
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): ఎండలు ఎలా మండుతున్నాయో అదే మాదిరి కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ప్రధానంగా టమాటతో పాటు ఇతర కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గడంతో ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రస్తుతం వివాహాల సీజన్ కావడంతో వాటికి డిమాండ్ అధికంగా ఉంటుంది. అందుకు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో పేద, మధ్యతరగతి ప్రజలకు కొనుగోలు చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి.
గత 20 రోజుల క్రితం ప్రస్తుతం వాటి ధరలు చూస్తే అమాంతంగా పెరిగిపోవడం గమనార్హం. ప్రధానంగా టమాట 20 రోజుల క్రితం కిలో రూ. 20–30 వరకు విక్రయించగా, ప్రస్తుతం రూ. 100కు చేరుకుంది. జిల్లాలో టమాట, ఇతర కూరగాయల విస్తీర్ణం తగ్గడంతో హైదరాబాద్, కర్నూల్, మదనపల్లె తదితర ప్రాంతాలపై ఆధారపడాల్సి వస్తుంది. అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌కు రావాలంటే రవాణా వ్యయం సైతం అధికంగా అవుతుంది.
మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పూర్తి స్థాయిలో తగ్గకపోవడంతో ఆర్థిక భారం తప్పడం లేదు. దిగుబడి తగ్గడం, ఇంధనం, రవాణా వ్యయం కారణంగా ధరలు పెంచాల్సి వస్తుందని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. జిల్లాలో పంటలు చేతికి వచ్చేదాకా తగ్గే అవకాశం లేదని వారు అభిప్రాయ పడుతున్నారు. నిత్యావసర వస్తువులు, గ్యాస్ ధర పెరుగుతుంటే ఎలా జీవనం సాగించాలని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిదీ రెట్టింపే
వంటకు కావాల్సిన ప్రతి వస్తువు ధర రెట్టింపు అయింది. నిత్యావసర సరుకులు ఒకదానికి ఒకటి పోటీ పడుతున్నట్లు ఉంది. కూరగాయల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గతంలో నెల రోజులకు అయ్యే వంటింటి ఖర్చు ప్రస్తుతం పది రోజులకు కూడా సరిపోవడం లేదు. ఆర్థిక భారం మోయాల్సిన దుస్థితి నెలకొంది.
– జయమ్మ, గృహిణి, మహబూబ్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment