
రూ.1.5 కోట్ల స్వాహా కేసులో నిందితుల అరెస్టు
తన వద్ద ఉన్న 5.6 మిలియన్ డాలర్లతో వ్యాపారం చేద్దామంటూ నిజామాబాద్‌కు చెందిన వ్యాపారితో యువతిలా చాటింగ్ చేసి..
⇒ నైజీరియన్లను హైదరాబాద్ తీసుకొచ్చిన పోలీసులు
⇒ ఢిల్లీ వీధుల్లో జరిగిన ఛేజింగ్ వీరి కోసమే
సాక్షి, హైదరాబాద్: తన వద్ద ఉన్న 5.6 మిలియన్ డాలర్లతో వ్యాపారం చేద్దామంటూ నిజామాబాద్‌కు చెందిన వ్యాపారితో యువతిలా చాటింగ్ చేసి.. రూ.1.5 కోట్లు చీటింగ్ చేసిన ముఠాకు చెందిన ఇద్దరు నైజీరియన్లను హైదరాబాద్ నగర నేర పరిశోధన విభాగం(సీసీఎస్) ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం నగరానికి తీసుకువచ్చారు. వీరిని పట్టుకునే ప్రయత్నంలో సోమవారం ఢిల్లీలో ఛేజింగ్ చేసిన విషయం విదితమే. నిజామాబాద్ ప్రాంతానికి చెందిన వ్యాపారి సాయిప్రసాద్ అక్కడ, హైదరాబాద్‌లోనూ వ్యాపారాలు చేస్తున్నారు. ఇతడి ఫేస్‌బుక్ ఖాతా ద్వారా అమెరికా యువతి మెర్సీ ఫ్రాన్సిస్‌గా చెప్పుకున్న నైజీరియన్లు క్రిస్టీ విలియమ్స్, మార్షల్ పరిచయమయ్యారు.
కొన్ని రోజులు సాధారణ చాటింగ్ చేసిన వీరు.. ఆపై తాను అమెరికా ఆర్మీలో అధికారినని, ఐక్యరాజ్యసమితి దళాల్లో ఉండి 2015 నుంచి ఇరాక్‌లో విధులు నిర్వర్తిస్తున్నానని చెప్పుకొచ్చారు. అనివార్య కారణాల నేపథ్యంలో తన వద్ద ఉన్న 5.6 మిలియన్ డాలర్లను రెడ్‌క్రాస్ ఏజెంట్ విలియమ్స్ వద్ద డిపాజిట్ చేసినట్లు నమ్మించారు. వాటిని భారత్‌కు పంపిస్తానని సాయిప్రసాద్‌కు చెప్పారు. ఆ మొత్తం వెచ్చించి వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలని, వచ్చిన లాభంలో సగం వాటా ఇవ్వాలని ‘బంపర్ ఆఫర్’ ఇచ్చారు. వల్లో పడిన వ్యాపారి నుంచి కస్టమ్స్ క్లియరెన్స్ మొదలు భారత ప్రభుత్వ అనుమతుల వరకు వివిధ రకాలైన పేర్లు చెప్పి డబ్బు దండుకోవడం మొదలెట్టారు. రూ.1.5 కోట్లు నష్టపోయిన బాధితుడు ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఏసీపీ కేసీఎస్ రఘువీర్ ఆదేశాల మేరకు ఇన్‌స్పెక్టర్ కేవీఎం ప్రసాద్ నేతృత్వంలోని బృందం ఢిల్లీ కేంద్రంగా ఈ మోసం జరిగినట్లు గుర్తించింది. మోసగాళ్లు మరో రూ.26 లక్షలు ఇవ్వాలని సాయిప్రసాద్‌తో సంప్రదింపులు జరుపుతుండటంతో ఢిల్లీ వెళ్లిన ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ నేతృత్వంలోని బృందం డెకాయ్ ఆపరేషన్ చేపట్టింది. సాయిప్రసాద్ ద్వారానే సైబర్ నేరగాళ్లను సంప్రదించి వారిని ఓ ప్రాంతానికి రప్పించింది. తొలుత మార్షల్‌ను.. భారీ ఛేజింగ్ తర్వాత క్రిస్టీ విలియమ్స్‌ను పట్టుకున్నారు. వీరిని అక్కడి కోర్టులో హాజరుపరిచి పీటీ వారెంట్‌పై బుధవారం నగరానికి తీసుకొచ్చారు.