
సాక్షి, హైదరాబాద్: కల్తీ విత్తనాలు అమ్మితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. అసెంబ్లీలో ఆదివారం ప్రశ్నోత్తరాల సమయంలో సమీకృత మార్కెట్లపై ప్రశ్నకు సంబంధించి కల్తీ విత్తనాల బెడద ఉందని సభ్యులు ప్రస్తావించగా సీఎం కేసీఆర్ జోక్యం చేసుకొని సమాధానం ఇచ్చారు.
కల్తీ విత్తనాల బెడద ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే ఎక్కువగా ఉందన్నారు. వాటిని నియంత్రించేందుకు పీడీ యాక్ట్ తెచ్చామని చెప్పారు. పీడీ యాక్ట్ ఎందుకని కేంద్రం చెప్పినా, మంత్రి నిరంజన్‌రెడ్డి ఢిల్లీ వెళ్లి దీనిపై వారిని ఒప్పించి, పోరాడి సాధించారని వివరించారు. పీడీ యాక్ట్ కింద అనేకమందిపై కేసులు నమోదు చేశామనీ అయినా కొందరు మారడం లేదన్నారు. అవసరమైతే మరిన్ని కఠిన చర్యలు చేపడతామన్నారు.
జనాభాకు అనుగుణంగా మార్కెట్లు లేవు
హైదరాబాద్‌లో జనాభాకు అనుగుణంగా మార్కెట్లు లేవని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కోటికిపైగా జనాభా ఉన్న హైదరాబాద్‌లో సరిపడా వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లు లేవన్నారు. హైదరాబాద్ మార్కెట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించామని సీఎం తెలిపారు. చాలా కూరగాయల మార్కెట్లు పరిశుభ్రంగా లేకుండా మురికి, మట్టి, దుమ్ములో కూరగాయలు అమ్మే పరిస్థితి ఉండేదని చెప్పారు. ఈ నేపథ్యంలో సమీకృత వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు.
మోండా మార్కెట్ మోడల్‌గా..: రెండు లక్షల జనాభాకు ఒక మార్కెటైనా ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని కేసీఆర్ వివరించారు. నిజాం హయాంలో కట్టిన మోండా మార్కెట్‌ని చూసి తాను ఆశ్చర్యపోయానన్నారు. ‘125 ఏళ్ల కింద కట్టిన మోండా మార్కెట్ చాలా శాస్త్రీయంగా ఉంది. పాతది అయినా జాలీలు ఉన్నాయి. మాంసమైనా, కూరగాయలు అయినా అక్కడ 2.5 ఫీట్ల ఎత్తులో పెట్టి అమ్ముతారు. ఈ పద్ధతిలోనే సమీకృత మార్కెట్లను అన్ని జిల్లాల్లో నిర్మించాలని సూచించాం’ అని సీఎం చెప్పారు.
చదవండి: సభలో నవ్వులే నవ్వులు..ప్రధాని భజన బృందంపై పిట్ట కథను వినిపించిన సీఎం కేసీఆర్
Comments
Please login to add a commentAdd a comment