పిఠాపురం: ఇళ్లముందు మామిడి తోరణాలు కనిపించడం సహజం. కానీ.. కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలోని చిత్రాడ గ్రామంలో మాత్రం బీరకాయల తోరణాలు కనిపిస్తాయి. ఆ గ్రామంలో లభించే బీర విత్తనాలకు అంతటి ప్రసిద్ధి మరి. మొలకెత్తిన బీరపాదుకు ఏడు ఆకులు రాగానే.. కాయలు కాయడం చిత్రాడ బీర ప్రత్యేకత.
అందుకే.. దీనిని ఏడాకుల బీర అని పిలుస్తుంటారు. పూర్వం ఇక్కడ ఒక ఇంట్లో సాగు చేసిన బీరపాదుకు ఏడాకులు రాగానే కాయలు కాయడం ప్రారంభించడంతో దాని నుంచి విత్తనాలు సేకరించి విత్తనాభివృద్ది చేసినట్టు పెద్దలు చెబుతుంటారు. గ్రామంలో ఏడు తరాలుగా రైతులు ఏడాకుల బీరను సాగు చేస్తున్నారు.
ఇక్కడి పాదులన్నీ విత్తనాలకే..
చిత్రాడలో సాగు చేసే బీర పాదులకు కాసే కాయల్ని ఇంటి అవసరాలకు వినియోగించకుండా కేవలం విత్తనాలకు మాత్రమే కేటాయించడం ప్రత్యేకత. ఇక్కడ పండిన బీర నుంచి తీసిన విత్తనాలు మంచి దిగుబడి వస్తుందనే నమ్మకంతో గుంటూరు, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు తదితర జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల రైతులు కూడా చిత్రాడ వచ్చి విత్తానాలను కొనుగోలు చేస్తుంటారు.
ఈ విత్తనంతో వేరే ప్రాంతాల్లో సాగు చేసి.. ఆ పంట నుంచి విత్తనాలను సేకరించినా ఆశించిన ఫలితాలు కనిపించకపోవడంతో రైతులు ఈ గ్రామంలో పండిన విత్తనాలపైనే ఆసక్తి చూపుతారు. గ్రామంలో 300 మందికి పైగా రైతులు చిత్రాడ, పరిసర పొలాల్లో బీర పంట సాగు చేస్తున్నారు. బీర పాదుల నుంచి సేకరించిన కాయలను ఇళ్లవద్ద చూరులకు తోరణాలుగా కట్టి నీడలోనే ఆరబెడతారు. పెద్ద రైతులైతే స్థానికంగా ఇళ్లను అద్దెకు తీసుకుని వాటిలో విత్తన బీరను నిల్వ ఉంచుతారు.
పిఠాపురం–కాకినాడ ప్రధాన రహదారికి ఇరువైపులా విత్తన బీరకాయలను వేలాడదీసిన ఇళ్లే కనిపిస్తుంటాయి. ఇతర జిల్లాల నుంచి రైతులకు అక్కడికక్కడే ఎండిన బీరకాయల నుంచి విత్తనాలను తీసి ఇస్తారు. ప్రస్తుతం కేజీ విత్తనాలు రూ.1,600 వరకు ధర పలుకుతుంది.
విత్తన బీరను పండించిన రైతులందరూ తమ ఇళ్లవద్ద మాత్రమే విత్తనాలు విక్రయిస్తుంటారు. సుమారు 600 ఎకరాల్లో రైతులు ఏడాకుల బీరను సాగు చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులను బట్టి ఎకరాకు 200 కేజీల వరకు విత్తన దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు.
తరతరాలుగా బీర విత్తనాలే
మా తాతల కాలం నుంచీ బీర తోటలు సాగు చేస్తూ విత్తనాల్ని విక్రయిస్తున్నాం. అధికారులు, శాస్త్రవేత్తలు వచ్చి వీటి ప్రా«ముఖ్యతను గుర్తించారు. ఎన్ని హైబ్రీడ్ రకాలు వచ్చినా ఏడాకుల బీర విత్తనాలను కొట్టలేవు. ఎందుకంటే ఈ బీర రుచి, పోషకాలలో ఎంతో గొప్పది. మిగిలిన రకాల బీర కాయలు చేదు వస్తాయి. ఇక్కడ చేదు అనే మాట ఉండదు. చిత్రాడ అంటే ఏడాకుల బీర గ్రామం అనే పేరుంది. – పేర్నీడి నాగ సత్యవతి, మహిళా రైతు, చిత్రాడ
హైబ్రీడ్ రాకతో మానేయాల్సి వచ్చింది
ఒకప్పుడు సీజన్‌లో 2 టన్నుల వరకు విత్తనాలు విక్రయించేవాళ్లం. వందల ఎకరాల్లో బీర సాగు జరిగేది. 90 శాతం మంది రైతులు ఇదే వ్యవసాయం చేసే వారు. పదేళ్లుగా హైబ్రీడ్ విత్తనాలు రావడంతో రైతులు వాటిపై మొగ్గు చూపుతున్నారు. దీంతో అమ్మకాలు తగ్గిపోయాయి.
ఒకప్పుడు 90 శాతం మంది రైతులు బీర సాగు చేస్తే.. 10 శాతం మంది మాత్రమే బీర వేస్తున్నారు. వీటి విలువ తెలిసిన రైతులు ఇప్పటికీ ఇక్కడకు వచ్చి విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. ఎన్ని హైబ్రీడ్ విత్తనాలు వచ్చినా చిత్రాడ ఏడాకుల బీరను మించి ఉండవు. – పి.కృష్ణ, రైతు, చిత్రాడ
Comments
Please login to add a commentAdd a comment