బీరకాయ నువ్వుల పచ్చడి
డయాబెటిస్... హైబీపీ... రాజ్యమేలుతున్న రోజులివి. ఈ జంట సమస్యలు లేని ఇంటి కోసం భూతద్దంతో వెతకాల్సిందే. స్క్రీన్‌లతో స్మార్ట్‌గా కళ్లకు అద్దాలు జోడవుతున్నాయి. వీటికి జవాబులు మన ‘వంటిల్లు’లో వెతుకుదాం. వేడిని తగ్గించి, కంటికి మేలు చేసి, రక్తాన్ని వృద్ధి చేసే... బీరకాయతో... రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. బీరాలు పోవడం లేదు... బీరకాయ కూర చేస్తున్నాం.
బీరకాయ నువ్వుల పచ్చడి
కావలసినవి:
►బీరకాయ ముక్కలు – కప్పు
►టొమాటో ముక్కలు – అర కప్పు
►చింతపండు– చిన్న గోళీ అంత
►మినప్పప్పు – టీ స్పూన్
►పచ్చి శనగపప్పు – టీ స్పూన్
►నువ్వులు – 2 టేబుల్ స్పూన్లు
►ఆవాలు– పావు టీ స్పూన్
►జీలకర్ర – పావు టీ స్పూన్
►ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చి – 6
►నూనె – టీ స్పూన్
►ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి.
పోపు కోసం... ఆవాలు– అర టీ స్పూన్
►జీలకర్ర– అర టీ స్పూన్
►వెల్లుల్లి రేకలు – 6
►కరివేపాకు రెమ్మలు – 2
►తెల్ల నువ్వులు – అర టీ స్పూన్.
తయారీ:
►మందపాటి పెనంలో (నూనె లేకుండా) పచ్చి శనగపప్పు, మినప్పప్పు, నువ్వులు, మిర్చి, జీలకర్ర వేయించి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి.
►అదే పెనంలో నూనె వేడి చేసి బీరకాయ ముక్కలను ఒక మోస్తరుగా వేయించి పక్కన పెట్టాలి.
►అదే పెనంలో టొమాటో ముక్కలను వేసి సన్న మంట మీద మగ్గనివ్వాలి.
►ఈలోపు వేయించిన గింజలు, మిర్చి చల్లారి ఉంటాయి.
►వాటిని మిక్సీ జార్‌లో మెత్తగా చేసి అందులో బీరకాయ ముక్కలు వేసి గ్రైండ్ చేయాలి.
►చివరగా టొమాటో ముక్కలు, చింతపండు, ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి
►ఇప్పుడు పోపు పెట్టాలి.
►పెనంలో నూనె వేడి చేసి పోపుకోసం తీసుకున్న దినుసులన్నీ వేసి వేగిన తరవాత అందులో మిక్సీలో గ్రైండ్ చేసిన చట్నీని వేసి కలిపితే బీరకాయ చట్నీ రెడీ. ఇది ►ఇడ్లీ, దోశెలు, చపాతీలు, అన్నంలోకి కూడా మంచి రుచినిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment