Han river
-
హాన్, మూసీ మధ్య పోలికలెన్నో!
(సియోల్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) అధిక పట్టణీకరణ, కాలుష్యం కారణంగా ఏదైనా నది ప్రాభవం కోల్పోతే దాని పునరుజ్జీవం ఆ ప్రాంత ఆర్థికాభివృద్ధిలో భాగమే. దక్షిణ కొరియా వేగవంతమైన ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్న హాన్ నదే అందుకు ఉదాహరణ. వరదల నియంత్రణతోపాటు పర్యావరణ సమతౌల్యతను కాపా డుతూ వినోద, పర్యాటక కేంద్రంగా పట్టణ నదులను ఎలా అభివృద్ధి చేయవచ్చో హాన్ నది నిరూపిస్తోంది. మూసీ నది ని పునరుద్ధరించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. అందు లో భాగంగా దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని హాన్ నదిని అధ్యయనం కోసం ఎంపిక చేసుకుంది. రెండు నదుల మధ్య చాలా పోలికలు ఉండటమే అందుకు కారణం.విజయవంతమైన హాన్ రివర్ ఫ్రంట్ అభివృద్ధి..సియోల్‌లో స్థిరమైన పట్టణాభివృద్ధికి విజయవంతమైన నమూనాగా హాన్ రివర్ ఫ్రంట్ నిలుస్తోంది. సియోల్ నగర సామాజిక, సాంస్కృతిక రంగాలను హాన్ నది ప్రతిబింబిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా నీటి నాణ్యతను మెరు గుపరచడంతోపాటు నది ఒడ్డునున్న పర్యావరణ వ్యవస్థ లను పునరుద్ధరించారు. ఫలితంగా సియోల్‌లో ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గాలి నాణ్యత మెరుగుపడింది. జీవ వైవిధ్యం పునరుద్ధరణ సైతం జరిగింది. హాన్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు విజయం అంత సులువుగా జరగలేదు. స్థిరమైన పట్టణ ప్రణాళిక, నది నిర్వహణ కోసం భారీ ఎత్తున అక్కడి ప్రభుత్వం పెట్టుబడులు పెట్టింది. పాలకుల చిత్తశుద్ధి, సుస్థిరతతో నది సుందరీకరణతోపాటు ప్రజా వినోద కేంద్రంగా హాన్ గణనీయమైన అభివృద్ధిని సాధించింది. హాన్ నదిని సియోల్ నగరంలో వరద నీటి నియంత్రణ, నీటి నిర్వహణ కోసం కూడా వినియోగిస్తున్నారు.మూసీ పునరుజ్జీవం అనివార్యమే..సహజ వనరుల సంరక్షణతోపాటు హైదరాబాద్‌లో పట్టణ పునరుద్ధరణ, పర్యావరణ పునరావాసానికి మూసీ పునరుజ్జీ వం అనివార్యమే. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగ రాల దాహార్తిని తీర్చిన మూసీ.. కాలక్రమేణా మురికి కూపంగా మారిపోయింది. గృహ, పారిశ్రామిక వ్యర్థాలు కలవడంతోపాటు ఆక్రమణలకు సైతం గురైంది. ఫలితంగా మూసీ చుట్టూ ఉన్న సాంస్కృతిక, వారసత్వ సంపద నాటి ప్రాభ వాన్ని, ప్రాముఖ్యతను కోల్పోయింది. మూసీ పునరుద్ధరణ, పునరుజ్జీవం కోసం గతంలో ప్రతిపాదనలు సిద్ధమైనా కార్యరూపం మాత్రం దాల్చలేదు.మూసీ–హాన్ నదుల మధ్య భౌగోళిక సారూప్యతలు ఇవీ..హాన్» దక్షిణ కొరియా ఉత్తర భాగంలోని తైబెక్ సన్మేక్ పర్వతాల్లో పుట్టిన హాన్ నది.. గాంగ్వాన్, జియోంగ్లీ, ఉత్తర చుంగ్‌చియాంగ్ ప్రావిన్సుల ద్వారా సియోల్ నగరంలోకి ప్రవేశిస్తుంది. ఈ నగరంలో సుమారు 40 కి.మీ. మేర ప్రవహిస్తూ పశ్చిమాన ఉన్న ‘ఎల్లో సీ’లో కలుస్తుంది.» దీని మొత్తం పొడవు 514 కి.మీ.కాగా సియోల్ నగరంలో 40 కి.మీ. మేర ప్రవహిస్తుంది.మూసీ» వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ.. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ గుండా హైదరాబాద్‌లోకి ప్రవేశిస్తుంది. పాత, కొత్త నగరాలను రెండుగా విభజిస్తూ పురా నాపూల్, డబీర్‌పురా, అంబర్‌పేట, చాదర్ ఘాట్, ఉప్పల్ మీదుగా నగరం నడిబొడ్డు నుంచి మిర్యాల గూడ సమీపంలోని వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది.» మూసీ నది మొత్తం పొడవు 240 కి.మీ. కాగా హైదరాబాద్‌లో 57.5 కి.మీ. మేర ప్రవహిస్తుంది. -
తేలియాడే రెస్టారెంట్లు.. రూఫ్‌టాప్ గార్డెన్లు
(సియోల్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) ఒకప్పుడు మురికికూపంగా ఉన్న హాన్ నదిని మూడు దశల్లో అభివృద్ధి చేయాలని 2008లో నిర్ణయించిన దక్షిణ కొరియా ప్రభుత్వం తొలిదశలో నీటిశుద్ధితోపాటు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దింది. స్థానికులతోపాటు విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు నదిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసింది. నదికి ఇరువైపులా తేలియాడే రెస్టారెంట్లు, రూఫ్‌టాప్ గార్డెన్లు, కేఫటేరియాలు, 40కిపైగా షాపింగ్ కాంప్లెక్స్‌లు, యాంఫీ థియేటర్లను నిర్మించింది.పిల్లలంతా ఆహ్లాదంగా గడిపేందుకు వీలుగా 15 పార్క్‌లను అభివృద్ధి చేసింది. 78 కి.మీ. మేర సైకిల్ ట్రాక్‌లు, బైక్ పాత్లను ఏర్పాటు చేసింది. నదిలో జీవవైవిధ్యం దెబ్బతినకుండానే ఈ చర్యలన్నీ చేపట్టింది. దీంతో స్థానిక ప్రజలతోపాటు విదేశీ పర్యాటకులను ఆకర్షించే హాట్‌స్పాట్‌గా హాన్ నది మారింది. నదిలో బోటింగ్, నదీ తీరం వెంబడి సైక్లింగ్, వాకింగ్ ట్రాక్స్, పార్క్‌లతో నిత్యం సందర్శకులతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడుతోంది. ప్రస్తుతం ఏటా సగటున 6.69 కోట్ల మంది పర్యాటకులు హాన్ నదిని సందర్శిస్తున్నారు.తాగునీటి అవసరాలు సైతం తీరుస్తూ..దక్షిణ కొరియాలోని సియోల్ నగరవాసుల తాగునీటి అవసరాలను హాన్ నదే తీరుస్తోంది. హైదరాబాద్ జంటనగరవాసుల దాహార్తిని గతంలో ఎలాగైతే మూసీ తీర్చిందో.. అచ్చం అలాగే హాన్ నది సియోల్ ప్రజలకు జీవనదిగా మారింది. స్వచ్ఛమైన మంచినీటిని సియోల్వాసులకు అందించేందుకు హాన్ నది పరీవాహక ప్రాంత పరిధిలో నాలుగు చోట్ల నీటి ఫిల్టరేషన్ కేంద్రాలను అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నదిలోని నీటి నాణ్యత మెరుగ్గా ఉందని ఐరాస సైతం గుర్తించింది. -
నదిని శుద్ధి చేసే సిమెంటు చేప
హైదరాబాద్‌లో మూసీ, బెజవాడలో కృష్ణ, కోల్‌కతాలో హూగ్లీ.. ఇలా ప్రతి నగరంలోనూ కాలుష్యంతో నిండిన నది ఏదో ఒకటి ఉంటుంది. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోనూ హాన్ నది ఉండనే ఉంది. మనమేమో వందల కోట్లు గుమ్మరించి సీవరేజ్ ట్రీట్మెంట్లు కట్టేసి.. నదినీటిని శుభ్రం చేసేయాలని తంటాలు పడుతున్నామా... సియోల్ దీనికి భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంది. నదివెంబడి ... ఇదిగో ఇలా ఫొటోల్లో కనిపిస్తున్నట్లు అందమైన నిర్మాణాలను చేపట్టనుంది. ఏంటి వీటి స్పెషాలిటీ అంటే బోలెడన్ని అని చెప్పక తప్పదు. ముందుగా... నదిలో షికారు చేసే ఫెర్రీ బోట్లు నిలిపే బోట్ స్టేషన్‌గా పనికొస్తాయి ఇవి. దాంతోపాటే ఈ స్టేషన్ ప్రాంతంలో తీరం వెంబడి చిత్తడి నేలల్లో రకరకాల మొక్కలు పెంచుతారు. వీటివల్ల నీరు సహజసిద్ధంగా శుభ్రమైపోతుందన్నమాట. అంతేకాకుండా ఈ మొక్కల కారణంగా నది తాలూకూ గట్టు కూడా పటిష్టంగా మారి వరదల సమయంలో ముంపు ప్రమాదం తగ్గుతుంది. స్టేషన్‌పైన ఒక అంతస్తులో నదిని, అటుపక్కనున్న నగరాన్ని చూసేందుకు ఏర్పాట్లు ఉంటే.. రెండో అంతస్తుపై సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు తో పాటు.. పచ్చటి మొక్కలు, క్రికెట్ బ్యాట్ల తయారీలో వాడే విల్లో వృక్షాలు పెంచుతారట. ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ విన్సెంట్ కాలబోట్ డిజైన్ చేసిన ఈ బోట్ స్టేషన్.. మాంటా రే అనే చేప ఆకారాన్ని పోలి ఉంటుంది. అందుకే ఈ ప్రాజెక్టుకూ అదే పేరు పెట్టేశారు. నీటిని శుద్ధి చేసేందుకు కేవలం మొక్కలపైనే ఆధారపడలేదు. పై అంతస్తు అంచుల్లో దాదాపు 3500 చదరపు మీటర్ల మేర సోలార్‌ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. దీంతోపాటు నిలువుగా తిరిగే గాలి మరలనూ వాడుకుంటారు. బోట్ స్టేషన్‌కు ఆనుకుని నదీతీరం వెంబడి ఉండే పార్కుల్లోంచి సేకరించే సేంద్రీయ వ్యర్థాలను బయోమెథనైజేషన్ ప్లాంట్‌కు సరఫరా చేసి అదనపు విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. ఇలా వేర్వేరు మార్గాల ద్వారా ఉత్పత్తి చేసిన విద్యుత్తును నీటిశుద్దీకరణకు వాడుకుంటారన్నమాట. భలే ఐడియా కదూ! – సాక్షి నాలెడ్జ్ సెంటర్