జీవ వైవిధ్యంతోపాటు వ్యాపార కేంద్రంగా సియోల్‌లోని హాన్ నది
(సియోల్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) ఒకప్పుడు మురికికూపంగా ఉన్న హాన్ నదిని మూడు దశల్లో అభివృద్ధి చేయాలని 2008లో నిర్ణయించిన దక్షిణ కొరియా ప్రభుత్వం తొలిదశలో నీటిశుద్ధితోపాటు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దింది. స్థానికులతోపాటు విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు నదిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసింది. నదికి ఇరువైపులా తేలియాడే రెస్టారెంట్లు, రూఫ్‌టాప్ గార్డెన్లు, కేఫటేరియాలు, 40కిపైగా షాపింగ్ కాంప్లెక్స్‌లు, యాంఫీ థియేటర్లను నిర్మించింది.
పిల్లలంతా ఆహ్లాదంగా గడిపేందుకు వీలుగా 15 పార్క్‌లను అభివృద్ధి చేసింది. 78 కి.మీ. మేర సైకిల్ ట్రాక్‌లు, బైక్ పాత్‌లను ఏర్పాటు చేసింది. నదిలో జీవవైవిధ్యం దెబ్బతినకుండానే ఈ చర్యలన్నీ చేపట్టింది. దీంతో స్థానిక ప్రజలతోపాటు విదేశీ పర్యాటకులను ఆకర్షించే హాట్‌స్పాట్‌గా హాన్ నది మారింది.
నదిలో బోటింగ్, నదీ తీరం వెంబడి సైక్లింగ్, వాకింగ్ ట్రాక్స్, పార్క్‌లతో నిత్యం సందర్శకులతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడుతోంది. ప్రస్తుతం ఏటా సగటున 6.69 కోట్ల మంది పర్యాటకులు హాన్ నదిని సందర్శిస్తున్నారు.
తాగునీటి అవసరాలు సైతం తీరుస్తూ..
దక్షిణ కొరియాలోని సియోల్ నగరవాసుల తాగునీటి అవసరాలను హాన్ నదే తీరుస్తోంది. హైదరాబాద్ జంటనగరవాసుల దాహార్తిని గతంలో ఎలాగైతే మూసీ తీర్చిందో.. అచ్చం అలాగే హాన్ నది సియోల్ ప్రజలకు జీవనదిగా మారింది.
స్వచ్ఛమైన మంచినీటిని సియోల్‌వాసులకు అందించేందుకు హాన్ నది పరీవాహక ప్రాంత పరిధిలో నాలుగు చోట్ల నీటి ఫిల్టరేషన్ కేంద్రాలను అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నదిలోని నీటి నాణ్యత మెరుగ్గా ఉందని ఐరాస సైతం గుర్తించింది.
Comments
Please login to add a commentAdd a comment