
అబ్దుల్ మహ్మద్ అలీ
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ముంబై వీధుల్లో చేజింగ్ చేశారు. ఓ వ్యక్తిని సీబీక్యూ సీడ్స్ పేరుతో మోసం చేసిన నైజీరియన్ కోసం పరుగులు పెట్టారు. దాదాపు కిలోమీటరున్నర వెంటాడిన తర్వాత నేరగాడిని పట్టుకోగలిగారు. నిందితుడిని నగరానికి తరలించిన పోలీసులు శుక్రవారం జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. సైబరాబాద్ పరిధిలో నివసించే ఓ వ్యక్తికి కొన్నాళ్ల క్రితం ఫేస్‌బుక్ ద్వారా ఓ సందేశం వచ్చింది. అమెరికాకు చెందిన డాక్టర్ వెన్నిస్సా విల్సన్ పేరుతో పరిచయం చేసుకున్న ఓ యువతి తమకు సీబీక్యూ సీడ్స్ సరఫరా చేయాలని కోరింది. ఈ విత్తులు న్యూజిలాండ్, భారత్‌ల్లో మాత్రమే లభిస్తాయంటూ చెప్పింది. లాభాల్లో 50 శాతం వాటా ఇస్తాననడంతో ఈ వ్యాపారం చేయడానికి బాధితుడు అంగీకరించాడు. దీంతో విల్సన్ సదరు విత్తుల్ని మీరాశర్మ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సరఫరా చేస్తుందంటూ ఓ ఫోన్ నంబర్ ఇచ్చింది.
బాధితుడు ఆ నంబర్‌లో సంప్రదించగా.. మీరాశర్మగా మాట్లాడిన యువతి 500 గ్రాములకు రూ.1.85 లక్షలు ఖర్చవుతుందని, ఆ మొత్తం జమ చేయమంటూ ఓ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇచ్చింది. గత నెల 23న బాధితుడు ఆ ఖాతాలోకి నగదు జమ చేశాడు. ఇది జరిగిన ఐదు రోజులకు కొరియర్‌లో నకిలీ విత్తనాలు వచ్చి చేరాయి. ఆపై మోసగాళ్ల నుంచి స్పందన కరువు కావడంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్ ఎస్.హరినాథ్ దర్యాప్తు చేపట్టారు. బాధితుడు డబ్బు డిపాజిట్ చేసిన బ్యాంకు ఖాతా నంబర్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుల్ని పట్టుకోవడానికి ముంబై వెళ్లారు. అయితే బ్యాంకు రికార్డుల్లో ఉన్నది నకిలీ అడ్రస్‌గా తేలింది.
ఇదిలా ఉండగా.. బాధితుడికి నిందితుల నుంచి ఓ సందేశం వచ్చింది. విత్తనాలు తీసుకుని ముంబై వస్తే వాటిని పరీక్షించి సర్టిఫికేషన్ చేయిద్దామంటూ అందులో ఉంది. దీంతో బుధవారం అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం ముంబైలోని భాండ్వా కుర్లా కాంప్లెక్స్ వద్ద కాపు కాసింది. అక్కడకు వచ్చిన ఓ నైజీరియన్‌ను పట్టుకోవ డానికి ప్రయత్నించగా అతడు పారిపోయే ప్రయ త్నం చేశాడు. దీంతో అతడిని వెంటాడిన సైబర్ క్రైమ్ పోలీసులు దాదాపు కిలోమీటరున్నర ఛేజ్ చేసి పట్టుకున్నారు. నిందితుడు నైజీరియా నుంచి వచ్చి ముంబైలో ఉంటున్న అబ్దుల్ మహ్మద్ అలీగా గుర్తించారు. అతడిని నగరానికి తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరికొందరు నిందితుల కోసం గాలిస్తున్నారు.