ridge gourd
-
బీరకాయ కూరను బాలింతలకు ఎందుకు పెడతారో తెలుసా?
బీరకాయ అనగానే ‘అబ్బా.. ఇపుడది తినాలా’ అంటారు పిల్లలు. పెద్దల్ల కూడా చాలామంది బీరకాయ తినడానికి ఇష్టపడరు. కానీ బీరకాయతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మన పెద్దలనాటి నుంచి అనారోగ్యం నుంచి కోలుకున్న వారికి, బాలింతలకు బీరకాయ ఎక్కువ పెడతారు. దీనికా కారణం ఏమిటంటే.. కోలుకోవడానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. తేలిగ్గా జీర్ణం అవుతుంది కూడా. బీరకాయల్లో ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రొటీన్ పవర్‌హౌస్. బీరకాయ. అందుకే ఆయుర్వేద వైద్యంలో ఫంగల్, వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ, సహా వివిధ పరిస్థితులకు చికిత్సగా చాలా కాలంగా వాడుతున్నారు.బీరకాయలో వాటర్, ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. విటమిన్ ఏ, సీ, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి6, పొటాషియం, సోడియం లభిస్తాయి. ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. బీరకాయలో విటమిన్ B6 పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని అన్ని అవయవాలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. నొప్పి, అలసట వంటి లక్షణాలను తగ్గిస్తుంది. దీంతో రక్తహీనత దరి ఉండదు.బీరకాయలో వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. బీరకాయలో సెల్యులోజ్, డైటర్ ఫైబర్ కూడా లభిస్తుంది. బీరకాయను తినడంతో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా మారుతుంది. మలబద్దకం దూరం అవుతుంది. శరీరంలోని టాక్సిన్లను బయిటకు పంపించడంలో బీరకాయ సహాయపడుతుంది. ఇది రక్తాన్ని శుద్ది చేస్తుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడుతుంది.బీరకాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలు నిజానికి పెప్టిక్ అల్సర్లను ఎదుర్కోవడంలో సహాయ పడతాయి. విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం పోషకాలు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించి, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. తద్వారా అకస్మాత్తుగా వచ్చే గుండెపోటు ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.బీరకాయ వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. ఇందులోని పొటాషియం, సోడియం, జింక్, రాగి, సెలీనియం శరీరంలోని యాసిడ్స్‌ను నియంత్రిస్తాయి.బీరకాయ రసంతో తయారు చేసిన హోమియోపతిక్ మాత్రలను సైనసైటిస్ లక్షణాల నుండి ఉపశమనం కోసం వాడతారట. బీరకాయలో జింక్, ఐరన్, పొటాషియం విటమిన్లతో పాటు ఎన్నో ఖనిజాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను మరింత మెరుగుపరుస్తాయి. బీరకాయ రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. మూత్రంలోని చక్కెర స్థాయిలను సైతం తగ్గించేందుకు సహాయపడుతుంది.బరువు తగ్గడానికి అల్సర్లు , అజీర్ణం చికిత్సకు కూడా సహాయపడుతుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను పెప్టిక్ అల్సర్లను ఎదుర్కోవడంలో సహాయపడతాయి. వాటర్కంటెంట్ ఫైబర్ ఎక్కువ, కొవ్వు తక్కువ కాబట్టి బరువు తగ్గడంలో కూడా గణనీయంగా పనిచేస్తుంది. ఆరోగ్యకరమైన చర్మం, జుట్టును ప్రోత్సహిస్తుంది. మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.బీరకాయను ఎన్ని రకాలుగా వండుకోవచ్చుకంది పప్పుతో కలిపి బీరకాయ పప్పును తయారు చేసుకోవచ్చుపెసరపప్పుతో, శనగపప్పుతో కలిపి పొడి కూరలాగ వండుకోవచ్చుగానుగ నూనెతో చేసిన బీరకాయ కూరను బాలింతకు, పేషెంట్లకు పెట్టవచ్చుబీరకాయ, పాలు కూర వండుకోవచ్చుబీరకాయను పచ్చడిగా చేసుకోవచ్చు.బీరకాయను కూర చేసుకొని, తొక్కలతో పచ్చడి చేసుకోవచ్చు.బీరకాయతో బజ్జీలు కూడా తయారు చేసుకోవచ్చుఅంతేకాదు బీరకాయ, ఎండురొయ్యలతో కూడా రుచికరమైన కూరను వండుకోవచ్చు. -
వెరైటీగా బీరకాయ దోసెలు ట్రై చేయండి! టేస్ట్ అదుర్స్!
బీరకాయ దోసెలకు కావలసినవి: బియ్యం – అర కప్పు (4 గంటల ముందు నానబెట్టుకోవాలి) పెసలు –అర కప్పు (4 గంటల ముందు నానబెట్టుకోవాలి) బీరకాయ – అర కప్పు (తొక్క తీసేసి, చిన్నగా కట్ చేసుకోవాలి) ఉప్పు – తగినంత, జీలకర్ర – 1 టీ స్పూన్ అల్లం ముక్క – చిన్నది పచ్చిమిర్చి – 3 లేదా 4 నీళ్లు – కొద్దిగా\ పెరుగు – 2 టేబుల్ స్పూన్లు నూనె – కావాల్సినంత ఉల్లిపాయ ముక్కలు – సరిపడా తయారీ విధానం: ముందుగా బీరకాయ ముక్కలను మిక్సీ పట్టుకుని, మెత్తగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెసలు, బియ్యం వేసుకుని.. కొద్దిగా నీళ్లు పోసుకుని.. మిక్సీ పట్టుకోవాలి. అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్క, సరిపడేంత ఉప్పు వేసుకుని మరోసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పెరుగు, బీరకాయ పేస్ట్ వేసుకుని మరోసారి కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పెనంపై కొద్ది కొద్దిగా నూనె వేసుకుని, దోసెలు వేసుకోవాలి. తర్వాత అభిరుచిని బట్టి.. ఉల్లిపాయ ముక్కలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. (చదవండి: వెరైటీగా ఫిష్ కేక్ ట్రై చేయండిలా!) -
నష్టాలు తక్కువ ఆదాయం ఎక్కువగా ఉండే బీరకాయ పంట..
-
ఏడు తరాల ఏడాకుల బీర
పిఠాపురం: ఇళ్లముందు మామిడి తోరణాలు కనిపించడం సహజం. కానీ.. కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలోని చిత్రాడ గ్రామంలో మాత్రం బీరకాయల తోరణాలు కనిపిస్తాయి. ఆ గ్రామంలో లభించే బీర విత్తనాలకు అంతటి ప్రసిద్ధి మరి. మొలకెత్తిన బీరపాదుకు ఏడు ఆకులు రాగానే.. కాయలు కాయడం చిత్రాడ బీర ప్రత్యేకత. అందుకే.. దీనిని ఏడాకుల బీర అని పిలుస్తుంటారు. పూర్వం ఇక్కడ ఒక ఇంట్లో సాగు చేసిన బీరపాదుకు ఏడాకులు రాగానే కాయలు కాయడం ప్రారంభించడంతో దాని నుంచి విత్తనాలు సేకరించి విత్తనాభివృద్ది చేసినట్టు పెద్దలు చెబుతుంటారు. గ్రామంలో ఏడు తరాలుగా రైతులు ఏడాకుల బీరను సాగు చేస్తున్నారు. ఇక్కడి పాదులన్నీ విత్తనాలకే.. చిత్రాడలో సాగు చేసే బీర పాదులకు కాసే కాయల్ని ఇంటి అవసరాలకు వినియోగించకుండా కేవలం విత్తనాలకు మాత్రమే కేటాయించడం ప్రత్యేకత. ఇక్కడ పండిన బీర నుంచి తీసిన విత్తనాలు మంచి దిగుబడి వస్తుందనే నమ్మకంతో గుంటూరు, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు తదితర జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల రైతులు కూడా చిత్రాడ వచ్చి విత్తానాలను కొనుగోలు చేస్తుంటారు. ఈ విత్తనంతో వేరే ప్రాంతాల్లో సాగు చేసి.. ఆ పంట నుంచి విత్తనాలను సేకరించినా ఆశించిన ఫలితాలు కనిపించకపోవడంతో రైతులు ఈ గ్రామంలో పండిన విత్తనాలపైనే ఆసక్తి చూపుతారు. గ్రామంలో 300 మందికి పైగా రైతులు చిత్రాడ, పరిసర పొలాల్లో బీర పంట సాగు చేస్తున్నారు. బీర పాదుల నుంచి సేకరించిన కాయలను ఇళ్లవద్ద చూరులకు తోరణాలుగా కట్టి నీడలోనే ఆరబెడతారు. పెద్ద రైతులైతే స్థానికంగా ఇళ్లను అద్దెకు తీసుకుని వాటిలో విత్తన బీరను నిల్వ ఉంచుతారు. పిఠాపురం–కాకినాడ ప్రధాన రహదారికి ఇరువైపులా విత్తన బీరకాయలను వేలాడదీసిన ఇళ్లే కనిపిస్తుంటాయి. ఇతర జిల్లాల నుంచి రైతులకు అక్కడికక్కడే ఎండిన బీరకాయల నుంచి విత్తనాలను తీసి ఇస్తారు. ప్రస్తుతం కేజీ విత్తనాలు రూ.1,600 వరకు ధర పలుకుతుంది. విత్తన బీరను పండించిన రైతులందరూ తమ ఇళ్లవద్ద మాత్రమే విత్తనాలు విక్రయిస్తుంటారు. సుమారు 600 ఎకరాల్లో రైతులు ఏడాకుల బీరను సాగు చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులను బట్టి ఎకరాకు 200 కేజీల వరకు విత్తన దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. తరతరాలుగా బీర విత్తనాలే మా తాతల కాలం నుంచీ బీర తోటలు సాగు చేస్తూ విత్తనాల్ని విక్రయిస్తున్నాం. అధికారులు, శాస్త్రవేత్తలు వచ్చి వీటి ప్రా«ముఖ్యతను గుర్తించారు. ఎన్ని హైబ్రీడ్ రకాలు వచ్చినా ఏడాకుల బీర విత్తనాలను కొట్టలేవు. ఎందుకంటే ఈ బీర రుచి, పోషకాలలో ఎంతో గొప్పది. మిగిలిన రకాల బీర కాయలు చేదు వస్తాయి. ఇక్కడ చేదు అనే మాట ఉండదు. చిత్రాడ అంటే ఏడాకుల బీర గ్రామం అనే పేరుంది. – పేర్నీడి నాగ సత్యవతి, మహిళా రైతు, చిత్రాడ హైబ్రీడ్ రాకతో మానేయాల్సి వచ్చింది ఒకప్పుడు సీజన్లో 2 టన్నుల వరకు విత్తనాలు విక్రయించేవాళ్లం. వందల ఎకరాల్లో బీర సాగు జరిగేది. 90 శాతం మంది రైతులు ఇదే వ్యవసాయం చేసే వారు. పదేళ్లుగా హైబ్రీడ్ విత్తనాలు రావడంతో రైతులు వాటిపై మొగ్గు చూపుతున్నారు. దీంతో అమ్మకాలు తగ్గిపోయాయి. ఒకప్పుడు 90 శాతం మంది రైతులు బీర సాగు చేస్తే.. 10 శాతం మంది మాత్రమే బీర వేస్తున్నారు. వీటి విలువ తెలిసిన రైతులు ఇప్పటికీ ఇక్కడకు వచ్చి విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. ఎన్ని హైబ్రీడ్ విత్తనాలు వచ్చినా చిత్రాడ ఏడాకుల బీరను మించి ఉండవు. – పి.కృష్ణ, రైతు, చిత్రాడ -
మంచి లాభాలనిస్తున్న తీగజాతి కూరగాయల సాగు
-
బీర సాగుకి ముందు భూమిని ఇలా చేస్తే దిగుబడే దిగుబడి..
-
రుచికీ, ఆరోగ్యానికీ బీర.. బీరకాయ నువ్వుల పచ్చడి తయారీ ఇలా..
డయాబెటిస్... హైబీపీ... రాజ్యమేలుతున్న రోజులివి. ఈ జంట సమస్యలు లేని ఇంటి కోసం భూతద్దంతో వెతకాల్సిందే. స్క్రీన్లతో స్మార్ట్‌గా కళ్లకు అద్దాలు జోడవుతున్నాయి. వీటికి జవాబులు మన ‘వంటిల్లు’లో వెతుకుదాం. వేడిని తగ్గించి, కంటికి మేలు చేసి, రక్తాన్ని వృద్ధి చేసే... బీరకాయతో... రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. బీరాలు పోవడం లేదు... బీరకాయ కూర చేస్తున్నాం. బీరకాయ నువ్వుల పచ్చడి కావలసినవి: ►బీరకాయ ముక్కలు – కప్పు ►టొమాటో ముక్కలు – అర కప్పు ►చింతపండు– చిన్న గోళీ అంత ►మినప్పప్పు – టీ స్పూన్ ►పచ్చి శనగపప్పు – టీ స్పూన్ ►నువ్వులు – 2 టేబుల్ స్పూన్లు ►ఆవాలు– పావు టీ స్పూన్ ►జీలకర్ర – పావు టీ స్పూన్ ►ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చి – 6 ►నూనె – టీ స్పూన్ ►ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి. పోపు కోసం... ఆవాలు– అర టీ స్పూన్ ►జీలకర్ర– అర టీ స్పూన్ ►వెల్లుల్లి రేకలు – 6 ►కరివేపాకు రెమ్మలు – 2 ►తెల్ల నువ్వులు – అర టీ స్పూన్. తయారీ: ►మందపాటి పెనంలో (నూనె లేకుండా) పచ్చి శనగపప్పు, మినప్పప్పు, నువ్వులు, మిర్చి, జీలకర్ర వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ►అదే పెనంలో నూనె వేడి చేసి బీరకాయ ముక్కలను ఒక మోస్తరుగా వేయించి పక్కన పెట్టాలి. ►అదే పెనంలో టొమాటో ముక్కలను వేసి సన్న మంట మీద మగ్గనివ్వాలి. ►ఈలోపు వేయించిన గింజలు, మిర్చి చల్లారి ఉంటాయి. ►వాటిని మిక్సీ జార్లో మెత్తగా చేసి అందులో బీరకాయ ముక్కలు వేసి గ్రైండ్ చేయాలి. ►చివరగా టొమాటో ముక్కలు, చింతపండు, ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి ►ఇప్పుడు పోపు పెట్టాలి. ►పెనంలో నూనె వేడి చేసి పోపుకోసం తీసుకున్న దినుసులన్నీ వేసి వేగిన తరవాత అందులో మిక్సీలో గ్రైండ్ చేసిన చట్నీని వేసి కలిపితే బీరకాయ చట్నీ రెడీ. ఇది ►ఇడ్లీ, దోశెలు, చపాతీలు, అన్నంలోకి కూడా మంచి రుచినిస్తుంది. -
బీరకాయ కూర తరచుగా తింటున్నారా? ఇందులోని అధిక సెల్యులోజ్ వల్ల
సాధారణంగా జ్వరం వచ్చి తగ్గినప్పుడు పథ్యం కూరలా బీరకాయ వండుతుంటారు. బీరకాయలో కొవ్వులు తక్కువగా, నీరు, పీచుపదార్థం ఎక్కువగా ఉండి, పోషకాలు అధికంగా ఉండడంతో పాటు తొందరగా జీర్ణం కావడమే అందుకు కారణం. నిజానికి బీరకాయను పథ్యం కూరలా కాదు, ఆహారంలో తరచు భాగం చేసుకోవడం ఎంతో మంచిది. ఎందుకంటే, బీరపాదు మొత్తం ఔషధపూరితం అని వైద్యులు అంటున్నారు. ఆరోగ్య లాభాలు ►సాధారణ, నేతి బీరకాయ– రెండు రకాల కాయల్లోనూ పీచు, విటమిన్ –సి, జింక్, ఐరన్, రిబోఫ్లేవిన్ , మెగ్నీషియం, థైమీన్ ... వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ►సెల్యులోజ్ ఎక్కువగా ఉండటంతో ఇది మలబద్ధకాన్నీ మొలలవ్యాధినీ నివారిస్తుంది. ►బీరకాయల్లోని పెప్టెడ్‌లు, ఆల్కలాయిడ్లు రక్తంలోనూ మూత్రంలోనూ ఉండే చక్కెర నిల్వల శాతాన్ని తగ్గించేందుకూ తోడ్పడతాయి. షుగర్ ఉన్నవాళ్లు ►మాంగనీసు జీర్ణక్రియా ఎంజైముల ఉత్పత్తిని పెంచడం ద్వారా చక్కెరవ్యాధినీ నియంత్రిస్తుంది. ►రక్తశుద్ధికీ కాలేయ ఆరోగ్యానికీ తోడ్పడుతుంది. ►దెబ్బతిన్న కాలేయాన్నీ రక్షిస్తుంది. కంటికండరాల బలహీనత తగ్గించి ►కామెర్లు వచ్చినవాళ్లు బీరకాయ రసం తాగడంవల్ల మంచి ఫలితం ఉంటుందనీ దీనివల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లూ రావనీ రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుందనీ తేలింది. ►అల్సర్లూ మంటలతో బాధపడేవాళ్లకి బీరకాయ మందులా పనిచేస్తుంది. ►బీరకాయలోని విటమిన్ –ఎ కంటికండరాల బలహీనత కారణంగా తలెత్తే అంధత్వాన్ని నివారిస్తుందని జాతీయ అంధత్వ నివారణ సంస్థ పేర్కొంటోంది. రక్త హీనతతో బాధపడుతున్న వారికి ►ఇందులోని విటమిన్ బి5 చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందట. ►బీరకాయల్లోని విటమిన్ బి6 అనీమియాను నివారించగలదనీ తేలింది. ►ఇన్ని ప్రయోజనాలున్న బీరకాయను పథ్యంలా కాకుండా తరచు తీసుకోవడమే మంచిది కదా మరి. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే. వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యకు సరైన పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. చదవండి: Unwanted Hair Removal: అందుకే అవాంఛిత రోమాలు! ఫైటో ఈస్ట్రోజెన్లు అధికంగా ఉండేవి తింటే.. Heart Attack: బయట ఫ్రైడ్ రైస్, మంచూరియా, పునుగులు, బోండాలు తరచుగా తింటున్నారా? అయితే.. -
ఇంట్లో ఇవి ఉంటే చాలు.. రుచికరమైన, ఆరోగ్యానిచ్చే ఉడిపి సాంబార్ రెడీ!
రుచికరమైన, ఆరోగ్యకరమైన ఉడిపి సాంబార్ తయారు చేసుకోండిలా! కావలసినవి: ►కందిపప్పు – అరకప్పు (కడిగి అరగంటసేపు నానబెట్టాలి) ►పసుపు– అర టీ స్పూన్ ►ఉప్పు– రుచికి తగినంత ►బీరకాయ ముక్కలు– 300 గ్రాములు ►టొమాటో ముక్కలు – కప్పు. సాంబార్ పేస్ట్ కోసం: ►మినప్పప్పు– టేబుల్ స్పూన్ ►గుంటూరు మిర్చి– 8 ►పొట్టి మిరపకాయలు – 6 ►ధనియాలు – 2 టేబుల్ స్పూన్లు ►యాలకులు – 2 ►లవంగాలు – 3 ►దాల్చిన చెక్క– అంగుళం ముక్క ►జీలకర్ర – టీ స్పూన్ ; పచ్చి కొబ్బరి ముక్కలు– అర కప్పు ; గసగసాలు– టీ స్పూన్. సాంబార్ పోపు కోసం: ►నూనె : టేబుల్ స్పూన్ ►మెంతులు – చిటికెడు ►ఆవాలు– అర టీ స్పూన్ ►ఇంగువ పొడి – చిటికెడు ►కరివేపాకు– 2 రెమ్మలు ►చింతపండు– 70 గ్రాములు (300 మి.లీ రసం చేయాలి) ►నీరు– ముప్పావు లీటరు ►ఉప్పు – తగినంత. గార్నిష్ చేయడానికి: ►నూనె – 2 టీ స్పూన్లు ►వేరుశనగ పప్పు – 4 టేబుల్ స్పూన్లు ►ఆవాలు – అర టీ స్పూన్ ►ఎండు మిర్చి– 2 ►కొత్తిమీర తరుగు – కప్పు తయారీ: ►కందిపప్పును ప్రెషర్ కుక్కర్లో వేసి ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి, పసుపు వేసి ఉడికించాలి. ►చల్లారిన తర్వాత ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ►మందపాటి బాణలి వేడి చేసి సాంబార్ పేస్టు కోసం తీసుకున్న దినుసులను సన్నమంట మీద వేయించి చల్లారిన తరవాత నీటిని వేస్తూ మెత్తగా గ్రైండ్ చేయాలి. ►బీరకాయ ముక్కల్లో కొద్దిగా నీటిని చిలకరించి మీడియం మంట మీద ఒక మోస్తరుగా ఉడికించాలి. ►మరీ మెత్తగా ఉడకకూడదు. ►మందపాటి పాత్రలో నూనె వేడి చేసి పోపు కోసం తీసుకున్న దినుసులను వేసి వేయించి టొమాటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ►తర్వాత చింతపండు రసం పోసి కలిపి అందులో సాంబార్ పేస్ట్, బీరకాయ ముక్కలు, కందిపప్పు పేస్ట్ వేసి కలిపి రుచి చూసి అవసరమైతే మరికొంత ఉప్పు వేసి కలిపి ఉడికించాలి. ►చిన్న బాణలిలో నూనె వేసి గార్నిష్ చేయడానికి తీసుకున్న దినుసులను వేయించి ఉడుకుతున్న సాంబార్లో వేసి దించేయాలి. ►ఇది అన్నంలోకి చక్కటి రుచినిస్తుంది. రోటీ చపాతీల్లోకి చేసేటప్పుడు నీటి మోతాదు తగ్గించుకుని చిక్కగా చేసుకోవాలి. చదవండి: Recipes: పాలిచ్చే తల్లులకు శ్రేష్ఠం.. సొప్పు పాల్య, మోహన్ లడ్డు తెలంగాణ రెడ్ చికెన్.. చపాతీ, రోటీలకు మంచి కాంబినేషన్ -
మంట.. మంట.. ధరల మంట.. రూ.100 కొడితేనే టమాటా.. మరి బీరకాయ?
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): ఎండలు ఎలా మండుతున్నాయో అదే మాదిరి కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ప్రధానంగా టమాటతో పాటు ఇతర కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గడంతో ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రస్తుతం వివాహాల సీజన్ కావడంతో వాటికి డిమాండ్ అధికంగా ఉంటుంది. అందుకు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో పేద, మధ్యతరగతి ప్రజలకు కొనుగోలు చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. గత 20 రోజుల క్రితం ప్రస్తుతం వాటి ధరలు చూస్తే అమాంతంగా పెరిగిపోవడం గమనార్హం. ప్రధానంగా టమాట 20 రోజుల క్రితం కిలో రూ. 20–30 వరకు విక్రయించగా, ప్రస్తుతం రూ. 100కు చేరుకుంది. జిల్లాలో టమాట, ఇతర కూరగాయల విస్తీర్ణం తగ్గడంతో హైదరాబాద్, కర్నూల్, మదనపల్లె తదితర ప్రాంతాలపై ఆధారపడాల్సి వస్తుంది. అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌కు రావాలంటే రవాణా వ్యయం సైతం అధికంగా అవుతుంది. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పూర్తి స్థాయిలో తగ్గకపోవడంతో ఆర్థిక భారం తప్పడం లేదు. దిగుబడి తగ్గడం, ఇంధనం, రవాణా వ్యయం కారణంగా ధరలు పెంచాల్సి వస్తుందని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. జిల్లాలో పంటలు చేతికి వచ్చేదాకా తగ్గే అవకాశం లేదని వారు అభిప్రాయ పడుతున్నారు. నిత్యావసర వస్తువులు, గ్యాస్ ధర పెరుగుతుంటే ఎలా జీవనం సాగించాలని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిదీ రెట్టింపే వంటకు కావాల్సిన ప్రతి వస్తువు ధర రెట్టింపు అయింది. నిత్యావసర సరుకులు ఒకదానికి ఒకటి పోటీ పడుతున్నట్లు ఉంది. కూరగాయల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గతంలో నెల రోజులకు అయ్యే వంటింటి ఖర్చు ప్రస్తుతం పది రోజులకు కూడా సరిపోవడం లేదు. ఆర్థిక భారం మోయాల్సిన దుస్థితి నెలకొంది. – జయమ్మ, గృహిణి, మహబూబ్‌నగర్ -
టమాటా.. ఊరట! ఈ రోజు ధర ఎంతంటే..
సీతమ్మధార (విశాఖ ఉత్తర): గత కొద్ది రోజులుగా రైతుబజారుల్లో టమాటా ఠారెత్తించింది. వినియోగదారులకు చుక్కలు చూపించిన టమాటా శనివారం దిగొచ్చింది. నెల రోజుల నుంచి రూ.72 పలికిన ధర శనివారం రూ.38కి లభ్యమైంది. దీంతో వినియోగదారులు అధిక సంఖ్యలో వచ్చి కోనుగోలు చేశారు. బీరకాయలు కిలో రూ.48 ఉండగా, రూ.44కు తగ్గింది. బంగాళా దుంపలు కిలో రూ.21 ఉండగా రూ.19కి దిగి వచ్చింది. క్యాబేజి మీద రెండు రూపాయలు తగ్గింది. ధరలు తగ్గడంతో శనివారం ఎక్కువ మంది వినియోగదారులు వచ్చారని రైతు బజార్ ఎస్టేట్ అధికారి వరహాలు తెలిపారు. చదవండి: Visakhapatnam: పాడి గేదె పంచాయితీ.. ప్రాణం తీసిన క్షణికావేశం! -
నేతి బీరకాయకూ ఓ రోజొచ్చింది! డిమాండే డిమాండు
నందిగామ: నేతిబీరకాయకూ ఓ రోజొచ్చింది. మామూలు రోజుల్లో దీనిని అడిగే నాథుడే ఉండడు. కానీ ఏడాదిలో ఒక్కరోజు మాత్రం అది ఈరోజు నాది అని సగర్వంగా చెప్పుకుంటుంది. కార్తిక పౌర్ణమి నేపథ్యంలో పట్టణంలో నేతిబీరకాయకు డిమాండ్ పెరిగింది. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో నేతి బీరకాయలు విరివిగా దర్శనమిచ్చేవి. చదవండి: Visakhapatnam: ఆ ఊహలన్నీ త్వరలోనే నిజం కానున్నాయి.. కాలక్రమంలో ఇవి కనుమరుగు కావడంతో మార్కెట్లో వీటి లభ్యత అరకొరగానే ఉంటోంది. అయితే, కార్తికపౌర్ణమి రోజున నేతి బీరకాయతో వంటకాలు రుచి చూడటం ఎంతో శ్రేష్టమని ప్రజలు భావిస్తారు. దీంతో గురువారం నందిగామ మార్కెట్లో వీటికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. ప్రజల అవసరాన్ని ఆసరా చేసుకొని అమ్మకందారులు ఒక్కో కాయను రూ.50 చొప్పున విక్రయించడం గమనార్హం. చదవండి: ఎక్కడి నుంచి వచ్చిందో ఆ యువతి.. ఆకతాయిలు వేధిస్తుండడంతో.. -
బీరకాయతో నాన్‌వెజ్ ట్రై చేశారా.. ఇలా చేస్తే అదిరిపోవాల్సిందే!
కూరగాయలన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. బీరకాయలో పీచుపదార్థం, విటమిన్ సి, మెగ్నీషియం, ఐరన్, జింక్, రైబోఫ్లావిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బీర తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గడమే కాకుండా రక్తహీనత, చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు కూడా తగ్గుతారు. రుచిలో కాస్త చప్పగా ఉండే బీరకాయను వివిధ రకాల కాంబినేషన్లలో వండితే మరిన్ని పోషకాలతో పాటు రుచి కూడా పెరుగుతుంది. ఎండురొయ్యలు బీర కుర్మా కావలసినవి: ఎండు రొయ్యలు – పావు కేజి; బీరకాయ – ఒకటి; ఆయిల్ – మూడు టీస్పూన్లు; ఉల్లిపాయ – ఒకటి(సన్నగా తరుక్కోవాలి); ఉప్పు – రుచికి సరిపడా; అల్లం వెల్లుల్లి పేస్టు – అరటీస్పూను; కరివేపాకు – ఒక రెమ్మ; చింతపండు – పావు టీస్పూను; ధనియాల పొడి – పావు టీస్పూను; జీలకర్ర పొడి – పావు టీస్పూను; కారం – రెండు టీస్పూన్లు; గరం మసాలా – అరటీస్పూను. తయారీ..ముందుగా ఎండు రొయ్యల తల, తోక తీసి ఇసుకలేకుండా శుభ్రంగా కడిగి పక్కనపెట్టుకోవాలి. ►బీరకాయ తొక్కతీసి సన్నని ముక్కలు చేయాలి. ►స్టవ్ మీద పాన్ పెట్టి వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఉప్పువేసి వేగనివ్వాలి. ►మరో పాన్‌లో కప్పు నీళ్లు పోసి ఎండు రొయ్యలు వేసి నాలుగు నిమిషాలు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ►ఉల్లిపాయ ముక్కలు వేగాక అల్లంవెల్లుల్లి పేస్టు, కరివేపాకు, పసుపు వేసి మరో ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి. ►ఇప్పుడు బీరకాయ ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి మరో ఐదు నిమిషాలపాటు మూత పెట్టి ఉడకనిచ్చి, ఉడికించి పెట్టుకున్న ►ఎండు రొయ్యలు వేసి మరో ఎనిమిది నిమిషాలు మగ్గనివ్వాలి ►తరువాత గరం మసాలా వేసి తిప్పి నూనె పైకి తేలేంత వరకు ఉడికిస్తే ఎండురొయ్యలు బీరకాయ కుర్మా రెడీ. బీరకాయ చికెన్ కావలసినవి: బోన్‌లెస్ చికెన్ – అరకేజి; ఆయిల్ – నాలుగు టీ స్పూన్లు; పచ్చిమిరపకాయలు – మూడు (నిలువుగా కట్ చేయాలి); ఉల్లిపాయ – ఒకటి (ముక్కలుగా కట్ చేయాలి); అల్లం వెల్లుల్లి పేస్టు – ఒకటిన్నర టీ స్పూను; పసుపు – అర టీస్పూను; బీరకాయ ముక్కలు – ఒక కప్పు; కారం – రెండు టీ స్పూన్లు; ధనియాల పొడి – టీ స్పూను; గరం మసాలా – పావు టీ స్పూను; తరిగిన కొత్తిమీర – పావు కప్పు; ఉప్పు – రుచికి సరిపడా. తయారీ.. చికెన్‌ను శుభ్రంగా కడిగిపెట్టుకోవాలి. ►స్టవ్ మీద పాన్ పెట్టి వేడెక్కిన తరువాత ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ►ఉల్లిపాయలు వేగాక అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు వేసి వేయించాలి. ►అల్లం వెల్లుల్లి పేస్టు వేగాక చికెన్ ముక్కలు వేసి మూతపెట్టి పదినిమిషాలు ఉడికించాలి. ►తరువాత బీరకాయ ముక్కలు వేసి మూతపెట్టి ఐదు నిమిషాలయ్యాక, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి. ►తరువాత ధనియాల పొడి, గరం మసాలా వేసి ఆయిల్ పైకి తేలాక, కొత్తిమీర వేసి స్టవ్ ఆపేస్తే బీరకాయ చికెన్ రెడీ. బీర ఖీబా కావలసినవి: మటన్ ఖీమా – పావు కేజి; బీరకాయ ముక్కలు – అరకేజి(తొక్కతీసినవి); తరిగిన పచ్చిమిర్చి – రెండు; వెల్లుల్లి తురుము – టీస్పూను; ఉల్లిపాయ ముక్కలు – అరకప్పు; మిరియాల పొడి – టీ స్పూను; పసుపు – టీస్పూను; కారం – రెండు టీ స్పూన్లు; గరం మసాలా – అరటీస్పూను; జీలకర్ర – టీస్పూను; ఆవ నూనె – నాలుగు టీ స్పూన్లు; ఉప్పు– రుచికి సరిపడా. తయారీ.. మటన్ ఖీమాను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ►స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడెక్కాక జీలకర్ర వేసి వేగనివ్వాలి. తరువాత పచ్చిమిర్చి తరుగు, వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ►ఇవన్నీ వేగాక పసుపు, బీరకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ►బీరకాయ ముక్కలు సగం ఉడికిన తరువాత కొద్దిగా ఉప్పు, మటన్ ఖీమా వేసి మూతపెట్టి పదిహేను నిమిషాలు ఉడికించాలి. ►ఖీమాలో వచ్చిన నీళ్లన్నీ ఇగిరిపోయాక, కారం, మిగిలిన మసాలా పొడులు వేసి వేగనివ్వాలి. ►చివరిగా ఉప్పు చూసి సరిపోకపోతే కొద్దిగా వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు వేగనిస్తే బీర ఖీమా రెడీ. -
‘బీరకాయ’తో ఇన్ని లాభాలా..
ప్రస్తుత ప్రపంచంలో యువతి యువకులు అందానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే వారికి అధిక బరువు సమస్య వేధిస్తోంది. నాజుగ్గా కనిపించడానికి ఎన్నో మందులు వాడుతున్నారు. కానీ వాటి వాడకం వల్ల శరీరానికి ఎన్ని ఇబ్బందులు తలెత్తుతాయనేది ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో సహజసిద్ధంగా బరువు తగ్గాలనే ఆలోచన చాలామందికి వచ్చింది. సాధారణంగా తెలుగు ప్రజలు బీరకాయను అప్పుడప్పుడు వినియోగిస్తుంటారు. కానీ బీరకాయ ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలిస్తే రోజు బీరకాయను వాడతారు. కేవలం బరువు తగ్గించడానికి మాత్రమే కాకుండా మరెన్నో ఆరోగ్య సమస్యలకు బీర సంజీవనిగా పనిచేస్తుంది. బరువు తగ్గడానికి ఈ కూరగాయ తింటే ఎన్ని లాభాల్లో తెలుసుకుందాం. బరువు తగ్గాలనుకునేవారు బరువు తగ్గాలనుకునే వారికి బీరకాయ మంచి ఔషధంగా పనిచేస్తుంది. సహజంగా బీరకాయలో ఫైబర్ ఎక్కువగా ఉండి, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కొవ్వును సైతం సులభంగా కరిగించే శక్తి బీరకాయ సొంతం. మధుమేహులకు ఎంతో మేలు నిత్యం బీరకాయను తినడం వల్ల శరీరంలో చక్కెర శాతాన్ని ఎక్కువ కాకుండా నివారిస్తుంది. మరోవైపు శరీరంలో ఇన్సూలిన్ ఉత్పత్తిని క్రమపద్ధతిలో ఉంచుతుంది. బీరలో శరీరానికి కావాల్సిన పెప్టైడ్స్, ఆల్క్‌లైడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల శరీర రక్షణ వ్యవస్థను బలంగా ఉంచడంలో బీర కీలక పాత్ర పోషిస్తుంది. మధుమేహం ఉన్నవారు(డయాబెటిస్) నిత్యం బీరకాయను ఉపయోగించడం ఎంతో అవసరమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు రోగనిరోధక వ్యవస్త పటిష్టం మీరు నిత్యం లివర్, నేత్ర(కళ్ల), సమస్యలతో బాధపడుతున్నారా. అయితే మీకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని అర్థం. ఆరోగ్య సమస్యలతో నిత్యం బాధపడేవాళ్లు బీరకాయను విరివిగా తీసుకోవడం వల్ల రక్షణవ్యవస్థను బలంగా ఉంచే విటమిన్లు, ఖనిజాలు, ఐరన్, మాగ్నిషియమ్, థయమిన్ తదితర పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. రోగాలను ఎదుర్కోవాలంటే బీరకాయను వాడాల్సిందే. రక్తహీనతకు మంచి మందు ముఖ్యంగా మహిళలు సరియైన పోషకాహారం తీసుకోక రక్తహీనత సమస్యతో బాధపడుతుంటారు. ఐరన్ అందకపోవడమే రక్తహీనతకు ప్రధాన కారణం. ముఖ్యంగా ఎర్ర రక్తకణాల కౌంట్‌లో ఐరన్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే నిత్యం బీరకాయను తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు మెరిసే సౌందర్యం సొంతం చేసుకోవాలంటే ఆహార లోపాల వల్లే చర్మ సమస్యలు వస్తుంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే మీరు బీరకాయను నిత్యం వాడుతుంటే నిగనిగలాడే మెరిసే సోందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు -
బిర బిర పెరిగే బీర..
నిజామాబాద్: ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న కూరగాయల్లో బీర ఒకటి. అధిక డిమాండ్ కల్గి ఉండి తొందరగా చేతికందే పంట బీర. అతి తక్కువ వ్యయంతో తక్కువ వ్యవధిలో బీర సాగు ఎలా చేయాలో వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యాజమాన్య పద్ధతులు మేలు.. బీర తక్కువ సమయంలోనే పంట చేతికందుతుంది. పందిరి విధానంలో యాజమన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు వస్తాయి. విత్తన ప్రక్రియ ఆరంభమైన మూడు వారాలకే కాతకు రావడం బీర పంట ప్రత్యేకత. సులభంగా తెంపి మార్కెట్‌కు తరలించవచ్చు. ఎక్కువ మంది కూలీలు అవసరం లేదు. ఒకే వ్యక్తి ఒక రోజులో క్వింటాలు వరకు బీరకాయలను తెంపగలుగుతారు. అదే ఇతర పంటలైతే ముగ్గురు, నలుగురు కూలీలు అవసరమవుతారు. ధర బాగా పలికితే బీర సాగులో వచ్చిన లాభాలు ఏపంటలో కూడా రావు. వినియోగదారులు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్న హైబ్రిడ్ విత్తనాలతో ఉత్పత్తయ్యే ఉన్న హైబ్రిడ్ విత్తనాలతో ఉత్పత్తి అయ్యే బీరకాయలపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. రైతులంతా ఒకేసారి ఈ పంట వేయకుండా అంచెలంచెలుగా వేస్తే ధర స్ధిరంగా ఉండే ఆవకాశాలున్నాయి. కానీ ఒక్కోసారి ఉత్పత్తి పెరిగి ధర తగ్గిపోవడం వల్ల నష్టాలను కూడా చవి చూడాల్సి వస్తోంది. తీగజాతి కూరగాయల పంటలకు ఎక్కువగా తెగుళ్లు వచ్చే అవకాశాలున్నాయి. ఆ తెగుళ్లుపై ముందే జాగ్రత్తపడి తగిన మందులు పిచికారీ చేస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. డ్రిప్ పద్ధతిలో సాగు చేస్తే మరిన్ని దిగుబడులు వచ్చే అవకాశముంది. విత్తన శుద్ధి.. కిలో విత్తనానికి మూడు గ్రాముల చొప్పున థైరం, ఐదు గ్రాముల చొ ప్పున ఇమిడా క్లొప్రిడ్, ఒక దాంతో మరోటి కలిపి విత్తనశుద్ధి చేసుకో వాలి. ఎరువులు విత్తే ముందు ఎకరాకు 6 నుంచి 8 టన్నుల సహజ ఎరువు, 40 కిలోల భాస్వరం, 20 కిలోల పోటాష్‌ను పంట చేనులోని గుంతల్లో వేయాలి. 40 కిలోల నత్రజని రెండు సమపాళ్లుగా చేసి విత్తిన 25 రోజులకు పూత పిందె దశలో వేసుకోవాలి. మొక్కకు దగ్గరగా ఎరువులు వేస్తే నీటి తడిని అందించాలి. విత్తే పద్ధతి.. నీటి కాలువలకు తోడుగా మురు గు నీరు పోవడానికి రెండు మీటర్ల దూరంలో కాలువలు ఏర్పాటు చే యాలి. అన్నిరకాల పాదులకు మూడు విత్తనాలను 1.2 సెంటీమీటర్ల లోతులో విత్తుకోవాలి. ఎరువులు.. విత్తే ముందు ఎకరాకు ఆరు నుంచి ఎనిమిది టన్నుల పశువుల ఎరువు 32–40 కిలోల భాస్వరం, 16–20 కిలోల పొటాష్‌నిచ్చే ఎరువులను గుంటల్లో వేయాలి. నత్రజనిని 32–40 కిలోలను రెండు సమపాళ్లుగా చేసి విత్తిన 25–30 రోజులకు పూత, పిందె దశలో వేసుకోవాలి. నీటి యాజమాన్యం.. పాదు చుట్టూ 3–5 సెంటీ మీటర్ల మందం మట్టి ఎండినట్లుగా ఉన్నప్పుడు నీరివ్వాలి. వారానికోసారి నీటి తడులు ఇస్తే బాగుంటుంది. నీరు ఎక్కువకాలం పాదు చుట్టూ నిల్వకుండా జాగ్రత్తపడాలి. తెగుళ్లు.. తీగజాతి రకంలో తెగుళ్లు ఎక్కువగా ఆశించే అవకాశాలున్నాయి. అందులో బూజు తెగులు, బుడిద తెగులు, వేరుకుళ్లు తెగులు, పక్షి కన్ను తెగుళ్లు ఆశిస్తాయి. వీటి నివారణకు వెంటనే ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించి మందులు పిచికారీచేయాలి. సస్యరక్షణ చర్యలు - ఎండాకాలంలో లోతుగా దుక్కి దున్నుకోవాలి - పంట మార్పిడి తప్పనిసరిగా చేపట్టాలి. - కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి - వంద గ్రాముల విత్తనానికి ట్రైకోడెర్మా విరిడి రెండు గ్రాముల చొప్పున వాడి విత్తనశుద్ధిచేయాలి. -
బీర కాదు.. ‘భీమ’ కాయలు
గోగన్నమఠం (మామిడికుదురు): సాధారణంగా దేశవాళీ రకం బీర కాయలు రెండు వందల నుంచి మూడొందల గ్రాముల బరువు మాత్రమే ఉంటాయి. అంతకు మించి తూగడం చాలా అరుదు. అయితే గోగన్నమఠంలో భూపతిరాజు సతీష్‌రాజు ఇంటి పెరట్లో దేశవాళీ బీరపాదుకు కాసిన కాయల్లో కొన్ని కేజీ బరువు తూగుతున్నాయి. చూడ్డానికి తక్కువ పొడవు ఉన్నా వాటి బరువు మాత్రం భారీగా ఉండడం విశేషం. స్థానికులు ఈ బీరకాయలను ఆసక్తిగా చూస్తున్నారు. బీర కాయల ‘భీమ’ పరిమాణంపై ఉద్యాన శాఖాధికారి శైలజను సోమవారం ‘సాక్షి’ వివరణ కోరగా పెరట్లో మొట్టమొదటిసారిగా బీర పాదు పెట్టడం వల్ల అది భూమిలో ఉన్న పోషకాలను విరివిగా గ్రహించి అధిక బరువు గల కాయలు కాస్తోందన్నారు. ఇలా అరుదుగా మాత్రమే జరుగుతుందన్నారు. -
ఔరా.. బీర!
సాధారణంగా అడుగు, అడుగున్నరకు మించని బీరకాయ ఏకంగా మూడు అడుగుల పొడవు పెరిగి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పట్టణంలోని ఉప్పరపాలెం రెడ్డినగర్‌కు చెందిన త్రిపురం కోటేశ్వరరావు తన 15 సెంట్ల స్థలంలో బీర తోటలు సాగు చేస్తున్నారు. తోటలో ఒక కాయ మూడు అడుగుల పొడవు ఉంది. విషయం తెలిసి అధిక సంఖ్యలో స్థానికులు వచ్చి బీరకాయను తిలకించారు. – బాపట్ల టౌన్ -
పే.... ద్ద బీరకాయ
చిత్రంలో మీరు చూస్తున్నది పొట్ల కాయ కాదు.. బీరకాయ.. విజయనగరం జిల్లా గుర్ల మండల కేంద్రంలో మీసాల ఈశ్వరరావు పెరట్లో కాసిన ఈ బీరకాయ రికార్డు సైజులో పెరిగింది. సుమారు మూడున్నర అడుగులు ఉన్న ఈ బీరకాయ చూసి జనం ఆశ్చర్య పోతున్నారు. ఇంద పెద్ద బీరకాయా.. అంటూ కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.