ఎరువు.. బరువుగా మారిన వేళ | Telangana Ranks-1st Among States Usage Most Fertilizers In the Country | Sakshi
Sakshi News home page

ఎరువు.. బరువుగా మారిన వేళ

Published Thu, Jan 12 2023 1:32 AM | Last Updated on Thu, Jan 12 2023 8:21 AM

Telangana Ranks-1st Among States Usage Most Fertilizers In the Country - Sakshi

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఎకరాకు పదివేల రూపాయల పెట్టుబడి సాయం.. ఉచితంగా నిరంతర విద్యుత్‌.. పండిన పంటలను మద్దతు ధరతో కొనుగోలు.. వీటికి అదనంగా ఐదేళ్లకొక మారు పంట రుణమాఫీ. తెలంగాణలో వ్యవసాయాన్ని పండగలా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా అమలు చేస్తున్న పథకాలివి. కానీ ఇక్కడ వ్యవసాయం రైతులకు పండుగలా మారిందా? అంటే లేదనే అంటోంది మెజారిటీ రైతాంగం. సాగు విస్తీర్ణం, పంట దిగుబడి పెరిగినా.. తమ కష్టమంతా ఎరువులు, పురుగు మందులు, కూలీలు తదితర ఖర్చు­లకే సరిపోతోందని అంటున్నారు.

దేశంలో అత్యధికంగా ఎరువులు వాడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి వరుసలో నిలవడం గమనార్హం. హెక్టారుకు సగటున 206 కిలోల ఎరువులు వాడుతున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. సారవంతమైన భూములు, చాలినన్ని సాగునీళ్లు ఉన్నా.. విపరీతంగా పెరిగిన ఎరువుల వాడకం, ఇతర ఖర్చుల వ­ల్ల.. రైతుకు సాగు సంబురంగా మారడం లేదని ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు. ప్రధానంగా ఎరువుల ఖర్చును తగ్గించుకుంటే ఎక్కువ ఫలితం దక్కుతుందని, పంటల మార్పిడితో ఎరువుల వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు అంటున్నారు. 

ఎరువుల వినియోగంలో టాప్‌ 
ఆహారోత్పత్తిని, మొక్కలకు పోషకాలు, భూసా­రాన్ని పెంచేందుకు రైతులు నత్రజని, భాస్వరం, పొటాషియం (ఎన్‌పీకే) భారీగా వినియోగిస్తున్నారు. తెలంగాణ 2018–19లో దేశంలోనే అత్యధిక ఎరువుల వినియోగంతో మొదటి స్థానంలో (హెక్టారుకు 245 కిలోలు) నిలవగా, 2019–20లో నాలుగో స్థానంలో (హెక్టారుకు 206 కిలోలు) నిలిచిందని ఫెర్టిలైజర్‌ అసోసియేషన్‌ వెల్లడించింది. అయితే దేశ సగటు వినియోగం 133.1 కిలోలు మాత్రమే కావడం గమనార్హం. అవసరానికి మించి ఎరువుల వాడకం వల్ల ఏకంగా 200 మండలాల్లోని భూముల్లో భారీగా భాస్వరం నిల్వలు పేరుకు పోయాయని జయశంకర్‌ వ్యవసాయ యూనివర్సిటీ తాజా పరిశోధనలో తేలింది. పేరుకుపోయిన భాస్వరం నిల్వల నుంచి భూసార పరిరక్షణ చేపట్టేందుకు ప్రత్యేక కార్యాచరణను నిర్దేశించినా అది ఇంకా పంట పొలాలకు చేరువ కాలేదు.

ఇదీ సాగు లెక్క.. 
రాష్ట్ర జనాభాలో 48.4 శాతం మందికి వ్యవసాయమే ఉపాధి.  
2018 నుంచి రైతుబంధు కింద 63 లక్షల మందికి ఎకరానికి ఏటా రూ.10 వేల చొప్పున అందుతున్న పెట్టుబడి సాయం. 
బావులు, లిఫ్ట్‌లు, చెరువులు, చెక్‌డ్యామ్‌ల ద్వారా రాష్ట్రంలోసాగవుతున్న భూమి 1.36 లక్షల ఎకరాలు 
గడిచిన ఐదేళ్లలో వరి ఉత్పత్తి పెరిగింది. అత్యధిక ఎరువుల వినియోగం ఉన్నా.. సగటు ఉత్పత్తిలో పంజాబ్‌ కంటే వెనకే ఉంది. 
25.92 లక్షల వ్యవసాయ మోటార్లకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్‌ ఇస్తోంది.  
అత్యధికంగా మెదక్, జనగామ, నాగర్‌కర్నూల్, సిద్దిపేట జిల్లాల్లో వ్యవసాయ విద్యుత్‌ వినియోగం అవుతోంది. 

రైతులు, ఉన్న భూమి లెక్కలు ఇలా
2.47 ఎకరాలలోపు.. 64.6 శాతం
2.48 – 4.94 ఎకరాలు.. 23.7 శాతం
4.95– 9.88 ఎకరాలు.. 9.5 శాతం
9.89 –24.77 ఎకరాలు.. 2.1 శాతం
24.79 కంటే ఎక్కువ.. 0.2 శాతం 

అత్యధికంగా ఎరువులు వినియోగించిన రాష్ట్రా లు 

ఎరువులు, మందులకే రూ.47,600 ఖర్చు 
నాకున్న ఐదెకరాల భూమిలో పత్తి సాగు చేసిన. ఆదాయం చూస్తే పెట్టుబడి ఖర్చులు కూడా పూర్తిగా రాలా. ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అనుకున్నా. అధిక వర్షాల కారణంగా నాలుగు క్వింటాళ్లే వచ్చింది. క్వింటాకు రూ.8 వేల చొప్పున విక్రయిస్తే రూ.1.60 లక్షలు రాగా, రూ.1,61,450 పెట్టుబడి పెట్టా. ఇందులో యూరియా, క్రిమిసంహారక, పూత మందులకే రూ.47,600 ఖర్చయ్యాయి. దీంతో పడిన కష్టానికి ఫలితం లేకుండా పోయింది. 
–బలరాం, పత్తి రైతు తిగుల్, సిద్దిపేట జిల్లా 

ఐదెకరాలు సాగు చేస్తే రూ.55 వేలే మిగిలింది 
ఐదు ఎకరాల్లో వరి సాగు చేస్తే రెక్కల కష్టానికి తగిన ఫలితం కూడా మిగలలేదు.  సాగు కోసం రూ.1.2 లక్షలు ఖర్చు పెడితే 100 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది.  అమ్మితే రూ.2 లక్షలు వచ్చా­యి. విత్తనాల ఖర్చు నుంచి, నాటు వరకు రూ.45 వేల ఖర్చు కాగా, ఎరువులకు రూ.18 వేలు అయ్యాయి. పంటకోత, ఆరబెట్టేందుకు రూ.14 వేలు, మోటార్ల మరమ్మతుకు రూ.4 వేలు, 3 మోటార్ల నిర్వహణకు, ఏడాది కరెంటు బిల్లు రూ. 2,250 అయింది. ఖర్చులు పోను రూ.80 వేలు మిగిలితే.. పెట్టుబడి వడ్డీలకు రూ.25 వేలు పోయింది, ఆర్నెల్ల పాటు భార్యా­­భర్తలం ఇద్దరం కలిసి పనిచేస్తే రూ.55 వేలు మాత్రమే మిగిలింది.     
–లెక్కల ఇంద్రసేనారెడ్డి, రైతు, దేవరుప్పుల, జనగామ జిల్లా  

వ్యయం తగ్గాలి.. మద్దతు పెరగాలి 
పలు కారణాలతో పంట ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగిపోయింది. ఈ మేర పంట మద్దతు ధర పెరగలేదు. దీంతో పిల్లల చదువులు, ఆరోగ్యం విషయాల్లో మిగిలిన సమాజంతో రైతులు పోటీ పడలేకపోతున్నారు. ప్రభుత్వం అనేక రకాలుగా చేయూతనిస్తున్నా.. ఫలితం ఉండటం లేదు. ఉత్పత్తి వ్యయం తగ్గించడంతో పాటు, రైతులకు ఇచ్చే మద్దతు ధరలు పెంచాల్సి ఉంది.  
– ప్రొఫెసర్‌ కె.ముత్యంరెడ్డి, అధ్యక్షుడు, తెలంగాణ ఎకనమిక్‌ అసోసియేషన్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement