‘సీమ’ ఇంట.. రెండో పంట | Cultivation in Rayalaseema with heavy rains | Sakshi
Sakshi News home page

‘సీమ’ ఇంట.. రెండో పంట

Published Thu, Dec 5 2019 3:42 AM | Last Updated on Thu, Dec 5 2019 9:07 AM

Cultivation in Rayalaseema with heavy rains - Sakshi

అనంతపురంలో వరినాట్లు వేస్తున్న మహిళలు (ఫైల్‌)

సాక్షి, అమరావతి: ‘మా చేలల్లో ఈ కాలంలో విత్తనాలు వేసి 15 ఏళ్లు దాటిందనుకుంటా. మళ్లీ ఇంతకాలానికి ఇప్పుడు వేశాం. ఎంత సంతోషంగా ఉందంటే మాటల్లో చెప్పలేను. ఎర్ర నేలల్లో వానలు పడందే రెండో పంట వేయలేం. మా అదృష్టం బాగుండి ఈ ఏడాది కురిసిన వానలతో రెండు పంటలు వేశాం. వేరుశనగ పీకాం. ఇప్పుడు 8 ఎకరాల్లో ఉలవ వేశా. మా అప్పులు తీరినట్టే’నని సంబరపడుతున్నాడు అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బొమ్మేపర్తికి చెందిన రైతు డి.వెంకటరాముడు. ‘తొలకరి తప్ప రెండో పంట తెలియదు నాకు. 17, 18 సంవత్సరాల తర్వాత ఈ ఏడాది మా ఊళ్లో ఎటుచూసినా పచ్చగా కనిపిస్తోంది.

చెరువులు, బావులు, కుంటల కింద తప్ప పంటలు తెలియవు నాకు. అలాంటిది ఇప్పుడు మా ఊరి పొలాల్లో జొన్న, సజ్జ, ఉలవ వేశారు’ అని అంటున్నాడు కర్నూలు జిల్లా బసాపురంలో ఆరు ఎకరాల్లో జొన్న పంట వేసిన రామన్న. ఇలా ఒకరి ద్దరు కాదు.. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లా ల్లోని అన్నదాతల ఆనందం ఇది. సుదీర్ఘకాలం తర్వా త కురిసిన, కురుస్తున్న వర్షాలకు రైతులు ఈ ఏడాది రబీ సీజన్‌లో రెండో పంటను సాగు చేస్తున్నారు. ఎప్పుడు వేసినా ఒక పంటతోనే సరిపెట్టుకునే వీరు ఈసారి అనుకూల వాతావరణంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. అన్ని చోట్లా రిజర్వాయర్లు, కుంటలు, చెరువులు నీళ్లతో తొణికిసలాడుతున్నాయి. భూ గర్భ జల మట్టం కూడా పెరిగింది.

ప్రస్తుత వర్షాలూ అనుకూలమే..
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రాయలసీమ ప్రాంతంలో రెండో పంటకు అనుకూలంగా మారాయి. దీంతో ఆరుతడి పంటల్ని పెద్దఎత్తున సాగు చేస్తున్నారు. ‘గత పాతికేళ్లలో మా ప్రాంతంలో ఇంత పెద్దఎత్తున రెండో పంట వేయడం ఇదే మొదటి సారి’ అని అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన జి.గంగయ్య యాదవ్‌ చెప్పారు. ప్రకాశం, నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాలలో రబీ సాగు విస్తీర్ణ లక్ష్యం 11,59,453 హెక్టార్లు. ఇందులో ఇప్పటికే 5,56,213 హెక్టార్లు సాగులోకి వచ్చింది. కరవుకు నెలవైన అనంతపురం జిల్లాలో సైతం ఇప్పటికే 99 శాతం విస్తీర్ణం సాగులోకి రావడం విశేషం. ఏటా పంట విత్తే సమయంలో రైతులు పెట్టుబడి కోసం ఇబ్బంది పడేవారు. అప్పుల కోసం వ్యాపారుల చుట్టూ తిరిగే వారు. ఈ ఏడాది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఈ పరిస్థితిని సమూలంగా మార్చి వేసింది. వైఎస్సార్‌ రైతు భరోసా పథకంతో రైతులను, కౌలు రైతులను ఆదుకుంది. ఒక్కో రైతుకు ఏటా రూ.13,500 వస్తుంది. ఇందులో సింహ భాగం ఇప్పటికే రైతు ఖాతాల్లో జమ కావడంతో వ్యవసాయం పండుగగా మారింది. 

ఆరుతడి పంటలు భారీగా సాగు
ఆరుతడి పంటలుగా ఉన్న ఉలవ, జొన్న, సజ్జ, శనగ, పొద్దు తిరుగుడు, జనుము పంటల్ని పెద్దఎత్తున సాగు చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో రబీ పంటల సాగు దాదాపు పూర్తయింది. చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో సుమారు 75 శాతం విస్తీర్ణంలో, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 50 శాతం విస్తీర్ణంలో పంటల్ని సాగు చేశారు. అంతా అనుకూలంగా ఉంటే రబీ సీజన్‌లో ఉలవ 25 వేల హెక్టార్లలో సాగవుతుంది. కానీ ఈ ఏడాది ఇప్పటికే 37 వేల హెక్టార్లలో పంట వేశారు. శనగ నిర్ణీత సాగు విస్తీర్ణం 4.42 లక్షల హెక్టార్లు కాగా ఇప్పటికి 3.09 లక్షల హెక్టార్లలో సాగయింది. జొన్న నిర్ణీత సాగు విస్తీర్ణం 1.14 లక్షల హెక్టార్లయితే ఇప్పటికి 55 వేల హెక్టార్లలో విత్తారు. సీజన్‌ ముగిసే నాటికి సాగు విస్తీర్ణం పరిపూర్తి అవుతుందని వ్యవసాయ అధికారుల అంచనా.

పశువుల మేతకు ఇబ్బంది తప్పినట్టే..
తొలి పంట చాలక రెండో పంట లేక వేసవి వస్తే గ్రాసం లేక మూగజీవాలను కబేళాలకు తోలాల్సి వచ్చేది. ఈ ఏడాది ఆ పరిస్థితి తప్పిందని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన అమీన్‌ అభిప్రాయపడ్డారు. ఉలవ, జొన్న, సజ్జ వంటి వాటితో పశువుల్ని కాపాడుకోవచ్చని చెప్పారు. వేసవిలో పొట్టచేతబట్టుకుని వలస పోయే పరిస్థితి తప్పుతుందని రైతు నాయకుడు భరత్‌ కుమార్‌ చెప్పారు. 

ఆరుతడి పంటలు భారీగా సాగు
ఆరుతడి పంటలుగా ఉన్న ఉలవ, జొన్న, సజ్జ, శనగ, పొద్దు తిరుగుడు, జనుము పంటల్ని పెద్దఎత్తున సాగు చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో రబీ పంటల సాగు దాదాపు పూర్తయింది. చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో సుమారు 75 శాతం విస్తీర్ణంలో, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 50 శాతం విస్తీర్ణంలో పంటల్ని సాగు చేశారు. అంతా అనుకూలంగా ఉంటే రబీ సీజన్‌లో ఉలవ 25 వేల హెక్టార్లలో సాగవుతుంది. కానీ ఈ ఏడాది ఇప్పటికే 37 వేల హెక్టార్లలో పంట వేశారు. శనగ నిర్ణీత సాగు విస్తీర్ణం 4.42 లక్షల హెక్టార్లు కాగా ఇప్పటికి 3.09 లక్షల హెక్టార్లలో సాగయింది. జొన్న నిర్ణీత సాగు విస్తీర్ణం 1.14 లక్షల హెక్టార్లయితే ఇప్పటికి 55 వేల హెక్టార్లలో విత్తారు. సీజన్‌ ముగిసే నాటికి సాగు విస్తీర్ణం పరిపూర్తి అవుతుందని వ్యవసాయ అధికారుల అంచనా.

మా పంటలు బాగున్నాయి..
నా పేరు  వీరన్నగౌడ్‌. మాది బొమ్మనహాళ్‌ మండలం బొల్లనగుడ్డం గ్రామం. నాకు హెచ్చెల్సీ చివరి ఆయకట్టు 9వ డిస్ట్రిబ్యూటరీ కింద 20 ఎకరాల పొలం ఉంది. గత 20 ఏళ్లలో ఎన్నడూ ఈసీజన్‌లో పంట చేతికొచ్చిన ఘటన లేదు. సరైన వర్షాలు పడలేదు. ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నంగా ఉంది. సకాలంలో వర్షాలు పడ్డాయి. నాకున్న 20 ఎకరాల్లో జొన్న పంట వేశా. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన వేళావిశేషమో ఏమో.. జలాశయాలు నిండుకుండల్లా ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement