సాక్షి, హైదరాబాద్ : దిశపై జరిగిన దారుణాన్ని ఓ పక్క యావద్భారతం ముక్త కంఠంతో ఖండిస్తుంటే... కొందరు పోకిరీలు మాత్రం విజ్ఞత మరిచి ప్రవర్తిస్తున్నారు. మరణానంతరమూ ఆమెను ఉద్దేశించి ఫేస్‌బుక్ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేస్తున్నారు. ఈ తరహాలో శనివారం నమోదు చేసిన కేసులో నిందితుడిగా ఉన్న శ్రీరామ్‌ను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసినట్లు సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి పేర్కొన్నారు.
నిజామాబాద్‌లోని నవీపేట్ మండల ఫకీరాబాద్‌కు చెందిన చవన్ శ్రీరామ్ ఐటీఐ పూర్తి చేశాడు. కొన్నాళ్ల పాటు ఓ హోటల్‌లో కార్మికుడిగా పని చేసినా ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. ఇతడికి ఫేస్‌బుక్‌లో స్టాలిన్ శ్రీరామ్ పేరుతో ఖాతా ఉంది. దిశ ఉదంతం నేపథ్యంలో ఆమెను ఉద్దేశించి తన వాల్‌పై శ్రీరామ్ అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు పోస్ట్ చేశాడు. వీటిని వ్యతిరేకిస్తూ పలువురు చేసిన కామెంట్స్‌తో ఇవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
దీంతో స్పందించిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ వ్యవహారంపై శనివారం సుమోటోగా కేసు నమోదు చేశారు. సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ ఎన్.మోహన్‌రావు నేతృత్వంలోని బృందం ఈ కేసును సాంకేతికంగా దర్యాప్తు చేసింది. ఆ ఆధారాలను బట్టి శ్రీరామ్ నిందితుడిగా గుర్తించి నిజామాబాద్ జిల్లా ఫకీరాబాద్‌లో ఉండగా మంగళవారం అరెస్టు చేసింది. ఈ తరహాలోనే మరికొందరు తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా కామెంట్స్ చేస్తున్నట్లు గుర్తించామని, వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment