నేరస్తుల అరెస్టు చూపుతున్న తాడేపల్లిగూడెం పోలీసులు
పశ్చిమగోదావరి, తాడేపల్లిగూడెం అర్బన్: మహిళనంటూ నమ్మించి.. ఫేస్‌బుక్ ఖాతా ద్వారా ఒక వ్యక్తి నగ్న ఫొటోలు సంపాదించి రూ.5.7 లక్షల మేర మోసగించిన కేసులో ఇద్దరు వ్యక్తులను తాడేపల్లిగూడెం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. తాడేపల్లిగూడెం సీఐ ఆకుల రఘు వెల్లడించిన వివరాల ప్రకారం.. పాలకొల్లుకు చెందిన తన్నీడి నాగరాజు, గుత్తుల మురళీకృష్ణబాబు ఫేస్‌బుక్‌లో మహిళ పేరిట ఖాతా తెరిచి అదే ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులతో పరిచయం పెంచుకున్నారు. ఒక మహిళ సాయం తీసుకుని అర్థనగ్నంగా ఉన్న ఫొటోలు ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఒక వ్యక్తికి పంపారు. అనంతరం ఆ వ్యక్తిని నగ్న ఫొటోలు పంపాలని కోరారు. ఫేస్‌బుక్ ఖాతా మహిళదేనని నమ్మిన ఆ వ్యక్తి తన ఫొటోలు పంపాడు. ఆ ఫొటోల్ని ఉపయోగించుకుని బాధితుడిని బెదిరించాడు.
ఆ ఫొటోల్ని ఫేస్‌బుక్‌లో పెడతామని బెదిరించి.. బాధితుడి నుంచి దాదాపు రూ. 5.70 లక్షలు వసూలు చేశారు. మళ్లీ ఇటీవల తాము తాడేపల్లిగూడెంలో ఉన్నామని తమకు రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత డబ్బు తన వద్ద లేదని చెప్పడంతో ఫొటోలు సోషల్‌మీడియాలో పెడతామని బెదిరించారు. తన వద్ద రూ.50వేలు ఉన్నాయని చెప్పడంతో.. వాటిని తాడేపల్లిగూడెం వచ్చి ఇవ్వాలని నిందితులు సూచించారు. ఈ సమయంలో బాధితుడు తాడేపల్లిగూడెం పోలీసులను ఆశ్రయించాడు. నాగరాజు, మురళీకృష్ణరాజులు చెప్పిన ప్రదేశానికి బాధితుడు సొమ్ముతో వెళ్లాడు. అప్పటికే సీఐ ఆకుల రఘు సూచనల మేరకు మాటువేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. గురువారం నిందితులను రిమాండ్‌కు తరలించారు. నిందితులను పట్టుకోవడంలో ఎస్సైలు గుర్రయ్య, రమేష్, ఏఎస్సై వెంకన్నబాబు, హెడ్ కానిస్టేబుళ్లు శ్రీనివాసు, సూర్యచంద్రరావు తదితరులు చాకచక్యంగా వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment