్ల వరకు మేలురకం విత్తనం దిగుమతి చేసుకున్నారు. జూన్ చివరి నుంచి గ్రామంలో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. పుట్టి సుమారు రూ.4000 వరకు పలికే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొల్లిపర మండలంలోని రైతులు వైఎస్సార్ కడప జిల్లా నుంచి పసుపు విత్తనాన్ని దిగుమతి చేసుకుని ఇక్కడి నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు.
పసుపు విత్తన క్రయవిక్రయాలకు తూములూరు గ్రామం కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. 35 ఏళ్లుగా కడప జిల్లాలో పండిన పసుపును విత్తనం నిమిత్తం తూములూరు గ్రామానికి తెచ్చి విక్రయిస్తున్నారు. ఏటా 17 వేల నుంచి 18 వేల పుట్ల వరకు వచ్చి పసుపు విత్తనం గ్రామానికి దిగుమతి అవుతుంది. ఒక పుట్టికి 225 కిలోలు ఉంటుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఒడిశా నుంచి రైతులు ఇక్కడ వచ్చి కొనుగోలు చేస్తారు. నాణ్యమైన విత్తనంతో పాటు సరైన కాటా, నమ్మకం ఉండటంతో విత్తనం అమ్మకానికి మార్కెట్ ఏర్పడింది. పసుపు వ్యాపారానికి ప్రతి ఏటా కాటా పాట జరుగుతుంది. దీనికి సంబంధించిన రాబడి గ్రామ పంచాయతీకి చెల్లిస్తారు. దీని ద్వారా గ్రామంలో 250 మందికి మూడు నెలలు పాటు ఉపాధి లభిస్తోంది.
పసుపు విత్తనంలో రకాలు..
పసుపు విత్తనంలో పలు రకాలు ఉన్నాయి. టేకూరుపేట, బాక్రాపేట, సేలం, సుగంధ, కడప, ప్రగడవరం వంటి రకాలు ఇక్కడ దిగుమతి అవుతాయి. ప్రగడవరం రకం ఏలూరు, ద్వారకాతిరుమల ప్రాం తాల్లో, సుగంధ రకం జిల్లాలోని పల్నాడు, కృష్ణా జి ల్లా నందిగామ ప్రాంతాలకు ఎగుమతి అవుతా యి. సేలం రకం లంక గ్రామాలతో పాటు కొల్లిపర మం డల పరిసర ప్రాంతాల్లో విస్తారంగా పండిస్తారు.
నాలుగేళ్లుగా నిరాశే....
గత నాలుగేళ్లుగా ఎండు పసుపుకు గిట్టుబాటు ధర లేక పోవటంతో రైతుల్లో ఆసక్తి కొరవడింది. కౌలు ఎకరాకు రూ.50 వేలకు ఉండడం, కూలీ రేట్లు, ఎరువుల ధరలు ఆమాంతం పెరగటంతో రైతులు పసుపు సాగు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. గతేడాది కడప వ్యాపారస్తులు 17 వేల పుట్లు నిల్వ ఉంచగా, ఆశించిన ధర పలకకపోవడంతో నష్టాలను చవిచూశారు. ఈ ఏడాది ప్రారంభంలో మార్కెట్‌లో ఎండు పసుపు ధర రూ.5,500 పలికింది. ప్రస్తుతం మోడల్ ధర రూ.5 వేలు ఉంది. ప్రస్తుతం కడపలో క్వాలిటీని బట్టి పుట్టు రూ.3 వేల నుంచి రూ.4,500 ధర పలుకుతోంది.
కడప విత్తనానికి గిరాకీ..
గుంటూరు, కృష్ణా జిల్లాల్లో రైతులు విత్తన మా ర్పిడికి వైఎస్సార్ కడప జిల్లాలో పండిన పసుపు ను వాడతారు. దీంతో క డప పసుపు విత్తనానికి గిరాకీ ఉంది. గిట్టుబాటు ధర, అన్ని సౌకర్యాలు ఉండటంతో ఇక్కడ క్రయవిక్రయాలకు ఆసక్తి చూపుతాం. మహారాష్ట్ర సాంగ్లీ ప్రాంతంలో పసుపు కాయలను, ఇక్కడ పసుపు కొమ్ములను విత్తనంగా సాగు చేస్తారు. కొమ్ముల ను ఇక్కడికి, కాయలను సాంగ్లీకి ఎగుమతి చేస్తాం.-ఎ.సుబ్బన్న, రైతు, మైదుకూరు, కడప జిల్లా